రజనీకాంత్‌.. రాజకీయానికి లేటైందా!

ప్రస్తుతం రజనీకాంత్‌ వయసు 69 సంవత్సరాలు! ఈ వయసులో ఆయన మరోసారి ఊరించే ప్రకటన చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ పోటీలో ఉంటుందని రజనీకాంత్‌ ఇటీవలే ప్రకటించారు. ఈసారి తను ఫ్యాన్స్‌ను…

ప్రస్తుతం రజనీకాంత్‌ వయసు 69 సంవత్సరాలు! ఈ వయసులో ఆయన మరోసారి ఊరించే ప్రకటన చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ పోటీలో ఉంటుందని రజనీకాంత్‌ ఇటీవలే ప్రకటించారు. ఈసారి తను ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్‌ చేసేది ఉండదని, అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ కచ్చితంగా పోటీచేస్తుందని రజనీకాంత్‌ స్పష్టంచేశారు. ఇది అభిమానులకు ఊరడింపులానే ఉంది! అయితే రజనీకాంత్‌ ఈసారైనా రాజకీయం వైపు వస్తారా, లేక ఇది కూడా జస్ట్‌ అభిమానులను ఊరట పరచడానికి చెప్పినమాట మాత్రమేనా అనేది ఒక చర్చ. అంతకన్నా కీలకమైన చర్చ ఏమిటంటే.. ఇప్పుడే రజనీకాంత్‌ వయసు 69. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు లెక్క ప్రకారం రెండేళ్ల సమయం ఉంది. అంటే అప్పటికి రజనీకాంత్‌కు 71 సంవత్సరాల వయసు వస్తుంది! ఆ వయసులో రజనీకాంత్‌ రాజకీయ ఎంట్రీ చేస్తే సక్సెస్‌ అవుతారా? అనేది మరో సందేహం అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.

ఇదివరకూ రాజకీయాల్లోకి వచ్చిన హీరోలు అంతా యాభైయేళ్ల వడిలోనే ఎంట్రీ ఇచ్చారు. అంతకన్నా అర్లీ వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి పార్టీలు పెట్టినవారూ ఉన్నారు. రజనీకాంత్‌ విషయంలోనూ అవే అంచనాలున్నాయి. ఇప్పుడుకాదు.. ఇరవై సంవత్సరాల కిందటే రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీ గురించి ఆయన సినిమాల్లోనే చర్చపెట్టారు. 'నరసింహా' సినిమా నాటికి రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తాడనే అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. అయితే రజనీకాంత్‌ అప్పటినుంచి వేలు పైకి చూపిస్తూ వస్తున్నారు. అలా ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి!

తమిళనాట జయలలిత, కరుణానిధి మరణంతో పూర్తిగా రాజకీయ శూన్యత ఏర్పడ్డాకా రజనీకాంత్‌ రాజకీయంలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారనేది స్పష్టం అవుతున్న విషయమే. అయితే అది కూడా టక్కున చేయలేకపోవడం రజనీకాంత్‌ బలహీనత అనుకోవాలేమో! రెండేళ్ల నుంచి హడావుడి చేస్తూ ఉన్నారు. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీకి సరైనమార్గం అయ్యేవి. ఎందుకంటే.. తమిళనాట జయలలలిత, కరుణానిధి లేకుండా జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి!. వారిద్దరూ కాకుండా ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకునే వారికి ఈసారి లోక్‌సభ ఎన్నికలే కీలకమైనవి. అలాంటి ప్రత్యామ్నాయం తనే అనిపించుకోవాలని స్టాలిన్‌ తాపత్రయపడుతున్నాడు. అయితే స్టాలిన్‌పై తమిళ ప్రజలకు ఉన్న నమ్మకం అంతంత మాత్రమే. కాబట్టి ఈ ఎన్నికల్లో రజనీకాంత్‌ పార్టీ పోటీచేసి ఉంటే ఆ కథ వేరే!

పూర్తిగా కసరత్తును పూర్తిచేసి రజనీకాంత్‌ తన పార్టీని పోటీపెట్టి ఉంటే.. అసెంబ్లీ ఎన్నికల నాటికి అది మరింత పుంజుకునే అవకాశాలుండేవి. అయితే రజనీకాంత్‌ లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి ధైర్యం చేయలేదు. తన పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ ఉండదని ప్రకటించేశారు. అయితే ఆ ఎన్నికల పోలింగ్‌ అలా పూర్తికాగానే… అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమని, తన పార్టీ పోటీలో ఉంటుందని రజనీకాంత్‌ ప్రకటించేశారు!

స్టాలిన్‌ నిలదొక్కుకుంటే రజనీ పరిస్థితి ఏమిటి?
లోక్‌సభ ఎన్నికలపై డీఎంకే చాలా ఆశలు పెట్టుకుంది. తమిళనాట జరిగింది లోక్‌సభ ఎన్నికలు మాత్రమేకాదు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటుతో వాటికి ఉప ఎన్నికలు  జరిగాయి. ఇరవై రెండు ఎమ్మెల్యే సీట్లకు బైపోల్స్‌ జరిగాయి. తమిళ ప్రజలు ఈసారి డీఎంకే వైపు పూర్తిగా నిలిస్తే.. ప్రతిసారి ఒకరిని చిత్తుచేసి, మరొకరిని నెత్తికి ఎత్తుకునే తమిళులు ఈసారి డీఎంకుకే జైకొడితే అంతే సంగతులు! మెజారిటీ ఎంపీ సీట్లను నెగ్గి, అసెంబ్లీ సీట్లను గనుక స్వీప్‌ చేస్తే స్టాలిన్‌ సత్తా చూపించినట్టే!

