మూడు పెళ్లిళ్ల సైకాలజీ ప్రమాదకరం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు మూడు పెళ్లిళ్ల వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఒకరేమో తన రాజకీయ ప్రత్యర్ధి మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని లోపాన్ని ఎత్తి చూపిస్తారు… సదరు ప్రత్యర్థి గారేమో మీరు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు మూడు పెళ్లిళ్ల వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఒకరేమో తన రాజకీయ ప్రత్యర్ధి మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని లోపాన్ని ఎత్తి చూపిస్తారు… సదరు ప్రత్యర్థి గారేమో మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండి అని మార్గ దర్శనం చేస్తారు. ఈ రకంగా రాజకీయ నాయకుల విమర్శలు ప్రతి విమర్శల పర్వంలో, మొత్తం మూడు పెళ్లిళ్లు అనే అంశమే హైలైట్ అవుతోంది తప్ప… అసలు సమస్యలు మరుగున పడిపోతున్నాయి!

ఒకటవ తరగతి నుంచి కూడా తెలుగు మీడియం తొలగించడంపై జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని విమర్శించినందుకు ఆయన పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల ప్రస్తావన లాగడం కరెక్ట్ కాదు. కాగా ఆ విమర్శలకు పవన్ కళ్యాణ్ మరింత రెచ్చిపోయి కౌంటర్ ఇవ్వడంతో చర్చ నేలబారుగా మారిపోయింది. నేనేమీ మూడు పెళ్లిళ్లు సరదాకు చేసుకోలేదు అని పవన్ కళ్యాణ్ మాట్లాడడం చాలా చిత్రంగా ఉంది. మరి ఏ జాతి ప్రయోజనాలను ఉద్ధరించడానికి ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నారో ఎవరికీ తెలియని సంగతి.

ఇంతకూ  ఈ మూడు పెళ్లిళ్ల సైకాలజీలో ఉండే మర్మం గ్రహించాలి. అది రాజకీయాలకు ఎలా చేటు చేస్తుందో కూడా చూడాలి. పవన్ కల్యాణ్ అప్పట్లో ఉద్ధానం సమస్యను ఎత్తుకున్నారు.. దాన్ని మధ్యలోనే వదిలేసి ఆక్వా పార్కు అన్నారు.. దాన్ని కూడా వదిలేసి తిరుపతిలో భూ సమస్య అన్నారు.. మళ్లీ మెడికల్ కాలేజీ సీట్ల సమస్యలోకి ఒక గెంతు వేశారు. ఇలా ప్రతి సమస్యనూ కాస్త కాస్త కెలికి దేనినీ సంపూర్ణంగా పరిష్కరించకుండా, జవాబు దొరికేదాకా పోరాడకుండా వదిలేశారు.

జగన్ సీఎం అయిన తర్వాత కూడా తొలుత కరకట్ట భవనాల కూల్చివేత మీద అన్నారు. తర్వాత అమరావతి రాజధాని గొడవలో వేలు పెట్టారు. ఇప్పుడు ఇసుక సమస్యతో ఊరేగుతున్నారు. తెదేపా లాగా కాదు.. మేం తలచుకుంటే మీ  అంతు చూస్తాం అని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రగల్భాలు పవన్ ప్రతిసారీ పలుకుతుంటారు. ‘లేస్తే మనిషిని కానన్న’ సామెతలాగానే ఈ మాటలు ఉంటున్నాయి తప్ప మరో సామాజిక ప్రయోజనం నెరవేరడం లేదు.

ఇలా ఒక సమస్య తీర్చకుండానే.. పూర్తి పోరాటం చేయకుండానే మరో సమస్య మీదికి షిఫ్ట్ అయిపోతూ ఉండడం అనేది ఒక పెళ్లి బంధాన్ని పూర్తిగా గౌరవించకుండానే… మరో పెళ్లికి షిఫ్ట్ అయిపోవడం వంటి సైకాలజీ వల్ల వస్తున్న ప్రమాదం అనే విమర్శలూ వినిపిస్తున్నాయి.