ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అనేక దేశాలు డబ్ల్యూహెచ్ వో మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నాయి. ఐక్యరాజ్యసమితికి అనుబంధ విభాగాల్లో ఒకటైన డబ్ల్యూహెచ్వో అంతర్గత వ్యవహారాల గురించి ఇన్నాళ్లూ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో మిగతా ప్రపంచాన్ని డబ్ల్యూహెచ్వో అలర్ట్ చేయలేదనే ఆరోపణ గట్టిగా వినిపిస్తూ ఉంది. చైనా ఓటు వల్ల డబ్ల్యూహెచ్వో చీఫ్ గా ఎన్నికైన ట్రెడోస్ వల్లనే ఇదంతా జరిగిందని, ప్రపంచాన్ని కరోనా ముప్పు ముంగిటకు తీసుకెళ్లడంలో డబ్ల్యూహెచ్వో పాత్ర చాలా ఉందనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి.
కరోనా వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదని, చైనాతో సంబంధాలను ఇతర దేశాలు తెంచుకోవాల్సిన అవసరం లేదని, కరోనా మనిషి నుంచి మనిషికి వ్యాపించదని… ఇలాంటి విషయాలనే మొదట్లో చెప్పింది డబ్ల్యూహెచ్వో. ఇప్పుడు మాత్రం లాక్ డౌన్ తీశారో అంతే సంగతులంటూ ప్రపంచ దేశాలను బెదరగొడుతూ ఉంది. చైనాను వెనకేసుకు రావడం కూడా డబ్ల్యూహెచ్ వో పై నమ్మకాలను తగ్గించేస్తూ ఉంది.
ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల సంగతి తెలిసిందే. మొదట్లో డబ్ల్యూహెచ్వోకు తాత్కాలికంగా నిధులను ఆపినట్టుగా ప్రకటించిన ట్రంప్ ఆ తర్వాత పూర్తిగా ఆపేసినట్టుగా ప్రకటించారు. ఇక డబ్ల్యూహెచ్వోను అమెరికా పోషించదని తేల్చారు. ఆ సంస్థకు వచ్చే నిధుల్లో ప్రతియేటా 20 శాతం నిధులు అమెరికా నుంచినే వచ్చాయట. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయంతో ఆ సంస్థకు పెద్దన్నలాంటి అమెరికా సహకారం ఆగిపోయినట్టే.
అయితే ఇప్పటికీ ఆ సంస్థకు అమెరికన్ నుంచినే భారీగా నిధులు అందుతున్నాయట. అమెరికా తర్వాత డబ్ల్యూహెచ్వోకు బాగా నిధులు ఇచ్చింది బిల్ గేట్స్. గేట్స్ ఫౌండేషన్ ద్వారా ప్రతియేటా భారీ ఎత్తున డబ్ల్యూహెచ్వోకు నిధుల అందిస్తున్నారు. ఇప్పుడు డబ్ల్యూహెచ్వోకు ఎక్కువ డబ్బులిస్తున్న జాబితాలో గేట్స్ ఫౌండేషన్ మొదటి స్థానంలో నిలవనుంది. ఇక ఆ తర్వాత యూరోపియన్ యూనియన్ కమిషన్ నుంచి కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థకు బాగా నిధులు అందుతున్నాయి.