“రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల ఆందోళనలు, జీతం పెంచాలంటూ నిరసన ప్రదర్శలు, ఆందోళనకారులపై విరిగిన లాఠీలు..” టీడీపీ అనుకూల మీడియా చిలువలు పలువలుగా చేసి పెట్టిన హెడ్డింగులు ఇవి. ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే వార్త కాబట్టి.. అసలా ఆందోళన గురించి వైసీపీ సొంత మీడియాలో చిన్న వార్త కూడా లేదు. ఎవరు ఔనన్నా, కాదన్నా.. వాలంటీర్ల ఆందోళనలు వాస్తవమే, అక్కడక్కడా అవి ఉద్రిక్తతకు దారి తీసిన మాట కూడా నిజమే.
అసలీ ఆందోళనలు ఎందుకు.. ఊరిలోనే పనిచేసుకోడానికి వీలు కల్పించి, సెల్ ఫోన్ ఉచితంగా ఇచ్చి, నెలనెలా రీచార్జిలు చేయించినందుకా..? లేక నిన్నగాక మొన్నొచ్చిన రేషన్ ట్రక్ డ్రైవర్లు అడిగిన వెంటనే 5వేల రూపాయలు జీతం పెంచినందుకా..?
వాలంటీర్ల విధులేంటి..?
వాలంటీర్లకు రూ.5వేలు గౌరవ వేతనం మాత్రమే ఇస్తామని, వారు ఇంకే పనులు చేయకూడదని, వారు ప్రభుత్వం తరపున చేయాల్సిన పనులు ఇవీ అని గతంలోనే స్పష్టంగా ప్రభుత్వం చెప్పింది. అందుకు సిద్ధపడినవారిని మాత్రమే వాలంటీర్ పోస్ట్ ల కోసం తీసుకున్నారు. ఇబ్బంది పడినవారు మధ్యలోనే మానేశారు, కొత్తవారు వచ్చారు. ఇలా జరుగుతోందీ వ్యవహారం.
పనిభారం పెరిగినా, లోలోపల అసంతృప్తి ఉన్నా కూడా.. వాలంటీర్ అనే పోస్ట్ ని ఎవరూ శాశ్వత ఉపాధిగా చూడటం లేదు. అవసరానికో, లేక ఊరిలో అందుబాటులో ఉండొచ్చనో, గృహిణిగా ఉంటూ వాలంటీర్ గా పనిచేయొచ్చనో, పొలం పనులు, ఇతర పనులు చేసుకుంటూ వాలంటీర్ గా వెళ్లొచ్చనో చాలామంది ఆలోచించారు, దానికి సిద్ధపడ్డారు. అది ఇష్టంలేనివారు, కష్టంగా ఉందనుకున్నవారు రోజుల వ్యవధిలోనే రాజీనామా చేశారు.
రూ.5వేల కోసం పనిచేయాలంటూ ఎవరూ ఎవర్నీ బలవంతపెట్టలేదు, స్వచ్ఛందంగా వస్తేనే పని చేయించుకుంటున్నారు, లేనివారు తమకి నచ్చిన పని చేసుకోడానికి వెళ్లిపోతున్నారు.
రేషన్ ట్రక్ డ్రైవర్లతో పోలిక ఎందుకు..?
తాజాగా రేషన్ ట్రక్ డ్రైవర్లతో పోల్చి చూసుకునేసరికి వాలంటీర్లలో అసంతృప్తి మొదలైంది. రేషన్ ట్రక్ డ్రైవర్లుగా విధుల్లోకి వచ్చినవారంతా ఆయా కార్పొరేషన్ల లబ్ధిదారులు. వారికి ప్రభుత్వం తరపున వాహనాన్ని ఇచ్చి ఇంటింటికీ వెళ్లి రేషన్ సరకులు ఇచ్చిరావాలంటూ పురమాయించింది.
వారికి మొదట్లో ఇస్తామన్న 16వేల రూపాయలలో ట్రక్ ఈఎంఐ పోను, సహాయకుడికి ఇచ్చే వేతనం పోను.. పెట్రోలు, ఇతర ఖర్చులు పోను వాహన యజమానికి మిగిలేది చాలా తక్కువ. అందులోనూ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కార్యక్రమానికి మొదట్లోనే ఇబ్బందులు రావడం ఇష్టంలేక అడిగిన వెంటనే ఆలోచించి మరీ వారికి వేతనాన్ని పెంచారు. దీంతో వాలంటీర్లు ఆందోళనబాట పట్టారు. తమకి కూడా వేతనాలు పెంచాలనే డిమాండ్ వినిపించారు.
ప్రభుత్వం ముందున్న మార్గం ఏంటి..?
వాలంటీర్ వ్యవస్థని పనికిమాలిన పనిగా విమర్శించిన ప్రతిపక్షాలు ఇప్పుడు వారిపై లేనిపోని జాలి చూపిస్తున్నాయి. వాలంటీర్లకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ గొంతు కలిపాయి. నిరసన చేస్తున్నవారిపై ప్రతిపక్ష నాయకులకు ప్రేమ లేదు, వారికి ఉందల్లా సీఎం జగన్ పై కోపం.
వాలంటీర్ల జీతం పెంచితే ఖజానా ఖాళీ అవుతుందని, డబ్బులెక్కడినుంచి వస్తాయో చూద్దామనే కుట్రపూరిత ఆలోచన మాత్రమే. అందుకే ప్రతిపక్షాలు వాలంటీర్ల ఆందోళనను హైలెట్ చేశాయి, హైజాక్ చేశాయి.
ప్రతిఫలం పెంచకుండా, పని తగ్గిస్తారా..?
వాలంటీర్ పోస్ట్ ప్రభుత్వ ఉద్యోగం కాదు, ఆ మాటకొస్తే.. సచివాలయ ఉద్యోగాలు కూడా ఇంకా పర్మినెంట్ చేయలేదు. విధి నిర్వహణలో సమర్థంగా వ్యవహరించి ప్రభుత్వానికి తోడ్పాటునందిస్తే భవిష్యత్తులో కచ్చితంగా పర్మినెంట్ చేస్తారు.
వాలంటీర్లపై పని ఒత్తిడి తగ్గించడంపై ప్రభుత్వం దృష్టిసారిస్తే.. సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభిస్తుంది. ఆ తర్వాత జీతాల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.