విశాఖపట్నంలో సముద్రం ఉంది. అది చూడడానికి అందంగా ఉంటుంది. ఆహ్లాదంగా ఉంటుంది. నీలి సంద్రం గగనాన్ని తాకేందుకు ఎపుడూ చేసే ప్రయత్నాలు కూడా ముచ్చటగానే ఉంటాయి. ఇక కను విందు చేసే కెరటాలతో సయ్యాట ఆడుతుంది. అదే సంద్రం తుఫాన్ గా మారితే మాత్రం కడు భయంకరంగా ఉంటుంది.
గులాభ్ తుఫాన్ విశాఖను అతలాకుతలం చేసింది. ఎలా అంటే దాదాపుగా పదిహేనేళ్ల క్రితం కురిసిన అతి పెద్ద వర్షపాతం మళ్ళీ 2021లో రికార్డు అయింది. నాడు 2005లో ప్యార్ తుఫాన్ శ్రీకాకుళం జిల్లా కళింగపట్నాన్ని తాకినపుడు విశాఖలో 194 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసింది.
ఇపుడు దానిని మించి అంటే 289 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అంటే విశాఖ వీధులే కాదు, ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్ సహా అన్నీ కూడా నీట మునిగిపోయాయన్నమాట.
ఇక విశాఖ జిల్లాలో జలాశయాలు నీరు నిండి పోయి పొంగిపొరలుతున్నాయి. ఏ వైపు చూసినా కూడా నీట మునిగిన పరిసరాలే కనిపిస్తున్నాయి. గులాభ్ తుఫాన్ శ్రీకాకుళం దగ్గర కళింగపట్నాన్ని తాకినా ఆ ప్రభావంతో మూడు రోజులు గడచినా విశాఖ నీటి సంద్రాన్నే తలపించడం విశేషం.
ఇదిలా ఉండగా తుఫాన్ బాధితులను ఆదుకుంటామని, ప్రభుత్వం వారికి అవసరమైన తక్షణ సాయం అందచేస్తుందని మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రకటించారు. గులాభ్ కనీ వినీ ఎరగని బీభత్సమే సృష్టించిందని అధికారులు సైతం అంటున్నారు.