ఉత్తరాది పార్టీలకు తెలంగాణలో ఆదరణ ఉంటుందా? అనే ప్రశ్న ఇప్పుడు ఎందుకు వేసుకోవలసి వస్తోందంటే కొన్ని ఉత్తరాది పార్టీలు తెలంగాణా మీద దృష్టి పెడుతున్నాయి కాబట్టి. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం సంపాదించకపోయినా కనీసం కొన్ని సీట్లైనా సాధించాలని ఆలోచిస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ప్రయత్నాలు తప్పకుండా చేస్తుంది. అందులో తప్పులేదు.
కానీ ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారన్నదే పాయింటు. కేసీఆర్ ప్రభుత్వమా మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న అభిప్రాయం దాదాపు అన్ని పార్టీల్లో ఉంది. ఇప్పటికైతే రాబోయే ఎన్నికల్లో అధికారం మాదే అంటూ బీజేపీ, కాంగ్రెస్ రెండు రంకెలు వేస్తున్నాయి. గర్జిస్తున్నాయి, గాండ్రిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు తెలంగాణలో ఎప్పటినుంచో రాజకీయాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రాలో సుదీర్ఘకాలం అధికారంలో ఉంది కూడా.
తెలంగాణా ఇచ్చింది కాంగ్రెస్ అయినప్పటికీ రాష్ట్ర విభజన తరువాత అది అధికారంలోకి రాలేకపోయింది. తెలంగాణా సాధించిన క్రెడిట్ టీఆర్ఎస్ కొట్టేసింది. రాష్ట్రం ఏర్పడ్డాక రెండుసార్లు గులాబీ పార్టీయే అధికారం దక్కించుకుంది. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం దానికి అధికారం దక్కదని కాంగ్రెస్ అండ్ బీజేపీ బల్ల గుద్ది చెబుతున్నాయి. టీఆర్ఎస్ పట్ల నిజంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందో లేదో గానీ ఆ రెండు పార్టీలు మాత్రం జోరుగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ అయితే కేసీఆర్ ను జైలుకు పంపుతాం అంటోంది.
సరే …అధికారంలోకి వస్తామని బీజేపీ అండ్ కాంగ్రెస్ అంటే అర్ధం ఉంది. ఆ రెండు పార్టీలకు ప్రజల్లో ఆదరణ ఉంది. కేడర్ బలం ఉంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగలిగే అవకాశం ఉంటే గింటే బీజేపీకి ఉంటుంది గానీ కాంగ్రెస్ కు ఛాన్స్ ఉండకపోవచ్చు. కానీ ఏమాత్రం బలం, ఆదరణ లేని ఉత్తరాది పార్టీలు బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్ ) కూడా తెలంగాణలో తిష్ట వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్ర విభజన తరువాత జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ పోటీ చేసి రెండు స్థానాలు గెలుచుకుంది.
కానీ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిపోయారు. ఒకాయన మంత్రి అయ్యాడు. దాంతో ఆ పార్టీ కథ ముగిసింది. అయితే కొంతకాలం కిందట ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరాడు. ఆ పార్టీకి రాష్ట్ర కన్వీనర్ అయ్యాడు. కానీ పార్టీ ముందుకు పోతున్న సూచనలు కనబడటంలేదు. ఇక ఢిల్లీలో అధికారంలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆప్ ఈ మధ్య పంజాబ్ లో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఆ పార్టీ తెలంగాణలో ప్రవేశించే ప్రయత్నాలు చేస్తోంది.
ఆల్రెడీ ఆ పార్టీ రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించింది. కన్వీనర్ కూడా ఉన్నాడు. ఇప్పుడు బలపడే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇటు బీఎస్పీకి గానీ, అటు ఆప్ కు గానీ పేరున్న పెద్ద నాయకులు లేరు. కేడర్ లేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ జన సమితి పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ పరిపాలనను వ్యతిరేకిస్తూ, ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న కేసీఆర్ తీరును నిరసిస్తూ కోదండరాం తెలంగాణ జన సమితి పార్టీతో ప్రజల్లోకి వెళ్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో రాణించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కోదండరాం పార్టీ తెలంగాణ లో పెద్దగా ఆదరణ పొందుతున్న దాఖలాలు కనిపించలేదు. తాజాగా పంజాబ్ లో ప్రభంజనం సృష్టించి అధికారాన్ని చేజిక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ కోదండరాం పార్టీ ని ఆమ్ ఆద్మీ పార్టీలో విలీనం చేయాలని ప్రతిపాదనలు పెట్టినట్టు సమాచారం. తెలంగాణ జన సమితి పార్టీని విలీనం చేయడం గురించి ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి కోదండరాం తో పాటు, ముఖ్య నేతలంతా హాజరయ్యారు.
ఈ విషయం పై కోదండరాం పార్టీ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది నేతలు తెలంగాణ జన సమితి పార్టీని ఆమ్ఆద్మీ పార్టీలో విలీనం చేయడానికి మొగ్గు చూపినట్లు గా తెలుస్తుంది. అయితే టీజేఎస్ అధినేత కోదండరాం మాత్రం ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా అప్పటి దాకా వేచి చూసే ధోరణి అవలంబిద్దామని, అప్పుడు పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుందామని నాయకులకు సూచించినట్టు సమాచారం. పంజాబ్ ఎన్నికల్లో విజయం తర్వాత జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్రంపై కూడా ఫోకస్ చేస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.