-మోడీ, రాహుల్‌లకు కఠిన పరీక్ష
-ప్రాంతీయ పార్టీల హవా సుస్పష్టం
-ప్రభుత్వ ఏర్పాటులో ఆ పార్టీలే కీలకం!
దేశంలో తెరపడిందనుకున్న జాతీయ పార్టీల ఆధిపత్యానికి విశ్లేషణకు విరుద్ధంగా వచ్చాయి గత లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు. ప్రాంతీయ పార్టీలే జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించడమే ఇక నుంచి అనుకున్న సమయంలో అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ అప్పుడు సంచలన విజయం సాధించింది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినంత స్థాయిలో బీజేపీ ఎంపీ సీట్లను సొంతం చేసుకుంది. అయినా ఎన్డీయే రూపంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పుడు భారతీయ జనతా పార్టీ విజయంలో కొన్ని రాష్ట్రాలే అత్యంత కీలకపాత్ర పోషించాయి. అప్పుడు బీజేపీ సొంతంగా సాధించుకున్న 282 సీట్లలో ప్రధాన వాటా కొన్ని రాష్ట్రాలదే!
అదంతా గతం. మళ్లీ ఎన్నికలు వచ్చాయి. దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ పూర్తికాబోతూ ఉంది. ఈ క్రమంలో ఈసారి జాతీయ స్థాయిలో ఎవరి ఆధిపత్యం ఉంటుందనే అంశం గురించి, రాష్ట్రాల వారీగా పరిస్థితి ఎలా ఉండవచ్చనే అంశం గురించి రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ విశ్లేషణలకు ప్రధానమైన ప్రశ్న బీజేపీ గతంలాగా స్వీప్ చేస్తుందా? అనేదే. ఒకవేళ అలా స్వీప్ చేయలేకపోతే కమలం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రాల వారీగా అప్పుడు, ఇప్పుడున్న పరిస్థితుల గురించి ఒక లుక్ వేస్తే… ముందుగా మాట్లాడుకోవాల్సింది ఉత్తరప్రదేశ్ గురించి!
బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ అక్కడే?
గత ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ స్వీప్ చేసిన రాష్ట్రాల్లో ప్రముఖమైనది యూపీ. దేశంలోనే అత్యధిక ఎంపీ సీట్లున్న రాష్ట్రం ఇది. 80 ఎంపీ సీట్లున్న ఈ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి దక్కిన ఎంపీ సీట్ల సంఖ్య 71. అంతకు ముందు కేవలం 10 సీట్లున్న యూపీలో అరవై ఒక్క ఎంపీ సీట్లను పెంచుకుని బీజేపీ 71 సీట్లను సొంతం చేసుకుంది! దాని మిత్రపక్షం అప్నాదళ్ మరో రెండు ఎంపీ సీట్లను నెగ్గింది. అలా యూపీలో 90శాతం ఎంపీ సీట్లను కమలదళం సొంతం చేసుకుంది! ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కమలం పార్టీ ప్రభంజనం అదేస్థాయిలో కనిపించింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయం సాధించింది. అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం అలాంటి పరిస్థితి ఉండదనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
అందుకు ప్రధాన కారణం అక్కడి ప్రాంతీయ ప్రబల శక్తులు ఎస్పీ-బీఎస్సీలు జత కలవడం. ఎస్పీ, బీఎస్పీలు వేర్వేరుగా పోటీచేసి ఉంటే .. బీజేపీని ఏం చేయలేవు ఈసారి కూడా. అయితే అవి కలిసి పోటీచేశాయి. వాటికి రాష్ట్రవ్యాప్తంగా గతంలో లభించిన ఓటు బ్యాంకులు యథాతథంగా మెర్జ్ అయితే ఆ పార్టీలు 40కి పైగా ఎంపీ సీట్లను సొంతం చేసుకునే అవకాశాలున్నాయని వివిధ అధ్యయనాలు చెబుతూ ఉన్నాయి. బీజేపీ బలం సగానికి పడిపోవచ్చుని.. కమలం పార్టీ స్కోరు యూపీలో 71 నుంచి ముప్పై చిల్లరకు పడిపోయినా ఆశ్చరపోవాల్సిన అవసరం లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏతావాతా యూపీలో బీజేపీకి మైనస్ అయ్యే ఎంపీ సీట్ల సంఖ్య 40 వరకూ ఉంటుందనేది ఒక అంచనా!
