ప్రాణం విలువ అంటే ఏంటో.. తమదాకా వస్తేకాని తెలియదు చాలామందికి. 10 మంది కరోనా రోగుల చావుకి కారణమైన డాక్టర్ రమేష్ కి కూడా ఇప్పుడే ఆ విషయం తెలిసినట్టుంది. ఆయనకు ప్రాణ భయం పట్టుకుంది. అందుకే తాను విచారణకు రాలేనని పోలీసులకు చెప్పారు రమేష్.
కరోనా భయం వల్ల తాను నేరుగా విచారణకు రాలేనని, కావాలంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తనపై విచారణ జరుపుకోవచ్చని పోలీసులకు ఉచిత సలహా ఇచ్చారు రమేష్. బయట కరోనా వ్యాప్తి దారుణంగా ఉందని, తానిప్పుడు బైటకు రావడం తన ప్రాణాలకు సురక్షితమైన వ్యవహారం కాదని పోలీసులకు ఆయన రాసిన లేఖలో పేర్కొన్నారు.
సరైన అనుమతి లేకుండా, సరైన వసతులు లేని హోటల్ లో కొవిడ్ కేర్ సెంటర్ నిర్వహించి 10మంది చావుకి కారణం అయ్యారు రమేష్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రమేష్. రోగుల వద్ద లక్షలకు లక్షలు గుంజేస్తూ మెయింటెనెన్స్ పట్టించుకోకపోవడంతో హోటల్ లో అగ్నిప్రమాదం జరిగి 10మంది దుర్మరణం పాలయ్యారు. ఈ పాపానికి బాధ్యులెవరు. హోటల్ నిర్వాహకులా? అది బాగాలేదని తెలిసీ అందులో కొవిడ్ కేర్ సెంటర్ పెట్టిన ఆస్పత్రి యాజమాన్యమా? ఇద్దరిపై విచారణ జరిపారు పోలీసులు.
తెలివిగా డాక్టర్ రమేష్ కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు. అయితే దర్యాప్తు ఆపేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో పోలీసులు తిరిగి విచారణ మొదలు పెట్టారు. విచారణలో భాగంగా స్టేషన్ కు రావాల్సిందిగా రమేష్ బాబుకి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు రమేష్ బాబు స్పందించిన తీరు మరీ విచిత్రంగా ఉంది.
బైట కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని, కరోనా భయం వల్లే తాను బైటకు రావడంలేదని, మరీ ముఖ్యంగా జనాలు ఎక్కువగా వచ్చే పోలీస్ స్టేషన్ కి తాను రాలేనని చెప్పారు. అంతగా కావాలంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తనపై విచారణ మొదలు పెట్టొచ్చని పోలీసులకు స్పష్టం చేశారు.
ప్రాణం ఒక్క రమేష్ బాబుకే ఉందా, పోలీసులవి ప్రాణాలు కావా? పోలీసులు తమ డ్యూటీ చేస్తున్నప్పుడు సహకరించాల్సిన రమేష్ బాబు, తప్పించుకోవాలని ఇలా మరో ఎత్తుగడ వేసినట్టుంది. ఈ వ్యవహారంపై పోలీసులు ఇంకా స్పందించలేదు. ఒకవేళ పోలీసులు రమేష్ ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేయాలనుకుంటే.. మిగతా కేసుల్లో కూడా నిందితులు ఇలాంటి దొడ్డిదారినే ఎంచుకునే అవకాశం ఉంది. అందుకే పోలీసులు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు.