ఆంధ్ర రాజకీయాల్లో నెల్లూరు పంచాయతీ ఇప్పట్లో తెగేలా కనపడట్లేదు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రోజుకొక మీడియా సమావేశం పెట్టి వైసీపీ నేతలపై, పార్టీ అధిష్టానంపై విమర్శల దాడి చేస్తున్నారు. మీడియా సమావేశంలో సీఎం జగన్ ను విమర్శించకుండా ఇతర నేతలపై విమర్శల దాడి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కోటంరెడ్డి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేస్తున్నట్లు కనపడుతోంది.
ఇవాళ కోటంరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నాపై కిడ్నాప్ కేసు సజ్జల దగ్గరుండి పెట్టించారని, అవసరమైతే హత్యాయత్నం కేసు కూడా పెట్టుకోండి అంటూ సలహా ఇచ్చారు. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తితో సజ్జల ఫోన్లు చేయిస్తున్నారని, నన్ను బెదిరించి.. కొట్టేసి తీసుకెళతానన్నాంటున్నారు.. తీసుకెళ్లు చూద్దాం.. ఇలాంటి బెదిరింపులకు బెదరనుంటూనే సజ్జలకు వార్నింగ్ ఇచ్చారు. నాకు బెదిరింపు కాల్స్ వస్తే నీకు కూడా నెల్లూరు నుండి వీడియో కాల్స్ వస్తాయని వార్నింగ్ ఇచ్చారు. సలహాదారుగా ప్రభుత్వ పనులను మానేసి ఆపరేషన్ నెల్లూరు రూరల్ అనే విధంగా సజ్జల వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
అలాగే మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై తనదైన శైలిలో కౌంటర్ వేశారు. గతంలో వైయస్ఆర్ విగ్రహాన్ని పెట్టేందుకు అడ్డుకున్నా కాకాణి.. విధేయత గురించి మాట్లాడుతుంటే జాలేస్తోందని, వైకాపాలో ఉండి చంద్రబాబు కాళ్లకు దండం పెట్టింది కాకాణి కాదా అంటూ మండిపడ్డారు. నేను సజ్జలపై విమర్శల చేస్తుంటే అందరికంటే ఎక్కువగా కాకాణికి కోపం వస్తోందని.. కోపం రావడంలో తప్పులేదని, మంత్రి పదవి ఇప్పించిన సజ్జల అంటే కాకాణి ప్రేమ చూపించడంలో తప్పులేదని సెటైర్ వేశారు.
మొత్తానికి తనను రెచ్చగొడితే మరింత రెచ్చిపోతానని.. తనను భయపెడితే భయపడే రకం కాదని తేల్చిచెప్పారు. వైసీపీ నుండి సైలెంట్ గా వెళ్లిపోవాలని అనుకున్నా.. కానీ, నాపై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నందుకే సమాధానం ఇస్తున్నానని అన్నారు. వైసీపీ నుండి విమర్శల దాడి తగ్గితే తప్పా కోటంరెడ్డి తగ్గేలా కనపడలేదు.