రాజకీయాల్లో సీనియర్ నాయకుడు, బీజేపీలో కొత్త నాయకుడు అయిన మోత్కుపల్లి నరసింహులు అప్పుడే పార్టీ మాటను జవదాటుతున్నాడు. లక్ష్మణ రేఖను దాటాడు. దీనిపై అనుమానాలొస్తున్నాయి. ఆయన మనసులోని మర్మమేమిటని బీజేపీ నాయకులు ప్రశ్నించుకుంటున్నారు. మోత్కుపల్లి వైఖరి చూస్తుంటే గులాబీ పార్టీ పైన ఆయనకు మనసు మళ్లిందా ? అనే అనుమానం వస్తోంది.
ఇందుకు కారణం …మోత్కుపల్లి సీఎం కేసీఆర్ ను పొగడ్తల్లో ముంచెత్తడమే. ఇలా చేయడం బీజేపీ విధానానికి వ్యతిరేకం కదా. కానీ మోత్కుపల్లి మాత్రం తాను చేసింది సరైనదే అంటున్నాడు. ఇంతకూ ఆయన చేసిన పనేమిటి? ఈమధ్యనే కేసీఆర్ దళిత సాధికారత అనే అంశం మీద అఖిలపక్ష సమావేశం పెట్టారు. ఈ సమావేశాన్ని బీజేపీ బహిష్కరించింది. ఈ సమావేశాన్ని కేసీఆర్ దళితులపట్ల చిత్తశుద్ధితో పెట్టలేదని బీజీపీ ఉద్దేశం. అందుకే ఆ పార్టీ నుంచి నాయకులు ఎవరూ వెళ్ళలేదు.
ఎందుకంటే అది పార్టీ అధికారికంగా తీసుకున్న నిర్ణయం కాబట్టి. కానీ మోత్కుపల్లి అసలుసిసలు బీజేపీ నాయకుడు కాదు కదా. తన రాజకీయ మనుగడ కోసం బీజేపీలో చేరాడు. కానీ ఆయన మనసంతా టీఆర్ఎస్ మీద ఉన్నట్లుగా ఉంది. సర్కారు పెట్టిన సమావేశానికి మోత్కుపల్లి వెళ్ళాడు. ఇక అంతే…కేసీఆర్ మాటలకు ఫిదా అయిపోయాడు. ఇక ఆయన్ని పొగడటం మొదలు పెట్టాడు. తెలంగాణ బీజేపీలో మాజీ మంత్రి మోత్కుపల్లి వ్యవహారం దుమారం రేపుతోంది. పార్టీ నేతలంతా ఆయన తీరును తప్పుబడుతోంటే.. తాను మాత్రం చేసిన పనిని పూర్తిగా సమర్థించుకుంటున్నాడు.
ఆల్ పార్టీ మీటింగ్‌కు వెళ్లి ఒక రకంగా బీజేపీని రక్షించానని మోత్కుపల్లి చెప్పుకుంటున్నాడు. లేదంటే బీజేపీపై దళిత వ్యతిరేక ముద్ర పడేదంటూ చెప్పాడు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. పనిలో పనిగా తనను ఇంటర్వ్యూ చేసిన అన్ని ఛానెళ్ల వద్ద కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తాడు. దళితుల అభ్యున్నతి కోసం కేసీఆర్ ఎంతో గొప్ప పనిచేస్తున్నారని పొగిడాడు. ఇలాంటి నిర్ణయం ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోలేదని ప్రశంసించాడు. మరియమ్మ లాకప్‌డెత్ విషయంలో చర్యలు తీసుకుని.. ప్రభుత్వంపై విశ్వాసం పెంచేలా చేసుకున్నారని అభినందించాడు.
పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుమతితోనే తాను కేసీఆర్ సమావేశానికి వెళ్లానని చెప్పాడు. కానీ ఇప్పుడు ఆయన్ను కొందరు నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారన్నాడు. అంతేకాదు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానిస్తే వెళ్లకుండా ఉంటారా అని ఎదురు ప్రశ్నిస్తున్నాడు. అయితే సమావేశానికి వెళ్లడం గురించి ఇప్పటికే దుమారం రేగుతోంటే.. పుండు మీద కారం చల్లినట్టుగా కేసీఆర్ పొగడ్తలతో ముంచేయడం బీజేపీ నేతలను విస్తుపోయేలా చేస్తోంది.
మోత్కుపల్లి వ్యవహారం చూస్తోంటే.. త్వరలో కారెక్కే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆయన టీఆర్ఎస్‌లో చేరాలని అనుకున్నా ఆ పార్టీ నుంచి ఎలాంటి ఆహ్వానం అందకపోవడంతో.. చాలా రోజులు ఎదురుచూసి 2019 లో కమలం పార్టీలో చేరాడు.
టీడీపీలో సుదీర్ఘకాలం కొనసాగిన మోత్కుపల్లి తనకు గవర్నర్ పోస్టు ఇప్పించాలని చంద్రబాబును బాగా బతిమాలుకున్నాడు. చాలా కాలం వెయిట్ చేశాడు. కానీ ఆ పని కాలేదు. చివరకు చంద్రబాబును బండ బూతులు తిట్టి పార్టీ నుంచి బయటకు వచ్చాడు. బయటకు రాగానే టీఆర్ఎస్ లో చేరాలనుకున్నాడు. కానీ వీలు కాకపోవడంతో ఖాళీగా ఉండటం ఎందుకని బీజేపీలో చేరాడు.