రెండూ సంప్రదాయాలే. కానీ తమ సంప్రదాయం కోసం తమిళ ప్రజలు ఎందాకైనా పోరాడతారు. తెలుగు ప్రజలు మాత్రం జైళ్లలో కుక్కినా కిక్కురుమనరు.
ఒకటి జల్లికట్టు కాగా రెండోది కోడి పందాలు. వాస్తవానికి కోడిపందేలతో పోల్చి చూస్తే జల్లికట్టుతోనే ప్రమాదం ఎక్కువ. తీవ్ర గాయాలపాలవ్వడమే కాకుండా.. చనిపోయేవారి సంఖ్య కూడా ఎక్కువే. అలాంటి జల్లికట్టుని సుప్రీంకోర్టు కూడా అడ్డుకోలేకపోయింది.
సోకాల్డ్ జంతు ప్రేమికులు కూడా నోరు తెరిచి మాట్లాడలేని పరిస్థితి. రాహుల్ గాంధీ అయినా, ప్రధాని మోదీ అయినా.. జల్లికట్టుకి జై అనాల్సిందే. లేకపోతే తమిళనాట ఎవ్వరికీ ఎంట్రీ ఉండదు.
ఇక కోడిపందేల విషయానికొద్దాం..
ప్రతి ఏడాదీ కోర్టులు కోడిపందేలపై కఠినంగా ఉండాలని చెబుతూనే ఉంటాయి. అటు పోలీసులు పందేలు ఆడితే తాట తీస్తామని హెచ్చరిస్తూనే ఉంటారు. డిపార్ట్ మెంట్ పేరిట ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుచేస్తూనే ఉంటారు.
మరోవైపు రాజకీయ నాయకులు దర్జాగా కోళ్లను పట్టుకుని ఫోజులిస్తుంటారు. పోనీ ఇక్కడ కూడా కోడిపందేలకు జల్లికట్టు లాంటి గౌరవమే దక్కుతుందని అనుకుంటే పొరపాటే.
ఖద్దరు వేసుకున్నవాళ్లని పందెం రాయుళ్లు అని పొగిడే సో కాల్డ్ మీడియా కూడా.. కోడి చంకలో పెట్టుకుని పెద్ద పండగరోజు ఎవరైనా పోలీసులకి చిక్కితే మాత్రం రాద్ధాంతం చేస్తుంది.
పోలీస్ డిపార్ట్ మెంట్ కూడా పండగ ముందు విపరీతమైన బిల్డప్ ఇచ్చి.. తీరా పందేలు జరుగుతుంటే మాత్రం సెక్యూరిటీ అరేంజ్ మెంట్స్, ప్రోటోకాల్ అరేంజ్ మెంట్స్ చూస్తూ ఉండిపోతుంది.
ఇక్కడ ఎవర్నీ తప్పుబట్టాల్సిన పని లేదు. ప్రతి ఏడాదిలాగే లక్షల రూపాయలు చేతులు మారే కోడిపందేలు యధావిధిగానే జరుగుతాయి. పాపం గ్రామాల్లో ఆడుకునే వారు మాత్రం పోలీసుల చేతికి చిక్కి జైలు ఊచలు లెక్కబెడుతుంటారు.
ఇదెక్కడి వివక్ష. తమిళనాడులో జల్లికట్టులో సామాన్యులు రక్తం చిందిస్తే దాన్ని కేవలం వినోదంగా మాత్రమే చూస్తారా? తెలుగు ప్రజలు వినోదం కోసం కోడిపందేలు ఆడితే మాత్రం దాన్ని నేరంగా చిత్రీకరించి జైల్లోకి నెడతారా? ఇంకెంతకాలం పండగ వినోదాన్ని పరిహాసం చేస్తారు?
రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్..
ఒకవేళ నిజంగానే కోడిపందేలు జరక్కుండా చూడాలని అనుకుంటే.. చిన్నా పెద్దా అందరికీ ఒకే రూల్ ఉండాలి. కోడి కాలికి కత్తి కట్టినా, కట్టకపోయినా పందెం ఆడితే బడితె పూజ చేయాల్సిందే. దాని ద్వారా ఏం సాధిస్తారు.
పండగ వేళ రభస కాకపోతే ఇంకేమైనా ఉందా? జల్లికట్టులాగా కోడిపందేల కోసం కూడా తెలుగు ప్రజలు పోరాటం చేయాల్సిన అవసరం ఉందా? ఇకనైనా న్యాయస్థానాలు, ప్రభుత్వాలు పండగ సంప్రదాయాలను గౌరవించాలి. కోడిపందేలను కేవలం వినోదంగా మాత్రమే చూడాలి.