గుంటూరు జీజీహెచ్‌లో కరోనా కలకలం రేపుతోంది. దీంతో అదే ఆస్పత్రిలో రెండు వారాలుగా ఉంటున్న టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడి ఆరోగ్యంపై టెన్షన్ నెలకుంది. తాజా సమాచారం మేరకు జీజీహెచ్‌లో ముగ్గురు వైద్యులు, ఇద్దరు వైద్య సిబ్బంది, అలాగే వైద్యానికి వచ్చిన తల్లీకూతుళ్లు కరోనా బారిన పడ్డారు.
ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పైల్స్ సమస్యతో అదే ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటున్నారు. అయితే ఆ ఆస్పత్రి వైద్యులు, వైద్య సిబ్బందే కరోనా బారిన పడడంతో తమ నాయకుడి ఆరోగ్యంపై టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అచ్చెన్నాయుడి కుటుంబ సభ్యులు కూడా ఆందోళనలో ఉన్నట్టు సమాచారం.
అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి ఉన్నతాధికారులకు టీడీపీ నాయకులు ఫోన్ చేసి ఆరా తీస్తున్నట్టు సమాచారం. అచ్చెన్నాయుడికి బీపీ పెరగడంతో పాటు షుగర్ లెవల్స్ తగ్గడం, రక్త విరోచనాలు తదితర అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతుండడం కూడా కుటుంబ సభ్యులు ఆందోళనకు కారణం.
అనారోగ్యంతో బాధపడేవారికి కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అచ్చెన్న ఆరోగ్యంపై టెన్షన్ నెలకుంది. అచ్చెన్న ఆరోగ్యంపై జీజీహెచ్ ఉన్నతాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తే తప్ప వాస్తవాలు ఏంటో తెలిసి వచ్చే అవకాశం లేదు.