మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ వేగం పుంజుకుంది. ఈ క్రమంలో సీబీఐ పేరు వింటే పులివెందుల వాసులు హడలిపోతున్నారు. సీబీఐ రెండు గ్రూపులుగా విడిపోయి పులివెందుల, కడప కేంద్రాలుగా విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. సహజంగా హత్య కేసులో అనుమానితులు సీబీఐ అంటే భయపడడంలో అర్థం ఉంది. కానీ ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేని వాళ్లు తామెక్కడ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయాందోళనకు గురి అవుతున్నారు.
వివేకా హత్య కేసులో పులివెందులకు చెందిన ఉదయ్‌కుమార్‌రెడ్డి, సునీల్ యాదవ్, ఎర్రగంగిరెడ్డి, వాచ్‌మన్ రంగన్న తదితర చిన్నాపెద్దా వ్యక్తులు అనుమానితులు. దర్యాప్తులో భాగంగా అనుమానితుల వరకే సీబీఐ విచారణకు పరిమితం అవుతుందని ఎవరైనా అనుకుంటే పొరపాటు. లోతుగా దర్యాప్తు చేసి, ఎలాగైనా దోషులను సమాజం ముందు నిలబెట్టే క్రమంలో సీబీఐ తనదైన రీతిలో ఇన్వెస్టిగేషన్ చేస్తోంది.
ఈ క్రమంలో అనుమానితుల ఇళ్ల ఇరుగుపొరుగు వారిని కూడా సీబీఐ విచారణకు పిలవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదే విషయమై పులివెందులలో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో హత్య కేసులో అనుమానితుడైన ఉదయ్‌కుమార్‌రెడ్డి ఇంటి సమీపం లో నివాసం ఉంటున్న టీచర్ వసుంధరను సీబీఐ విచారణకు పిలిచింది. ఉదయ్ ఏం చేసేవాడు, అతని ఇంటికి ఎవరెవరు వచ్చే వాళ్లు, ఎంతసేపు ఉండేవాళ్లు తదితర ప్రశ్నలు వేసినట్టు తెలిసింది.
అలాగే ఉదయ్ గురించి అతని కుటుంబ సభ్యులు ఏం చెప్పే వాళ్లు, వైఎస్ వివేకాతో అతని అనుబంధం గురించి జనం ఏమని చర్చించుకునే వాళ్లు తదితర ప్రశ్నలకు సమాధానం రాబట్టినట్టు తెలిసింది.
అనుమానితులు లేదా వారి కుటుంబ సభ్యులు చెప్పిన దానికి, ఇరుగుపొరుగు కుటుంబాల వాళ్లు చెప్పే సమాధానాలను పోల్చుకుని ఒక అవగాహనకు రావచ్చనేది సీబీఐ ఆలోచనగా చెబుతున్నారు. మొత్తానికి సీబీఐ వివిధ కోణాల్లో చేస్తున్న విచారణ హాట్ టాపిక్‌గా మారింది.