ఆంధ్రజ్యోతి దినపత్రిక మత్తులో జోగుతోంది. మొన్న గుట్కా, నేడు మద్యం. మత్తు ఎక్కడానికి ఏ సరుకైతేనేం అన్నట్టుంది ఆంధ్రజ్యోతి వ్యవహారం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎక్సైజ్ అధికారులు శుక్రవారం నిర్వహించిన దాడుల్లో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శంకర్‌నాయక్ ఇంట్లో భారీగా మద్యం పట్టుబడింది. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఇంటి నుంచి 368 బాటిళ్ల కర్నాటక మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో మద్యం దుకాణాలు మూసివేయడాన్ని సొమ్ముగా చేసుకునేందుకు రిపోర్టర్ హోదాను శంకర్‌నాయక్ అడ్డు పెట్టుకున్నట్టు సమాచారం. లాక్‌డౌన్ సమయంలో అక్రమంగా మద్యం విక్రయించినట్లు అతనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అతని ఇంటిపై దాడి చేయడం, మద్యం పట్టుబడడంతో ఆంధ్రజ్యోతి వార్తల్లోకెక్కింది.
అలాగే ఈ నెల ఒకటిన సోమవారం కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక రవాణా వాహనంలో అక్రమంగా గుట్కా ప్యాకెట్లు తరలిస్తూ కర్నూలు జిల్లా బొమ్మలసత్రం రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలుకు చెందిన వీరబ్రహ్మేంద్ర ఆచారి కొంతకాలంగా తుపాన్ వాహనంలో ఆంధ్రజ్యోతి పత్రిక కాపీలను రవాణా చేస్తున్నాడు. కర్నూలుకు చెందిన గుట్కా వ్యాపారి సుబ్బయ్యతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆంధ్రజ్యోతి వాహనంలో గుట్కాపాకెట్లను సరఫరా చేసేవాడు. ఈ నేపథ్యంలో ఆ రోజు తెల్లవారుజామున పత్రికల మధ్య రెండు గుట్కా ప్యాకెట్ల బస్తాలను దాచుకుని నంద్యాలకు బయలుదేరాడు.
డీఎస్పీ చిదానందరెడ్డి, సీఐ దివాకర్‌రెడ్డి సిబ్బందితో వాహనాల తనిఖీ చేస్తుండగా వీరబ్రహ్మేంద్రఆచారి పోలూరు గ్రామం వైపు వాహనాన్ని మళ్లించాడు. ఎస్‌ఐ తిమ్మారెడ్డి వాహనం వెంటపడ్డాడు. చివరకుఅతను పట్టుబడ్డాడు. ఆంధ్రజ్యోతి పత్రికా వాహనం తో పాటు గుట్కా పాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. వరుస అసాంఘిక కార్యకలాపాలకు ఆంధ్రజ్యోతి ఆయుధంగా మారింది. అందరి గురించి వార్తలు రాసే ఆంధ్రజ్యోతే…అసాంఘిక కార్యకలాపాల కారణంగా వార్తల కెక్కడం చర్చనీయాంశమైంది.