రాజస్థాన్‌లో పరిస్థితి ఏమిటి!
గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 100శాతం సీట్లను సొంతం చేసుకున్న రాష్ట్రం రాజస్థాన్. అక్కడ 25 ఎంపీ సీట్లకుగానూ 25 బీజేపీనే నెగ్గిందప్పుడు. ఇటీవలి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చిత్తు అయ్యింది. వసుంధర రాజే సర్కారును ప్రజలు తిరస్కరించారు. మంచి మెజారిటీతో కాంగ్రెస్‌కు అధికారాన్ని అప్పగించారు రాజస్తాన్ ప్రజలు. ఒకవేళ మోడీ సర్కారు విషయంలో కూడా రాజస్తానీలు అలాగే స్పందిస్తే.. ఇక్కడా కమలం పార్టీ కనీసం సగం ఎంపీ సీట్లను కోల్పోవడం ఖాయం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎంపీ సీట్లను నెగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏతావాతా కనీసం ఇక్కడ 15 ఎంపీ సీట్లు బీజేపీ ఖాతా నుంచి చేజారవచ్చు!
మధ్యప్రదేశ్ విషయంలో ఇరువర్గాల కాన్ఫిడెన్స్!
గత లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది కేవలం రెండు ఎంపీ సీట్లు. 27 ఎంపీ సీట్లను బీజేపీ సొంతం చేసుకుంది. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోటాబోటీ మెజారిటీతో నెగ్గింది. ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడైతే తాము 22 ఎంపీ సీట్లను మధ్యప్రదేశ్‌లో నెగ్గుతామంటూ కాంగ్రెస్ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే వారికి అంత సీన్లేదని చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన ఓట్ల శాతాన్ని బట్టి చూసినా, ఆ తర్వాత బీజేపీ నేత, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇక్కడ కష్టపడుతున్న తీరును చూసినా.. బీజేపీ ఇక్కడ మరీ పట్టు కోల్పోయే అవకాశాలు లేవు. అయితే కనీసం 10 ఎంపీ సీట్లు మాత్రం ఆ పార్టీ ఖాతా నుంచి చేజారడం ఖాయంగా కనిపిస్తూ ఉంది!
మహారాష్ట్రలో కాంగ్రెస్ కోలుకున్నట్టే?
2014లో ఎన్డీయే కూటమి దాదాపు స్వీప్ చేసిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. 48 ఎంపీ సీట్లకు గానూ ఎన్డీయే కూటమి 42 సీట్లను పొందింది! వీటిల్లో బీజేపీ వాటా 23. శివసేన పద్దెనిమిది. అయితే ఈసారి కాంగ్రెస్-ఎన్సీపీల కూటమి అక్కడ కొంతవరకూ పుంజుకుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఎవరూ సంపూర్ణ ఆధిపత్యం వహించే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఇరు కూటములూ చెరో 50శాతం సీట్లను పొందవచ్చు. మహారాష్ట్ర వరకూ బీజేపీకి ఎంపీ సీట్ల లాస్ జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడా కనీసం పది ఎంపీ సీట్లను బీజేపీ కోల్పోయే అవకాశాలే ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బిహార్‌లో బీజేపీ హవానే!
గత ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ స్థానాల్లో నెగ్గిన రాష్ట్రాల్లో ఈసారి కమలం పార్టీ అదే ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటుందనే అంచనాలు ఉన్న రాష్ట్రం బిహార్. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీజేపీకి ఎదురుదెబ్బే తగిలినా.. ఆ తర్వాత టక్కుటమార విద్యలతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ రాష్ట్రంలో 2014లో బీజేపీ 22 ఎంపీ సీట్లను నెగ్గింది. ఎన్డీయే రూపంలో మరో తొమ్మిది సీట్లు పొందింది. ఈసారి కూడా బీజేపీ తన ఎంపీ సీట్లను తను నిలబెట్టుకునే అవకాశాలున్నాయి. ఇక్కడ బీజేపీకి జీరో లాస్, జీరో గెయిన్ అనేది ప్రాథమిక అంచనా. కొన్ని సీట్లను కమలం పార్టీ అదనంగా పొందవచ్చనేది మరో విశ్లేషణ.
