జనసేనతో పొత్తులు తెగతెంపులు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెగేసి చెప్పేశారు. కలిసి వస్తే జనసేనతో కలిసి పోటీచేస్తాం అని.. లేకపోతే ఒంటరిగా పోటీచేయడానికైనా తాము సిద్ధంగా ఉన్నాం అని సోము వీర్రాజు అధికారికంగా ప్రకటించేశారు.
ఒకవైపు పవన్ కల్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీల్లేదు, చీలనివ్వను, జగన్ ను ఓడిస్తాను అనే భీషణ ప్రతిజ్ఞలతో.. తెలుగుదేశం పల్లకీ మోయడానికి అత్యుత్సాహపడుతున్నారు. మరోవైపు బిజెపితో పొత్తు కొనసాగుతూనే ఉంది.. అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. వారితో కూడా బాబు పల్లకీ మోయించడానికి ఆయన స్కెచ్ వేస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ ఇంకా డొంకతిరుగుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో సోము వీర్రాజు మాత్రం నిర్మొగమాటంగా చెప్పేస్తున్నారు.
పవన్ కల్యాణ్ పరిస్థితి పాపం ఇరకాటంగా ఉంది. 2024 ఎన్నికల్లో తన పార్టీ తరఫున ఒంటరిగా పోటీచేసే దమ్ము ఆయనకు లేదు. 2019 ఎన్నికల్లో అలాంటి ప్రయోగం వికటించి, తలబొప్పి కట్టిన గాయం ఇంకా తగ్గనేలేదు. ఇంకోసారి పవన్ కల్యాణ్ బహిరంగ వేదిక మీదినుంచి రంకెలువేయడంలో చాలా ఆగ్రహావేశాలను ప్రదర్శిస్తుంటారు గానీ.. రాజకీయంగా ముందడుగు వేయాలంటే మహా భయం. పిరికితనం. ఆయన తెలుగుదేశంతో కలిసి వెళ్లాలని అనుకున్నారు.
బిజెపితో కలిసి పోటీచేసినా చేయకపోయినా ఒకటేనని ఆయనకు తెలుసు. టీడీపీతో వెళ్తే కనీసం శాసనసభలో తమ పార్టీ ప్రాతినిధ్యం ఉంటుందని.. కాలం కలిసొస్తే ప్రభుత్వంలో భాగస్వాములు కూడా కావొచ్చునని కోరిక. అయితే తన కోరికకు భాజపా సహకరించదు అనే సంగతి కూడా ఆయనకు తెలుసు. భాజపాను కాదనుకుని అయినా తెలుగుదేశంతో మైత్రిని కొనసాగిస్తానని చెప్పాలి. అలా చెప్పడానికి ఆయనకు ధైర్యం చాలడం లేదు. అసలే కేంద్రంలో అత్యంత బలమైన భారతీయ జనతా పార్టీ. దేశంలో అందరికంటె బలమైన నాయకుడు మోడీ. వారి మనోభీష్టానికి వ్యతిరేకంగా వారి పార్టీ ని వదలిపెట్టగలననే ఆలోచన అంటేనే పవన్ కు భయం.
పవన్ కల్యాణ్ కు నిజంగా ధైర్యం ఉంటే.. ‘‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీల్లేదు. తెలుగుదేశంతో మా పార్టీలు కలవాల్సిందే. తెలుగుదేశంతో కలిసి పోటీచేయడానికి ఒప్పుకోకపోతే బిజెపిని వీడుతాను’’ అని ప్రకటించగలగాలి. కానీ, ఆయనకు అంత ధైర్యం లేదు. కానీ.. బిజెపి అలా కాదు. సోము వీర్రాజు చాలా ధైర్యంగా అంత పరిస్థితే వస్తే పవన్ తో పొత్తు మాకు అక్కర్లేదనే సంకేతాలు తేల్చి చెప్పేశారు.
‘‘తెలుగుదేశం, వైసీపీలతో సమానం దూరం పాటిస్తాం. పవన్ తో బంధం మాత్రం ఉంటుంది. ఆయన కలిసి రాకపోతే.. మేం ఒంటరిగా పోటీచేస్తాం’’ అని ఆయన చెప్పేశారు. అంత స్పష్టంగా చెప్పగల తెగువ పవన్ లో కనిపించడం లేదు. ఈ విషయంలో తన పిరికితనం ప్రజలకు అర్థమైపోతోందనే సంగతి పవన్ కు బోధపడుతోందో లేదో మరి.