అసెంబ్లీ సీట్లన్నింటినీ డీఎంకే నెగ్గితే అన్నాడీఎంకే ప్రభుత్వం పడిపోవచ్చు. డీఎంకే వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. అలా ప్రభుత్వం గ్రిప్‌లోకి రాగానే.. స్టాలిన్‌ రెండేళ్లపాటు సీఎంగా కొనసాగవచ్చు లేదా, అసెంబ్లీని మొత్తంగా రద్దుచేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లవవచ్చు. వీటిల్లో ఏం జరిగినా స్టాలిన్‌ నిలదొక్కుకున్నట్టే! కాబట్టి.. అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే వచ్చినా, రెండేళ్ల తర్వాత వచ్చినా అప్పటికి తమిళనాట రాజకీయ శూన్యత లేనట్టే. మరీ డీఎంకేను తమిళ ప్రజలు తిరస్కరిస్తే.. అన్నాడీఎంకే కూడా కొద్దో గొప్పో సీట్లును నెగ్గితే.. తప్ప.. అవకాశాలు డీఎంకే వైపే ఉంటాయి. డీఎంకే ఈ ఎన్నికల్లో రాణించిందంటే.. తమిళనాట రాజకీయ శూన్యత భర్తీ అయినట్టే!

రజనీ రాజకీయాల్లోకి రారా?
ఏదో చెబుతున్నారు కానీ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా రజనీకాంత్‌ ఎన్నికల్లో పోటీచేసే అవకాశాలు లేవు అనేది మరో విశ్లేషణ. రజనీకాంత్‌ సినిమాలే చేస్తారని, ఇటీవలే 'దర్బార్‌' సినిమాను స్టార్ట్‌ చేసిన ఆయన మరికొన్ని సినిమాలు చేసి పూర్తిగా రిటైరయ్యే ఆలోచనలో ఉన్నారనేది మరో అభిప్రాయం. అయితే అభిమానులు తన సినిమాల పట్ల కూడా ఆసక్తి కోల్పోకుండా రజనీకాంత్‌ వారిని ఊరించే ప్రకటనలు చేస్తున్నారని.. ఆయనకు వాస్తవానికి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని కొంతమంది విశ్లేషిస్తున్నారు. ఆ ఉద్దేశమే ఉండి ఉంటే ఇరవై సంవత్సరాల కిందటే రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చేవారని వ్యాఖ్యానిస్తున్నారు.

రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీకి అది పెద్ద అడ్డంకి ఆయన వయసు అని, డెబ్బైయేళ్ల వయసుకు దగ్గరపడిన ఆయన ఈ వయసులో రాజకీయాల్లోకి వచ్చి ప్రచారం అంటూ పరుగులు తీయడం కుదిరే పనికాదని, రజనీకాంత్‌కు ఇప్పటికే స్వల్పమైన ఆరోగ్య సమస్యలున్నాయని అంటారు. ఆయన ఈ వయసులో రాజకీయాల్లోకి వచ్చి ఒత్తిడిని ఎదుర్కొనడం కుటుంబీకులకు కూడా అంత ఇష్టంలేదని అంటున్నారు. సినిమా సూపర్‌ స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్‌ సినీ సూపర్‌ స్టార్‌గానే రిటైరవ్వాలనేది వారి ఆలోచనగా తెలుస్తోంది. అయితే పైకి కుటుంబీకులు ఆయన పొలిటికల్‌ ఎంట్రీని సమర్థిస్తూ ఉన్నారు.

లోక్‌సభ ఎన్నికలను బట్టి నిర్ణయం?
లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాట డీఎంకే కూటమి సంపూర్ణ ఆధిపత్యం చెలాయిస్తే తమిళ ప్రజల స్టాలిన్‌కు పగ్గాలు అప్పగించినట్టే. అలాకాకుండా..తలా కొన్ని సీట్లను పంచితే.. రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీకి అనుకూలత ఉన్నట్టే. ఈ పరిణామాలను లెక్కేసుకుని.. రజనీకాంత్‌ రాజకీయంలోకి రావడమా, లేదా.. అనేది డిసైడ్‌ చేసుకునే అవకాశాలున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏతావాతా రజనీకాంత్‌ రాజకీయం ఆరంగేట్రం ఈ లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాట వచ్చే ఫలితాలను బట్టి ఆధారపడి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.

ఎవరు ఏ వయసులో సీఎం అయ్యారంటే..
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తొలిసారి ఆ పదవిని అధిష్టించింది 43 సంవత్సరాల వయసులో! 1969లో తొలిసారి తమిళనాడు సీఎం అయినప్పటికి కరుణానిధి వయసు 45 సంవత్సరాలు. ఎంజీఆర్‌ ఆరవై సంవత్సరాల వయసుకే ముఖ్యమంత్రి అయ్యారు. తమిళ సినీ నేపథ్యం నుంచి వచ్చి తమిళనాడు సీఎంలు అయిన వారి వయసులను బట్టి చూస్తే రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీకి చాలా చాలా లేట్‌ అయ్యిందని చెప్పవచ్చు! అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పరిటాల వారసుడి గెలుపుపై నమ్మకం లేదా?