గంటా శ్రీనివాసరావు.. ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైన తర్వాత.. చంద్రబాబును ఖాతరు చేయడం మానేసిన మాజీ మంత్రి, స్వయానా చంద్రబాబు జమానాలో అత్యంత కీలక మంత్రిగా చక్రం తిప్పిన నారాయణకు వియ్యంకుడు… ఇప్పుడు కాషాయవర్ణం పులిమేసుకున్నారు. అధికారికంగా భాజపా సభ్యత్వం తీసుకోవడం ఇంకా జరగలేదు గానీ.. ఆ లాంఛనం ఒక్కటీ మిగిలింది గానీ.. ఆ రంగు పులుముకునే పర్వం పూర్తయింది. నాలుగు రోజుల కిందట గంటా శ్రీనివాసరావు, ఢిల్లీలో రాంమాధవ్ ను కలిసి.. మాటామంతీ పూర్తి చేసుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పతనం అయినప్పటినుంచి.. ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఎవరి దారి వారు చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. తొలుత గంటా సారథ్యంలోనే 13 మంది ఎమ్మెల్యేలు భాజపాలో చేరుతారన్నట్లుగా బాగా ప్రచారం జరిగింది. వైకాపా వైపు కొందరు చూస్తున్నారనే పుకార్లూ వచ్చాయి. ఎవరు ఏ పార్టీలోకి చేరినా సరే.. అనర్హత వేటు మాత్రం తప్పదని.. స్పీకరు తమ్మినేని సీతారాం ఖండితంగా తేల్చి చెప్పారు. దాంతో గంటా కాస్త మీనమేషాలు లెక్కించారు.
అలాగని తెలుగుదేశంతో కలిసి మెలసి మెలగలేదు. చంద్రబాబు నిర్వహించిన అనేక రివ్యూ మీటింగులకు డుమ్మా కొట్టారు. బాబు ఆదేశాలను పట్టించుకోలేదు. ఆయన వైకాపాలోకి వెళ్లాలని చూస్తున్నట్లు కూడా పుకార్లు వచ్చాయి. అయితే స్థానికంగా వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులతో ఉన్న విభేదాలు అలాంటి అవకాశాలకు గండికొట్టాయి. చివరికి గంటా కమలదళం వైపే మొగ్గారు.
ఆయన నాలుగురోజుల కిందట ఢిల్లీలో రాంమాధవ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీలోకి రావడం గురించి సంప్రదింపులన్నీ పూర్తయ్యాయి. కాకపోతే చేరిక ముహూర్తం వెంటనే ఉండకపోవచ్చునని వినిపిస్తోంది. చేరడం అంటూ జరిగితే.. తెదేపా ఫిర్యాదు చేస్తే.. తమ్మినేని వేటు వేసేస్తారని.. మళ్లీ ఎన్నికలు ఎదుర్కునే పరిస్థితికి గంటా సిద్ధంగా లేరని.. భాజపాలో చేరకుండా.. కాషాయవర్ణం పులుముకుని.. చివరిదాకా ఎమ్మెల్యేగిరీని కాపాడుకునే యోచన కూడా చేస్తున్నారనే ఊహాగానాలు నడుస్తున్నాయి.