టీడీపీకి అధికార ప్ర‌తినిధి గుడ్ బై

టీడీపీకి ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి ఎన్‌బీ సుధాక‌ర్‌రెడ్డి గుడ్‌బై చెప్పారు. సైకాల‌జిస్ట్‌గా, రాజ‌కీయ విశ్లేష‌కుడిగా గుర్తింపు పొందిన ఎన్‌బీ సుధాక‌ర్‌రెడ్డి తిరుప‌తి నివాసి. ఈయ‌న ప‌లు చాన‌ళ్ల‌లో డిబేట్ల‌లో పాల్గొంటూ గుర్తింపు పొందారు.…

టీడీపీకి ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి ఎన్‌బీ సుధాక‌ర్‌రెడ్డి గుడ్‌బై చెప్పారు. సైకాల‌జిస్ట్‌గా, రాజ‌కీయ విశ్లేష‌కుడిగా గుర్తింపు పొందిన ఎన్‌బీ సుధాక‌ర్‌రెడ్డి తిరుప‌తి నివాసి. ఈయ‌న ప‌లు చాన‌ళ్ల‌లో డిబేట్ల‌లో పాల్గొంటూ గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఏపీ ప్ర‌భుత్వ విధానాల‌పై విమ‌ర్శ‌లు చేస్తుండ‌డంతో, త‌మ‌కు ప‌నికొస్తార‌ని టీడీపీ భావించింది. దీంతో పార్టీతో సంబంధం లేక‌పోయినా రాష్ట్ర అధికార ప్ర‌తినిధి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టింది.

అప్ప‌టి నుంచి సుధాక‌ర్‌రెడ్డికి రాజ‌కీయంగా క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. అంత వ‌ర‌కూ స్వేచ్ఛగా, స్వ‌తంత్రంగా రాజ‌కీయ‌, సామాజిక అంశాల‌పై త‌న‌దైన రీతిలో విశ్లేషిస్తూ వ‌చ్చిన సుధాక‌ర్‌రెడ్డికి టీడీపీ ప్ర‌తిబంధకంగా మారింది. 

తానో పెద్ద సైకాల‌జిస్ట్‌గా భావిస్తూ వ‌చ్చిన సుధాక‌ర్‌రెడ్డికి, టీడీపీ స్వ‌భావాన్ని గుర్తించ‌డంలో విఫ‌ల‌మైన విష‌యాన్ని కాలం బోధ‌ప‌రిచింది. ముఖ్యంగా టీడీపీ త‌ర‌పున టీవీ చ‌ర్చ‌ల్లో ఎవ‌రెవ‌రు పాల్గొనాలో ఆ పార్టీ నేత కొమ్మారెడ్డి ప‌ట్టాభి డిసైడ్ చేస్తుండ‌డం పార్టీలో విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది.

టీడీపీ అంటే తానే అన్న రీతిలో ప‌ట్టాభి వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం ఆ పార్టీ అధికార ప్ర‌తినాధుల‌కు అస‌లు గిట్ట‌డం లేదు. పార్టీ వాయి స్‌ను వినిపించే అవ‌కాశం లేన‌ప్పుడు ఇక టీడీపీలో ఉండ‌డం ఎందుక‌నే అసంతృప్తితో సుధాక‌ర్‌రెడ్డి బ‌య‌టికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. 

టీడీపీలో కొన‌సాగడం అంటే, త‌న నోటికి తానే తాళం వేసుకున్న‌ట్ట‌ని భావించి, పార్టీ ప‌ద‌వికి రాజీనామా చేసి చంద్ర‌బా బుకు పంపిన‌ట్టు స‌మాచారం. త‌న త‌త్వానికి పూర్తి భిన్న‌మైన పార్టీలోకి వెళ్లాన‌నే వాస్త‌వం కాలం తెలియ‌జేసింది. 

టీడీపీలో చేర‌డమే తాను చేసిన త‌ప్పుగా సుధాక‌ర్‌రెడ్డికి తెలిసొచ్చింది. ఎన్‌బీ సుధాక‌ర్‌రెడ్డిలా మ‌రికొంద‌రు అధికార ప్ర‌తినిధులు అసంతృప్తిగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. వాళ్లు కూడా టీడీపీ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం మ‌రెంతో దూరం లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.