యువతపై సోషల్ మీడియా ఎంత దుష్ప్రభావం చూపిస్తుందో తెలియజేసే సంఘటన ఇది. పట్టుమని 15 ఏళ్లు కూడా నిండని పిల్లలు, అమ్మాయిల ఫొటోల్ని మార్ఫింగ్ చేయడం, బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డం లాంటివి చేస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది.
హైదరాబాద్ బేగంపేట్ లోని ప్రైవేట్ స్కూల్ లో బాలిక 9వ తరగతి చదువుతోంది. గత నెల 27న ఆమె మొబైల్ కు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అది తెరిచి చూసిన బాలిక అవాక్కయింది. తన ఫొటోల్ని మార్ఫింగ్ చేసి, నగ్నంగా ఉన్నట్టు తయారుచేసి తనకే వాట్సాప్ చేశాడు దుర్మార్గుడు.
అక్కడితో ఆగలేదు ఆ ఆకతాయి. సదరు అమ్మాయి పేరిట నకిలీ ఫేస్ బుక్ ఎకౌంట్ ఓపెన్ చేసి అందులో ఆ ఫొటోల్ని అప్ లోడ్ చేశాడు. వాటిని తొలిగించాలంటే అడిగినంత డబ్బు ఇవ్వాలని, లేదంటే వాటిని మరింత వైరల్ చేస్తానని బెదిరించడం స్టార్ట్ చేశాడు.
కాస్త ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాలిక తండ్రి వెంటనే పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదుచేసిన సైబర్ క్రైమ్ పోలీసులు, సదరు ఫేస్ బుక్ ఎకౌంట్ ను బ్లాక్ చేశారు. బాలిక పాఠశాలలో చదివే విద్యార్థే ఈ పని చేశాడని ప్రాథమికంగా గుర్తించారు. జల్సాలకు అలవాటుపడిన ఓ విద్యార్థి, సదరు అమ్మాయితో స్నేహం నటించి ఫోన్ నంబర్ తీసుకొని ఈ ఆగడాలకు దిగి ఉంటాడని అనుమానిస్తున్నారు.