పిల్లలపై మూడో వేవ్ లో కరోనా తీవ్రంగా రావొచ్చు.. నాలుగు నెలల కిందటే కొందరు సూత్రీకరించిన విషయం ఇది. దీంట్లో లాజిక్ ఏమిటంటే.. ఎవరి లాజిక్ వాళ్లదంతే! అలా జరగొచ్చు, ఇలా కావొచ్చు.. అనే అంచనాల నేపథ్యంలోనే పిల్లలపై కరోనా మూడో వేవ్ లో ఎక్కువ ప్రభావం చూపవచ్చనే విశ్లేషణలు వినిపించాయి. ఎవరి లాజిక్ వారిది కాబట్టి.. ఆ వాదన తేలికగా కొట్టి పడేసేది కూడా కాదు!
ఇక ఇటీవలి కాలంలో కరోనా వైరస్ పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది అంటూ.. సామాన్య ప్రజల్లో కొన్ని ప్రచారాలు సాగుతున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒకే రోజు నాలుగు వందల మంది పిల్లలకు కరోనా పాజిటివ్ గా తేలిందని.. ఇలాంటి ప్రచారాలు వాస్తవంతో సంబంధం లేకుండా సాగిపోతూ ఉన్నాయి!
అయితే.. గమనించాల్సిన అంశం ఏమిటంటే, పిల్లల్లో కరోనా పాజిటివ్ గా తేలడం కేవలం ఇప్పుడు జరుగుతున్నది మాత్రమే కాదు. రెండో వేవ్ పతాక స్థాయిలో ఉన్నప్పుడు, తల్లిదండ్రులు- ఇంట్లో వాళ్లకు కరోనా పాజిటివ్ గా తేలిందంటే వారి పిల్లలకు కూడా కరోనా పాజిటివ్ గానే తేలింది. రెండో వేవ్ లో పిల్లలకు కరోనా సోకకుండా ఏమీ ఉండలేదు. అదే బెంగళూరులోనే సెకెండ్ వేవ్ సమయంలో వేల సంఖ్యలో చిన్నారులకు కరోనా పాజిటివ్ గా తేలింది. కొందరు అసింప్టమాటిక్, మరి కొందరు సింప్టమాటిక్.
ఇక ఇప్పుడు కూడా కరోనా కేసులు వస్తున్న నేపథ్యంలో ఎక్కడైనా పిల్లలకూ పాజిటివ్ గా తేలవచ్చు. అందులో మరీ ఆశ్చర్యం ఏమీ లేదు. ఇలా స్కూళ్లు తెరుస్తారనే వార్తలు వస్తున్నాయో లేదో, ఇంతలోనే.. మళ్లీ పుకార్లు షికారు చేస్తున్నాయి.
అయితే.. ఈ అంశంపై వైద్య పరిశోధకులు చెబుతున్న అంశం ఏమిటంటే, స్కూళ్లు తెరవండి అని! చిన్నారుల ఆరోగ్య పరిస్థితులనూ, దేశ సామాజిక పరిస్థితులను ఎరిగిన వారు ఈ మాట చెబుతున్నారు. స్కూళ్లను తెరవకుండా ఇలా సంవత్సరాలకు సంవత్సరాలను గడిపేయడం వల్ల చాలా దుష్ఫరిణామాలు సంభవిస్తాయని వారు అంటున్నారు.
అందులో ముఖ్యమైనవి.. పేద పిల్లల్లో పోషకాహార లోపం. ఈ దేశంలో చాలా మంది పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో పెట్టే ఆహారమే పోషకాహారం. మధ్యాహ్నభోజన పథకం కోసమైనా పిల్లలను స్కూళ్లకు పంపే ప్రజలు ఇంకా ఉన్నారు ఈ దేశంలో. ఇప్పుడు నెలల కొద్దీ ఆ పిల్లలకు ఆ అవకాశం కూడా లేకపోవడంతో.. వారిలో పోషకాహార లోపం హెచ్చరిల్లే అవకాశం ఉంది.
ఇక పేద వర్గాల్లోనే పిల్లలకు ఎక్కువ నెలలు స్కూళ్లు లేకపోవడం వల్ల మరిన్ని సామాజికమార్పులు కూడా సంభవిస్తాయి. పిల్లలను చాలా మంది బాలకార్మికులుగా మార్చేస్తారు. ఎలాగూ స్కూళ్లు లేవు కదా.. అనే లెక్కలతో వారిని పనులకు పంపడం ఇప్పటికే చాలా చోట్ల కనిపిస్తూ ఉంది. తాపీ మేస్త్రీలు కొందరు తమ పిల్లలను తమ వెంట పనికి తీసుకెళ్తూ ఉంటారు. టీనేజర్లను వాళ్లు ఆ పనులకు తీసుకెళ్తున్నారు.
