ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి షరతు విధించారా? అంటే… ఔనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తిరుగుబాటు నేపథ్యంలో అక్కడ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఆదాలను నియమించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆదాల నెల్లూరు లోక్‌సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్‌రెడ్డి పోటీ చేస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
అయితే నెల్లూరు రూరల్ నుంచి బరిలో దిగడానికి ఆదాల షరతు విధించినట్టు సమాచారం. వైసీపీ అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి ఇస్తామనే హామీతోనే ఆయన నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయడానికి అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మొదటి నుంచి ఆదాలకు ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఇష్టం. గతంలో ఆయన సర్వేపల్లి నియోజక వర్గం నుంచి గెలుపొంది మంత్రిగా కూడా పని చేశారు.
మరోసారి మంత్రిగా పని చేయాలనేది ఆయన ఆశ. గత సార్వత్రిక ఎన్నికల ముందు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేయాలని ప్రచారం కూడా చేశారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య వైసీపీ కండువా కప్పుకున్నారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగి, విజయం సాధించారు.
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చోటు చేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యారు. సీనియర్ నేత కూడా అయిన తనకు రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి ఇవ్వాలని జగన్‌కు షరతు విధించినట్టు ప్రచారం జరుగుతోంది.