అఖండ్ భారత్.. ఆర్ఎస్ఎస్ నినాదాల్లో ఒకటి. ఆర్ఎస్ఎస్ మానసపుత్రిక బీజేపీ వరసగా రెండోసారి అధికారం చేపట్టిన నేపథ్యంలో.. చాన్నాళ్లకు ఒక కమలం పార్టీ నేత ఆ నినాదం వినిపించారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ ఈ నినాదాన్ని ప్రస్తావించారు. ఒక రోజుకు కరాచీ ఇండియాలో భాగం అవుతుందంటూ ఫడ్నవీస్ ఒక జోస్యం లాంటిది చెప్పారు! తమది అఖండ భారత నినాదం అని గుర్తు చేసుకున్నారు ఫడ్నవీస్!
కశ్మీర్లో మూడు రోజులకు ఒకసారి పాక్ దాష్టీకాలు కొనసాగిస్తూ ఉంది. ఇటీవలే ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన సైనికులు మరణించారు. ఆ తర్వాత సామాన్య పౌరుల పై కూడా పాక్ వైపు నుంచి కాల్పులు జరిగాయి. గత ఆరేళ్ల కాలంలో నియంత్రణ రేఖ వద్ద లెక్కకు మించిన సార్లు పాక్ దాడులకు తెగబడింది. సర్జికల్ స్ట్రైక్స్ భారత వైపు నుంచి జరిగినా.. పాక్ తీరులో ఎలాంటి మార్పులూ లేవు! అడపాదడపా భారత సైనికులను కోల్పోతూనే ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఎప్పటికి మార్పు వస్తుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో అఖండ భారత్ అంటూ ఒక బీజేపీ నేత మాట్లాడటం విడ్డూరం.
ఆధీనంలో ఉన్న ప్రాంతంలోనే పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడం ఎలా ఉన్నా.. కరాచీని కలిపేస్తాం, కాందహార్ ను గాంధారగా మారుస్తాం అంటూ.. మాటలకు కొదవలేకుండా పోతోంది. అయినా.. ఇప్పుడు బీజేపీ విధానాలను ఎవరైనా వ్యతిరేకిస్తూ మాట్లాడితే.. వాళ్లను పాకిస్తాన్ కు పంపుతామని, వాళ్లే పాకిస్తాన్ కు వెళ్లిపోవాలని భక్తులు డిమాండ్ చేస్తూ ఉంటారు. మరి రేపు పాకిస్తాన్ ను ఇలా ఇండియాలోకి కలిపేసుకుంటే.. అప్పుడు ఇలాంటి వాళ్లందరినీ పంపించేందుకు పాకిస్తానే ఉండదు కదా పాపం!
ఫడ్నవీస్ మాటలను ఎన్సీపీ వాళ్లు కూడా స్వాగతించేశారు. పాకిస్తానే కాదు, బంగ్లాదేశ్ ను కూడా ఇండియాలోకి కలిపేసుకోవాలని.. దానికి తాము మద్దతు పలుకుతున్నట్టుగా ఎన్సీపీ నేత ఒకరు ప్రకటించేశారు. ఇంకేముంది.. చర్చలే జరుపుతారో, దండెత్తుతారో.. బీజేపీ వాళ్ల చేతిలోనే ఉంది. అఖండ భారతం అంటూ సగటు భక్తుడికి రోమాలు నిక్కబొడుచుకునేలా చేయడం ఎలా ఉన్నా.. ఆర్థిక ప్రగతిలో ఇండియా కన్నా బంగ్లాదేశ్ ముందుకు పోతోందట.. ఇలాంటి విషయాలనూ కాస్త పట్టించుకోవాలి. అలాంటి విషయాలు చెబితే భక్తులకు కోపమొస్తుంది, పాకిస్తాన్ కు వెళ్లిపోమంటారు, అలా కాకుండా.. బంగ్లాను కూడా విలీనం చేసేసుకుంటామని బీజేపీ వాళ్లు చెబుతుంటే.. ఆ మాటలే సమ్మగా ఉంటాయి! అప్పుడు బంగ్లా ప్రగతి కూడా భక్తుల ఖాతాలోనే పడుతుంది కదా!