ఢిల్లీలోనూ నష్టమేనా..!
గత లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ స్వీప్ చేసింది. ఏడు ఎంపీ సీట్లనూ పొందింది. అయితే ఆ తర్వాత జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ రివర్స్‌లో స్వీప్ చేసింది. బీజేపీ, కాంగ్రెస్‌లను ఆప్ చిత్తుచేసింది. ఇక ఇప్పుడు త్రిముఖపోరు నెలకొని ఉంది. ఈసారి బీజేపీకి కనీసం సగం సీట్లలో అయినా ఢిల్లీలో పరాభవం తప్పదనే అంచనాలున్నాయి.
గుజరాత్‌లోనూ లాసేనా?
100 శాతం ఎంపీ సీట్లను బీజేపీ సొంతం చేసుకున్న మరో రాష్ట్రం గుజరాత్. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి గట్టిపోటీ ఇచ్చింది. ఫలితంగా 26 ఎంపీ సీట్లున్న గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లను అయినా నెగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్లీ మోడీనే పీఎం కావాలని గుజరాతీలు గట్టిగా అనుకుంటే మాత్రం ఇక్కడ మళ్లీ బీజేపీ ఆధిపత్యమే ఉండవచ్చు. ఏదేమైనా ఇక్కడ సింగిల్ డిజిట్ స్థాయిలో అయినా కాంగ్రెస్ ఎంపీ సీట్లను పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి గుజరాత్‌లోనూ బీజేపీకి కొన్ని సీట్లు లాస్ కావొచ్చు!
హర్యానా, హిమాచల్ మళ్లీ బీజేపీకే!
ఈ బుల్లి రాష్ట్రాల్లో బీజేపీ మళ్లీ ఆధిపత్యం నిలబెట్టుకునే అవకాశాలున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ స్వీప్ చేసి బీజేపీ పది, 11 ఎంపీ సీట్లను నిలబెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి 12 ఎంపీ సీట్లున్న జార్కండ్లో పాతబలమే ఈసారి కూడా కొనసాగే అంచనాలున్నాయి.
కర్ణాటకలో కాస్త బలం పెరిగేనా?
కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు బాగానే పుంజుకుంది. అంతకు ముందు లోక్‌సభ ఎన్నికలప్పుడూ మెజారిటీ సీట్లను నెగ్గింది. జేడీఎస్- కాంగ్రెస్‌లు ఈసారి కలిసి పోటీచేశాయి. అయితే ఆ కూటమిలో లుకలుకలు బీజేపీకి ప్లస్‌గా మారనున్నాయి. అలాగే జనాల్లో కూడా బీజేపీ అనుకూలత కనిపిస్తోంది కర్ణాటకలో కాబట్టి.. ఇక్కడ గత ఎన్నికల్లో వచ్చిన 17 ఎంపీ సీట్లనూ బీజేపీ నిలబెట్టుకోవచ్చు. ఆ బలాన్ని మరికాస్త పెంచుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
తమిళనాట ఆ ఒక్కటీ అయినా?
తమిళనాట గత ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీట్లో నెగ్గింది బీజేపీ. ఈసారి అన్నాడీఎంకేతో కలిసి ఐదు సీట్లకు పోటీచేసింది. పరిస్థితిని చూస్తుంటే.. కనీసం అప్పటి ఒక్క సీటును అయినా బీజేపీ నెలబెట్టుకున్నా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు.
కేరళలో ఖాతా తెరిచేనా?
గత లోక్‌సభ ఎన్నికలప్పుడు పదిశాతం ఓటు బ్యాంకును పొందినా కేరళలో బీజేపీ ఒక్క ఎంపీ సీటును కూడా నెగ్గలేదు. అయితే మారిన రకరకాల పరిస్థితుల్లో ఈసారి బీజేపీ అక్కడ ఖాతా తెరిచినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. కనీసం ఒక్క ఎంపీ సీట్లో అయినా బీజేపీ అక్కడ విజయం సాధించగలదేమో!
ఒడిశాపై గంపెడాశలు!
