Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఏడాదిలోగా రామమందిరం, బాబ్రీ మసీద్!

ఏడాదిలోగా రామమందిరం, బాబ్రీ మసీద్!

అయోధ్యలోని వివాదాస్పద స్థలం రామమందిరానికే చెందుతుందని సుప్రీం ధర్మాసనం విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. వివాదాస్పదమైన 2.7 ఎకరాల భూమిని రామజన్మభూమి న్యాస్ కే కేటాయిస్తూ.. రామాలయ నిర్మాణానికి గాను.. మూడు నెలల్లోగా ఒక ట్రస్ట్ ను ఏర్పాటుచేయాలని కూడా ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. అయితే.. ఎటూ న్యాయపరమైన, సాంకేతికమైన చిక్కులు అన్నీ తొలగినందున ట్రస్ట్ ఏర్పాటు వీలైనంత తొందరగానే జరుగుతుందని... ఆలయ నిర్మాణం కూడా వెంటనే ప్రారంభం అవుతుందని పలువురు భావిస్తున్నారు.

1992లో అప్పటి బాబ్రీ కట్టడాన్ని కూల్చివేయడానికి ముందే అప్పట్లో రామమందిరం కోసం ఒక డిజైనును సిద్ధం చేశారు. దానికి తగినట్లుగా అనేక రాతి స్తంభాలను కూడా శిల్పులతో చెక్కించారు. అవన్నీ 1992 నుంచి ఇప్పటిదాకా అయోధ్యలోనే కట్టుదిట్టమైన భద్రత మధ్య ఒక ప్రదేశంలో ఉంచేశారు. ఆలయ నిర్మాణానికని ప్రాథమికంగా అవసరమయ్యే అనేక పనులు ఇప్పటికే పూర్తయి ఉన్నట్లు లెక్క. ఇక ట్రస్ట్ ఏర్పాటు అనేది చిన్న సాంకేతిక సమస్య. అలాగే నిర్మాణం మొదలుపెట్టడం లాంఛనం మాత్రమే.

రామమందిర నిర్మాణానికి నిధుల కొరత లేనే లేదు. నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు ట్రస్ట్ ఏర్పాటు జరిగిన వెంటనే.. వారి పేరిట దేశవ్యాప్తంగా నిధులు ఇబ్బడి ముబ్బడిగా వెల్లువెత్తుతాయని కూడా అనుకోవచ్చు. నిర్మాణానికి ఇతర సమస్యలు ఎదురయ్యే అవకాశమే లేదు.

ఎందుకంటే.. అటు రాష్ట్రంలో గానీ, ఇటు కేంద్రంలో గానీ.. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే రాజ్యం చేస్తోంది. ఇక ప్రభుత్వపరంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా పనులు జరుగుతాయి. అలాంటి నేపథ్యంలో ఏడాది లోపుగానే రామమందిరం నిర్మాణం పూర్తయిపోయినా కూడా ఆశ్చర్యం లేదని పలువురు భావిస్తున్నారు.

అలాగే బాబ్రీ మసీదుకు అయిదు ఎకరాల స్థలం కేటాయింపు.. నిర్మాణానికి అవసరమైన అనుమతులు లాంటివన్నీ కూడా ప్రభుత్వ పరంగా శరవేగంగా పూర్తవుతాయి. ప్రభుత్వం నిధులు కేటాయించాల్సి వచ్చినా కూడా.. బాబ్రీమసీదుకు వెంటవెంటనే కేటాయింపులు కూడా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే.. సున్నితమైన ఈ విషయంలో.. ముస్లింలు కొందరు తీర్పుపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. వారు తమకు అన్యాయం జరగడం లేదని భావించడానికి బాబ్రీ మసీదు నిర్మాణాన్ని కూడా ప్రభుత్వం వేగంగా పూర్తి చేయవచ్చు.

ఈ కోణంలోంచి ఆలోచించినప్పుడు ఏడాదిలోగా.. మహా అయితే ఒకటిరెండు నెలల తేడాతో.. అయోధ్యలో సరికొత్త రామమందిరం, సరికొత్త బాబ్రీ మసీదులతో.. భారతదేశపు మతసామరస్యం సముజ్వలంగా పరిఢవిల్లుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?