కేవలం వారనే కాదు.. హై స్కూళ్లు మరి కొంత కాలం మూత పడ్డాయంటే.. చాలా మంది పిల్లలు బాలకార్మికులు కావడం ఖాయం. అలాగే ఆడపిల్లలు అయితే పెళ్లిళ్ల వైపు తల్లిదండ్రులు మొగ్గు చూపవచ్చు. స్కూళ్లు లేకపోవడం వల్ల ఇళ్ల వద్ద ఉండే తమ ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి భారం దించేసుకోవాలనే పేద వర్గాల వారూ బోలెడంత మంది ఉంటారు. దీని వల్ల టీనేజ్, కాలేజ్ దశల్లో ఉన్న ఆడపిల్లల్లో చాలా మందికి తల్లిదండ్రులు బలవంతంగా అయినా పెళ్లిళ్లు చేసే అవకాశాలు క్రమంగా పెరుగుతాయి.
ఇవి పేద- బలహీన వర్గాల ఇళ్లల్లో కచ్చితంగా వచ్చే మార్పులు. ఇక మధ్యతరగతి, ఆ పై తరగతుల వాళ్ల ఇళ్లల్లోని పిల్లలకూ ఈ స్కూళ్ల మూత వల్ల చాలా దుష్పరిణామాలు తప్పేలా లేవు. ఎగువ తరగతుల్లోని పిల్లలు ఇళ్లల్లోనే తింటూ కూర్చోవడం వల్ల స్థూలకాయంతో పాటు రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్త వచ్చు. ఇక మధ్యతరగతి కుటుంబాల్లోనూ పిల్లలు ఎంతసేపే చిన్న చిన్న ఇళ్లు, గదులకే పరిమితం కావడం అంత సానుకూలమైన అంశం కాదు.
అన్నింటికీ మించి.. స్కూళ్లు లేకపోవడం వల్ల పిల్లల్లో చదువుల సంగతెలా ఉన్నా, తమ సాటి వయసు పిల్లలతో కలవకపోవడం వల్ల మానసికమైన ఎదుగుదల సవ్యంగా సాగే అవకాశాలు తగ్గిపోతాయి. గత ఏడాది, ఈ ఏడాదిలో తొలి సారి స్కూలుకు చేర్చాల్సిన వయసు ఉన్న పిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రులకూ ఈ సమస్య ఎదుర్కొంటూ ఉంటారు. ఇతర పిల్లలతో కలవాల్సిన నాలుగైదేళ్ల వయసులో నెలల కొద్దీ పిల్లలు కేవలం తల్లిదండ్రులతో ఇళ్లలోనే ఉండిపోవడం అంత మంచి పరిణామం కాదు.
ఏతావాతా.. స్కూళ్లను సుదీర్ఘకాలం ముసివేయడం వల్ల ఈ సమస్యలన్నీ ఉంటాయి. పైకి పెద్దగా కనిపించకపోయినా.. చాలా తీవ్రమైన సమస్యలే ఇవి కూడా. మూతపడింది స్కూళ్లే కాదు, నలుగురు పిల్లలు కలవడానికి అవకాశం ఉన్న ప్రతీదీ ఇప్పుడు ఇంకా లాక్ డౌన్ లోనే ఉంది. కాబట్టి.. స్కూళ్లను సుదీర్ఘకాలం మూసివేయడం కానీ, లేని పోని పుకార్లను నమ్ముతూ పిల్లలను స్కూళ్లకు పంపడాన్ని వ్యతిరేకించడం కానీ, ఏమంత గొప్ప చర్య అయితే కాదు.
అయితే కరోనాను మరిచిపోవడానికీ లేదు. ఈ విషయంలో వైద్య పరిశోధకులు చెప్పేదేమిటంటే, ఏవైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న పిల్లల విషయంలో మాత్రం జాగ్రత్త వహించమని అంటున్నారు. కొందరు పిల్లల్లో ఉన్న అనారోగ్య సమస్యలు ఇప్పటికే వారి తల్లిదండ్రులకు తెలిసి ఉంటాయి. వీటిల్లో ఆస్మాతో మొదలుపెడితే, గుండె జబ్బులు, ఊబకాయం వంటి సమస్యలున్న పిల్లలను స్కూళ్లకు పంపడానికి కాస్త ఆలోచించుకోవాలని, మిగతా వారిని స్కూళ్లు పంపించడానికి వెనుకాడటం వల్ల పైన పేర్కొన్న తరహా సమస్యలు ఏర్పడవచ్చని వారంటున్నారు.