గత ఎన్నికల్లో ఒడిశాలో ఒక్క ఎంపీ సీట్లో మాత్రమే నెగ్గింది బీజేపీ. ఈసారి మాత్రం అక్కడి ప్రాంతీయ పార్టీ బీజేడీకి గట్టిపోటీ ఇచ్చేలా ఉంది. ఈ రాష్ట్రంలో బీజేపీ గట్టిగా పుంజుకోగలదని కొన్ని సర్వేలు అంచనా వేశాయి. కనీసం ఐదు నుంచి పది ఎంపీ సీట్లను బీజేపీ ఇక్కడ నెగ్గుతుందని ఒక అంచనా!
పంజాబ్‌లో రెండూ ఖాయంగా?
గత ఎన్నికల్లో పంజాబ్‌లో బీజేపీ నెగ్గిన ఎంపీ సీట్లు రెండు. శిరోమణి అకాళీదళ్‌తో పొత్తుతో బీజేపీ ఈసారి కూడా కనీసం రెండు ఎంపీ సీట్లను అయినా నెగ్గడంపై విశ్వాసంతో ఉంది.
పశ్చిమ బెంగాల్లో నవ వసంతం?
గత ఎన్నికలప్పుడు బీజేపీ బెంగాల్లో పాదం మోపింది. రెండు ఎంపీ సీట్లతో సత్తా చూపించింది. అప్పటి నుంచి మమతా బెనర్జీని కమలం పార్టీ అక్కడ బెదరగొడుతూ ఉంది. ఈసారి బీజేపీ అక్కడ తన నంబర్‌ను పెంచుకునే అవకాశాలున్నాయి. కనీసం ఐదారు ఎంపీ సీట్లలో అయినా బీజేపీ నెగ్గవచ్చని అంచనా!
తెలుగు రాష్ట్రాల్లో మైనస్సా, ప్లస్సా?
ఏపీ వరకూ అయితే గత ఎన్నికల్లో బీజేపీ నెగ్గిన రెండు ఎంపీ సీట్లూ ఈసారి చేజారతాయని చెప్పేయొచ్చు. అప్పుడు టీడీపీతో పొత్తుతో వెళ్లడం ద్వారా ఆ సీట్లను బీజేపీ నెగ్గగలిగింది. ప్రస్తుత పరిస్థితుల దష్ట్యా ఏపీలో బీజేపీ జీరో. తెలంగాణలో మాత్రం కమలం పార్టీ నంబర్‌ను పెంచుకోవడం మీద ఆశలతో ఉంది. అప్పుడు ఒక్క ఎంపీ సీట్లో నెగ్గిన బీజేపీ ఇప్పుడు కనీసం రెండు సీట్లలో విజయం మీద ఆశలతో ఉంది. అయితే అది తేలికకాదు.
చత్తీస్‌గడ్‌లో నష్టమే?
గత ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బీజేపీ 10 ఎంపీ సీట్లను నెగ్గింది. ఒక్కటి మాత్రమే కాంగ్రెస్‌కు ఇచ్చింది. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల దష్ట్యా చూస్తే మాత్రం ఇక్కడ బీజేపీ కనీసం సగం ఎంపీ సీట్లను నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బుల్లి రాష్ట్రాల్లో బీజేపీ హవా?
గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీ ఎక్కడ అదనపు సీట్లను సాధిస్తుంది? అంటే బుల్లి రాష్ట్రాల పేర్లను చెప్పవచ్చు. గత ఐదేళ్లలో అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల్లో బీజేపీ బలపడిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఖాతాలు తెరిచింది గత ఐదేళ్లలో. దశాబ్దాలుగా అక్కడ కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల ఆధిపత్యాలు ఉండేవి. అయితే ఈసారి ఎంపీ సీట్ల పరంగా బీజేపీ అక్కడ తన నంబర్‌ను పెంచుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
త్రిపురలో ఉన్నది రెండు ఎంపీ సీట్లే అయినా ఈసారి బీజేపీ రెండింటినీ సొంతం చేసుకునే అవకాశాలున్నాయి. ఉత్తరాఖండ్‌లోనూ ఆ పార్టీ ఆధిపత్యానికి పెద్దగా గండి ఏమీ పడే అవకాశాలు లేవు. గోవాలో బీజేపీ తన ప్రాభవాన్ని కాపాడుకోవచ్చు. డామన్ డ్యూ, దాద్రానగర్ హైలీల్లో కూడా బీజేపీ తన స్కోరు నిలబెట్టుకోవచ్చు. అస్సాం, అరుణాచల్, అండమాన్లలో కూడా బీజేపీకి వచ్చిన ప్రమాదాలు ఏమీలేవు. వీటిల్లో సీట్లను యథాతథంగా నిలబెట్టుకోవచ్చు!
