ఆర్టీసీ సమ్మె.. తొలిసారి హింసాత్మకం

గుండెపోటుతో మరణించిన కార్మికులున్నారు. టెన్షన్ తో మతిస్థిమితం కోల్పోయిన కార్మికులు ఉన్నారు. అంతేతప్ప సమ్మెలో హింసాత్మక సంఘటనలు చాలా తక్కువ. కానీ తొలిసారి ఆర్టీసీ సమ్మె రక్తసిక్తమైంది. ప్రభుత్వ నిర్ణయాలకు నిరసన తెలియజేస్తూ, ఆర్టీసీని…

గుండెపోటుతో మరణించిన కార్మికులున్నారు. టెన్షన్ తో మతిస్థిమితం కోల్పోయిన కార్మికులు ఉన్నారు. అంతేతప్ప సమ్మెలో హింసాత్మక సంఘటనలు చాలా తక్కువ. కానీ తొలిసారి ఆర్టీసీ సమ్మె రక్తసిక్తమైంది. ప్రభుత్వ నిర్ణయాలకు నిరసన తెలియజేస్తూ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఛలో ట్యాంక్ బండ్ కు పిలుపునిచ్చిన కార్మికుల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యక్రమం ఆందోళనకు దారితీసింది.

బారికేడ్లను ఛేదించి ట్యాంక్ బండ్ వైపు దూసుకెళ్లిన కార్మికులపైకి లాఠీలు విరుచుకుపడ్డాయి. కార్మికుల చేతులు, కాళ్లు విరిగాయి. కొందరికి తలలు, ముక్కులు పగిలి రక్తం వచ్చింది. చాలామంది లాఠీ దెబ్బలకు సొమ్మసిల్లి పడిపోయారు. ఒక దశలో పోలీసులు టియర్ గ్యాస్ కూడా ప్రయోగించడంతో ఊపిరి సమస్యలు ఎదుర్కొన్నారు కార్మికులు.

అదే సమయంలో కార్మికులు కూడా తక్కువేం తినలేదు. తమపై విరుచుకుపడిన పోలీసులపై తీవ్రంగా ప్రతిఘటించారు. చేతికందిన వస్తువులతో పోలీసులపై తిరగబడ్డారు. రాళ్ల వర్షం కురిపించారు. దీంతో కొంతమంది పోలీసులు కూడా గాయపడ్డారు. అడిషనల్‌ డీసీపీ రామచంద్రరావు, ఏసీపీ రత్నం, సీఐ సైదిరెడ్డి, ఎస్‌ఐ శేఖర్‌, కానిస్టేబుల్‌ రాజుకు గాయాలయ్యాయి. అనుమతి లేకుండా ట్యాంక్ బండ్ పైకి వచ్చారని పోలీసులు ఆరోపిస్తుంటే.. శాంతియుతంగా ర్యాలీ చేయడానికి అనుమతి నిరాకరణ ఎందుకని కార్మికులు ప్రశ్నించారు.

మొత్తమ్మీద నెల రోజులకు పైగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న కార్మికులు, తొలిసారిగా లాఠీదెబ్బలు తిన్నారు. హింసాత్మక ఘటనలు ఎదుర్కొన్నారు. ఈ ఒక్క రోజే 3వందలకు పైగా నేతలు, కార్మికులు అరెస్టయ్యారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తాజా ఘటనతో కార్మికుల పంతం రెట్టింపు అయింది. ఇకపై మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతంగా చేస్తామని, పోలీసుల్ని పట్టించుకోమని కరాఖండిగా చెబుతున్నారు కార్మికులు.