టీడీపీలో అసంతృప్తిగా ఉందని గత కొంతకాలంగా దివ్యవాణిపై వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె మంగళవారం మీడియా ముందుకొచ్చారు. తనదైన పంచ్ డైలాగ్‌లతో అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. ప్రత్యర్థి ఎమ్మెల్యే మొదలుకుని సీఎం స్థాయి వరకూ అందర్నీ ఆమె ప్రశ్నించారు. మహిళల రక్షణ కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రమే దిశ యాప్‌ను తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో దిశ యాప్ కేంద్రంగా దివ్యవాణి ఫైర్ అయ్యారు. టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి మీడియాతో మాట్లాడుతూ ప్రత్యర్థులపై సంధించిన ప్రశ్నలేంటో తెలుసుకుందాం. దిశ చట్టంతో ఎంత మందిని శిక్షించారో సమాధానం చెప్పాలని దివ్యవాణి డిమాండ్ చేశారు. అత్యాచారాలకు పాల్పడ్డ వైసీపీ కార్యకర్తలను ఏం చేశారని ఆమె నిలదీశారు. గన్ కంటే ముందు జగన్ వస్తాడన్న గబ్బునోళ్లు, రమ్యశ్రీ కుటుంబానికి ఏం సమాధానం చెబుతాయని ఆమె ప్రశ్నించారు.
అమరావతి ఆడబిడ్డలను ఉద్దేశించి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన వైసీపీ ఎన్నారై విభాగం వారికి ఏం శిక్షలు వేశారని దివ్యవాణి నిలదీశారు. దిశాచట్టం కింద తొలుత శిక్షించాల్సింది ముఖ్యమంత్రినే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజధాని మహిళలను అతి దారుణంగా వేధిస్తూ, పలువురి ప్రాణాలను బలిగొన్న జగన్ ముమ్మాటికీ శిక్షార్హుడే అని ఆమె పెదరాయుడు తీర్పునివ్వడం గమనార్హం. ఇంతకూ రాజధాని అంటే మహిళలే అని ఎందుకనుకుంటున్నారో దివ్యవాణి చెప్పాలనే కామెంట్స్ వినవస్తున్నాయి.
ఆడవాళ్లని అడ్డు పెట్టుకుని రాజధాని సినిమా ఆడిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు …సదరు మహిళలను వేధిస్తున్నట్టా? లేక జగనా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి టీడీపీలోనే తాను ఉన్నానని చెప్పేందుకే దివ్యవాణి తమపై విమర్శలు గుప్పిస్తున్నారని ప్రత్యర్థులు చెబుతుండడం గమనార్హం.