జనసేనాని, టాలీవుడ్ అగ్రహీరో పవన్‌కల్యాణ్‌కు పదిరోజుల పాటు నిద్ర కరవు చేసిన రోజు ఇదే. ఆయన్ను జీవితాంతం వెంటా డుతున్న చీకటి రోజు ఇదే. ఒక్క నిద్రే కాదు, ఆ బాధతో తిండితీర్థాలు కూడా మానేసిన, గుండె నిండా ఆవేదన నింపిన రోజు ఇదే. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ జీవితాన్ని నీడలా వెంటాడుతున్న ఆ చీకటి రోజు ఇదే ఇదే ఇదే. ఇంతకూ ఆ రోజుకున్న విశిష్టత ఏంటి అంటారా? నేడు జూన్ 2వ తేదీ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు గురైన రోజు ఇది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా తెలుగు రాష్ట్రాలను నాడు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వం విడగొట్టింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌పై తన ప్రేమాభిమానాలను వ్యక్త పరిచే ఉద్దేశంతో నాడు పవన్ అన్న మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి.
“ఆంధ్రప్రదేశ్ విభజన నా హృదయాన్ని గాయపరిచింది. ఆ బాధ, ఆవేదన నాకు పది రోజుల పాటు నిద్రలేని రాత్రులను మిగిల్చింది. అన్నపానీయాలు మానేశాను. నా గుండె లోతుల్లోంచి తన్నుకొస్తున్న ఆవేదనతో చెబుతున్న మాటలివి” అని నాడు పవన్‌కల్యాణ్ అన్నారు.
మరి నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పవన్ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ ఏంటో చూద్దాం.
“ఈ రోజు చరిత్రాత్మకమైంది. కోట్లాది మంది కల సాకారమైన రోజు. దశాబ్దాల కోరిక నెరవేరిన రోజు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ జన్మించిన రోజు. వేలాది మంది బలిదానాలు, కోట్లాది మంది త్యాగాల ఫలం మన తెలంగాణ. తెలంగాణ సాధనలో ప్రాణాలు అర్పించిన త్యాగధనులకు అంజలి ఘటిస్తున్నా. ఈ మహత్కార్యం సాకారం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ జేజేలు పలుకు తున్నా” అని పవన్ ట్విటర్లో పేర్కొన్నారు.
మొత్తానికి సినిమాల్లో కంటే రాజకీయాల్లో పవన్ బాగా నటిస్తారనేందుకు ఇదే ఉదాహరణ అని ఆయన ప్రత్యర్థులు గుర్తు చేస్తున్నారు. తెలుగు తెరపై రాజకీయ పాత్రలో పవన్ జీవిస్తూ తన పాత్రకు న్యాయం చేస్తున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. తెలంగాణ విషయంలో పవన్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారనే ప్రత్యర్థుల విమర్శలకు ఆయన వ్యవహార శైలి బలాన్ని ఇస్తోంది. సమయానుకూలంగా అభిప్రాయాలు మార్చుకుంటూ బతకనేర్చిన పొలిటీషయన్‌గా పవన్ మారారనే విమర్శలు వినిపిస్తున్నాయి.