ఏపీలో ఉప ఎన్నిక జరగాల్సిన నియోజకవర్గం బద్వేల్ కు సంబంధించి షెడ్యూల్ విడుదల అయ్యింది. రేపోమాపో నోటిఫికేషన్ రానుంది. ఇప్పటికే అధికార పార్టీ అభ్యర్థిని ప్రకటించింది.
దివంగత ఎమ్మెల్యే భార్యనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక టీడీపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వ్యక్తే అభ్యర్థి కాబోతున్నాడని తెలుస్తోంది. మరి ఏపీలో తదుపరి అధికారం అందుకోబోయేది తనే.. అంటున్న బీజేపీ-జనసేన కూటమి ఇక్కడ అభ్యర్థి విషయంలో ఏం చేస్తుందో!
బద్వేల్ లో బీజేపీ- జనసేనల్లో ఏ పార్టీ పోటీ చేస్తుంది? ఈ మిత్రపక్షాల్లో ఎవరి అభ్యర్థి పోటీలో ఉంటాడో చూడాల్సి ఉంది. తిరుపతి ఉప ఎన్నికలో జనసేన త్యాగం చేసింది. బీజేపీ తరఫున అభ్యర్థి పోటీ చేశారు. ఆ అభ్యర్థి కోసం పవన్ కల్యాణ్ ప్రచారానికి వెళ్లారు. అయితే బీజేపీ, జనసేన జాయింటు పోరాటంలో డిపాజిట్ కూడా దక్కలేదు. తిరుపతిలో కనీసం కుల సమీకరణాలు అయినా.. జనసేన-బీజేపీ కూటమికి ఎక్కడో ఆశలు రేపాయి!
అయితే బద్వేల్ లో ఆ స్థాయి ఆశలు కూడా లేవు. ఈ నేపథ్యంలో బద్వేల్ బై పోల్ అభ్యర్థిత్వం గురించి ఆ పార్టీలు కిక్కురుమంటున్నట్టుగా లేవు. జగన్ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ ఒక రేంజ్ లో విరుచుకుపడుతూ ఉంటారు. బీజేపీనేమో మత రాజకీయానికి కూడా వెనుకాడటం లేదు. ఇలాంటి నేపథ్యంలో.. జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే అవకాశం వాళ్లకు రానే వచ్చింది!
తనను జగన్ ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెట్టేస్తోందని, తనను దృష్టిలో ఉంచుకునే సినిమా టికెట్ల ధరలను పెరగనివ్వడం లేదని పవన్ వాపోయాడు. మరి ఇలాంటి నేపథ్యంలో.. జగన్ ప్రభుత్వానికి సినిమా చూపించే అవకాశం పవన్ కు వచ్చింది! జగన్ ప్రభుత్వం అవినీతి మయం అయ్యిందని కూడా ఆయన అంటున్నారు.
ఇక జగన్ వల్ల హిందూమతం ప్రమాదంలో పడిందని బీజేపీ ప్రచారం చేయని రోజంటూ లేకుండా పోయింది. ఇటీవలే వినాయకచవితి రాజకీయాన్ని బీజేపీ పడించింది. పక్కనున్న కర్ణాటకలో వినాయకచవితి బహిరంగ ఉత్సవాలకు బీజేపీ ప్రభుత్వం అనుమతిని ఇవ్వలేదు.
ఏపీలో అదే చేస్తే మాత్రం అది హిందుత్వంపై దాడి అయ్యింది! మరి అన్ని దాడులకు ప్రతిదాడి ఈ పార్టీలు బై పోల్ తో చేయవచ్చు. జగన్ పార్టీ అభ్యర్థిని చిత్తుగా ఓడించి, బుద్ధి చెప్పవచ్చు. బీజేపీ, జనసేనలకు ఇప్పుడప్పుడే ఇంతకు మించిన అవకాశం రాదేమో!