గెలుపు కానీ గెలుపుకాదు!
భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల్లో స్వీప్ చేసింది. అలాంటి ల్యాండ్‌స్లైడ్ విక్టరీలు ఈసారి సాధ్యం అయ్యేలాలేవు. అదే అప్పటికీ ఇప్పటికీ ప్రధానమైన తేడా. ఉత్తరాది, హిందీ బెల్ట్‌లో భారతీయ జనతా పార్టీ ఆధిపత్యానికి వచ్చిన నష్టం ఏమీలేదు. అయితే ఎటొచ్చీ యూపీలో ఎస్పీ-బీఎస్సీలు చేతులు కలపడం మాత్రమే కమలం పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా మారే అవకాశాలున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్‌లలో కాంగ్రెస్ పార్టీ వాళ్లు బీజేపీకి గట్టిపోటీ ఇస్తున్నారు. ఈ నాలుగు రాష్ట్రాల్లోనే బీజేపీకి ప్రధానంగా నష్టం జరగవచ్చు. అయితే మోడీ మానియా పనిచేస్తుందని, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకూ లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు సంబంధం లేదనేది బీజేపీ విశ్వాసంగా కనిపిస్తోంది. ఏదేమైనా గతంలో గెలిచిన 282 సీట్లలో కనీసం 70 నుంచి 80 ఎంపీ సీట్లను ఖాయంగా ఓడిపోనుంది. కొన్ని రాష్ట్రాల్లో కొత్త సీట్లను నెగ్గడం ద్వారా పది నుంచి ఇరవై ఎంపీ సీట్లను బీజేపీ పొందవచ్చు. స్థూలంగా కమలం పార్టీ బలం 220 వరకూ నిలవొచ్చు అనేది అంచనా!
'కీ' ఆ ఆ పార్టీల చేతిలోనే!
కమలం పార్టీ కోల్పోయే సీట్లలో కాంగ్రెస్ చేతిలోకి వెళ్లేవి కొన్ని మాత్రమే కావడం గమనార్హం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, రాజస్తాన్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీలు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయి. వీటిల్లో కొన్ని బీజేపీ కొన్ని సీట్లను కోల్పోయి కాంగ్రెస్‌కు అప్పగించేలా ఉంది. ఫలితంగా కాంగ్రెస్ కోలుకోవచ్చు. అయితే ఈసారి ప్రాంతీయ పార్టీల హవా స్పష్టంగా కనిపిస్తుంది. కొన్నిచోట తమ ప్రత్యర్థి ప్రాంతీయ పార్టీలను ఓడించి కొన్ని పార్టీలు పైకి లేచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిణామాల మధ్యన ఎస్పీ-అఖిలేష్ యాదవ్, బీఎస్పీ- మాయవతి, టీఎంసీ-మమతా బెనర్జీ, బీజేడీ-నవీన్ పట్నాయక్, టీఆర్ఎస్- కేసీఆర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈసారి కేంద్రంలో కీలకపాత్ర పోషించే అవకాశాలున్నాయని అంచనా.
బీజేపీ మెజారిటీకి కనీసం 50కి పైగా ఎంపీ సీట్ల దూరంలో నిలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ 100 ఎంపీ సీట్లలో నెగ్గితే అదే గొప్ప. ఇలాంటి నేపథ్యంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్నా, కాంగ్రెస్‌తో కలిసి ఒక కలగాపులగం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా… ఈ ప్రాంతీయ పార్టీలే అసలు కథను డిసైడ్ చేస్తాయనే విశ్లేషణలు జాతీయ స్థాయిలోనే ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఏం జరుగుతుంది.. అసలు హైడ్రామా ఎలా ఉండబోతోంది.. రసవత్తర రాజకీయంలో మజా ఎలా ఉంటుంది, ఎవరు కింగ్ అవుతారు, మరెవరు కింగ్‌మేకర్ అవుతారు.. అనే ప్రశ్నలకు మే ఇరవై 23న స్పష్టమైన సమాధానం దొరికే అవకాశం ఉంది!