ఫిబ్రవరి 1.. భారతదేశ ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రోజు. ఎందుకంటే.. ఆరోజే కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటి వరకూ ఎలాంటి ఉరుములు లేవు, కానీ ఆరోజు పిడుగు పడే అవకాశం ఉంది.
“కరోనా సెస్” పేరుతో ఓ భారీ అస్త్రాన్నే సిద్ధం చేసుకున్నారట ప్రధాని మోదీ. నొప్పి తెలియకుండా వాత పెట్టడంలో సిద్ధహస్తుడని పేరున్న ఆయన.. ఈ ఏడాది కరోనా సెస్ పేరుతో దేశ ప్రజలకు షాకివ్వబోతున్నారని తెలుస్తోంది.
20లక్షల కోట్ల బ్రహ్మపదార్థం..
గతేడాది బడ్జెట్ ప్రవేశపెట్టేనాటికి కరోనా కలకలం లేదు. ఆ తర్వాత బడ్జెట్ కేటాయింపుల్ని పక్కనపెట్టి కరోనా కష్టకాలంలో 20లక్షల కోట్ల ప్యాకేజీని ఘనంగా ప్రకటించారు మోదీ. విడతల వారీగా 20లక్షల కోట్లకు లెక్కలు చెప్పారు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్. కానీ ఎవరికి ఏ రకంగా ఈ ప్యాకేజీ లాభం చేకూర్చిందనేది ఓ బ్రహ్మ పదార్థ.
దేశ చరిత్రలోనే తొలిసారి ఘనంగా ప్రకటించిన 20లక్షల కోట్ల ప్యాకేజీ నవ్వులపాలైంది. ఆ ప్యాకేజీని ఈ దఫా బడ్జెట్ లో సర్దుబాటు చేయాలన్నా, అంతకు మించి కరోనా వ్యాక్సినేషన్ కోసం ఖర్చు చేయాలన్నా కరోనా సెస్ తప్పనిసరి. అయితే ఇది ఏ రూపంలో ఉంటుందో, ఎంతమేర సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతుందో వేచి చూడాలి.
వాతలు పెట్టడంలో సిద్ధహస్తుడు మోదీ..
పన్నుల మోత మోగించడంలో ప్రధాని ఎంత సిద్ధహస్తుడో చెప్పడానికి పెట్రోలియం ఉత్పత్తుల రేట్ల పెరుగుదలే పెద్ద ఉదాహరణ. యూపీఏ హయాంతో పోల్చి చూస్తే, ఎన్డీఏ అధికారం చేపట్టాక పెట్రోల్, డీజిల్ రేట్లు ఎన్ని రెట్లు పెరిగాయో లెక్కే లేదు.
అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా కూడా ఆ ఫలితాలు అందుకోలేని ఒకేఒక దేశంగా భారత్ పేరు తెచ్చుకుంది. ఒక్క భారత్ లో మాత్రమే చమురు రేట్లు తగ్గలేదు. ఇక అంతర్జాతీయంగా బ్యారెల్ రేట్లు పెరిగితే మాత్రం భారత్ లో ఆ ప్రభావం రెండింతలు ఉండేది.
అసలు గ్యాస్ సబ్సిడీ మాటే ప్రజలు మర్చిపోయారు. నగదు బదిలీ పేరుతో సబ్సిడీని అరకొరగా మార్చేశారు. వాణిజ్య సిలిండర్ అంటూ రేట్లు భారీగా పెంచేశారు. ఇక జీఎస్టీ పేరుతో రాష్ట్రాలను దారుణంగా దెబ్బకొట్టింది కేంద్రం. రాష్ట్రాల ఆదాయానికి గండి కొట్టింది.
అదేమని అడిగితే మరో రూపంలో కోత పెడతామంటూ బెదిరించి మరీ రాష్ట్రాల నోరు కట్టేశారు మోదీ. అలాంటి మోదీ కరోనా కష్టకాలంలో పేదలపై జాలి చూపిస్తారనే ఆశలు ఎవరికీ లేవు. ఏదో ఒక రూపంలో కరోనా ఉద్దీపన ప్యాకేజీని సర్దుబాటు చేయాలి, అదే సమయంలో వ్యాక్సినేషన్ కు అవసరమయ్యే ఖర్చు కూడా జమ రాయాలి.
అందుకే సాధారణ పన్నుల భారం పెంచుతూనే.. ప్రత్యేకంగా కరోనా సెస్ ప్రవేశ పెట్టబోతున్నారని విశ్వసనీయ సమాచారం. మోదీ షాక్ ఏ రేంజ్ లో ఉంటుందనేది మాత్రం ఫిబ్రవరి 1నే తేలుతుంది.