రాజకీయ పార్టీల్లో తిరుగుబాట్లు సహజం. ఎన్నికల సీజన్ అంటేనే వలసలకు సమయం ఆసన్నమైందని అర్థం. తాజాగా ఆంధ్రప్ర దేశ్‌లో అధికార పార్టీలో ఎమ్మెల్యేల తిరుగుబాట్లు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా వైసీపీకి కంచుకోట లాంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు అధికార పార్టీని ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. ఈ పరిస్థితులకు వైసీపీ అధినేత, ముఖ్య మంత్రి వైఎస్ బలహీనతే కారణమని పార్టీలో అంతర్గత చర్చ నడుస్తోంది.
ఆకాశమే హద్దుగా పొగిడే వాళ్లే తనకు నిజమైన ఆప్తులని వైఎస్ జగన్ నమ్మడమే ఆయన బలహీనత అనే చర్చకు తెరలేచింది. తనలాంటి సామాన్యుడికి రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, గెలిపించిన జగనన్నను ఎప్పటికీ మరిచిపోనని ఒక సందర్భంలో కోటంరెడ్డి బహిరంగంగా ప్రకటించారు. అలాగే జీవితాంతం జగన్ వెంటే పయనిస్తానని, చనిపోతే వైసీపీ జెండా కప్పాలని, అంత్యక్రియలకు ఆయనే రావాలని భావోద్వేగ సెంటిమెంట్ ప్రదర్శించారు.
కోటంరెడ్డి తన భక్తుడని జగన్ నమ్మారు. మరోవైపు కోటంరెడ్డి వైఖరిలో వస్తున్న ప్రభుత్వ వ్యతిరేక మార్పు గురించి ఎవరైనా చెప్పినా జగన్ పట్టించుకునే వారు కాదని ఇటీవల మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కోటంరెడ్డి కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి వాళ్లే జగన్ తన చుట్టూ ఎక్కువ మందిని పెట్టుకున్నారు. వారిలో ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు, సలహాదారులున్నారు. తమతమ పదవులు, అధికారాన్ని కాపాడుకునేందుకు వీరంతా “ఆహా జగన్, ఓహో జగన్” అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. గతంలో చంద్రబాబు పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. జయము జయము చంద్రన్నా అంటూ ఏకంగా పాటలే పాడారు.
తనను నిజంగా అభిమానించే వారిని జగన్ గాలికొదిలేశారు. ఉదాహరణకు తిరుపతి, మాచర్ల, శ్రీశైలం ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డిలతో పాటు మర్రి రాజశేఖర్, ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితరుల గురించి చెప్పుకోవాలి. వైఎస్సార్ కుటుంబానికి భూమన వీరవిధేయుడు. కాంగ్రెస్‌ను వీడి జగన్ సరికొత్త రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన తొలి రోజుల్లో వెంట నడిచిన ప్రపథమ నాయకుడు భూమన. వైఎస్సార్ కుటుంబంతో తమకు మూడు తరాల అనుబంధం అని ఇప్పుడు కొందరు చెబుతూ, ప్రయోజనాలు పొందే వాళ్లను చూస్తుంటే నవ్వొస్తుంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూమన ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. కనీసం టీటీడీ చైర్మన్ పదవికి కూడా ఆయన నోచుకోకపోవడం గమనార్హం. గతంలో టీటీడీ చైర్మన్‌గా ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన చరిత్ర భూమనది. తనకేమీ ఇవ్వకపోయినా ఇప్పటికీ జగన్ అంటే అభిమానించడం కరుణాకర్‌కే చెల్లింది.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి విషయానికి వస్తే… పల్నాడులో ఫ్యాక్షన్‌కు ఆయన కుటుంబం ఎంతో నష్టపోయింది. టీడీపీ అధికారంలో వున్నప్పుడు ఎదురొడ్డి నిలిచి పార్టీని కాపాడుకున్నారు. అలాంటి నాయకుడిని బలోపేతం చేయడం పక్కన పెట్టి, ఇతరేతర అంశాల్ని పరిగణలోకి తీసుకుని మంత్రి పదవులను కట్టబెట్టారు. జగన్ చర్యలు నేతల్లో స్థైర్యాన్ని, నమ్మకాన్ని తగ్గించేలా ఉన్నాయి. రేపు టీడీపీ అధికారంలోకి వస్తే… పిన్నెల్లి తప్పక మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం మంత్రి పదవికి నోచుకోలేకపోవడం గమనార్హం. ఆత్మాభిమానం ఉన్న నేతలెవరైనా జగన్ దగ్గరికి వెళ్లి చేతులు కట్టుకుని యాచిస్తారా? నిజంగా విధేయులెవరు? పార్టీకి, ప్రజలకు పనికొచ్చే నేతలెవరో జగనే గుర్తించి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. ఇది జరగని పని. ఎందుకంటే జగన్‌కు కావాల్సిందల్లా …. పొగిడేవాళ్లు. విమర్శ అంటే ఆయనకు ఎంత మాత్రం గిట్టదు.
శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి విషయానికి వస్తే… నంద్యాల ఉప ఎన్నిక సమయంలో వైసీపీలోకి వచ్చారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ నాయకుడికి ఏం దక్కిందని శిల్పా చక్రపాణిరెడ్డి అనుచరులు ప్రశ్నిస్తున్నారు. అలాగే మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని బహిరంగంగానే జగన్ హామీ ఇచ్చారు. మంత్రి పదవి కథ దేవుడెరుగు… కనీసం ఎమ్మెల్సీకి కూడా నోచుకోలేదు. మంగళగిరిలో లోకేశ్‌ను ఓడిస్తే ఆళ్లకు మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. మొదటి, రెండో విడత కేబినెట్ కూర్పులు జరిగినా, ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఎందుకు దక్కలేదో సమాధానం చెప్పేవారే కరువయ్యారు.
రాజకీయాల్లో పరస్పర ప్రయోజనాలే ముఖ్యం. ప్రయోజనాలు నెరవేరనప్పుడు ఎవరైనా తమ దారి తాము చూసుకుంటారు. ఇందుకు అతిపెద్ద ఉదాహరణ వైఎస్ షర్మిల. అన్న అధికారంలోకి వస్తే తనకు రాజకీయంగా మంచి భవిష్యత్ వుంటుందని ఆమె ఆశించి వుంటారు. కారణాలేవైనా ఏపీలో నిరాశ ఎదురైంది. దీంతో తెలంగాణలో కొత్త కుంపటి పెట్టుకుని, పోరాడుతున్నారు. తన అంత్యక్రియలకు జగనన్నే రావాలని భావోద్వేగాన్ని పండించిన కోటంరెడ్డి, కొంత కాలానికే ఈ సీఎం కాకపోతే, ఇంకో సీఎం అనే వరకూ రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
తనలాగే పార్టీలో ఉంటూ, అధికారాన్ని అడ్డు పెట్టుకుని విచ్చలవిడిగా సంపాదిస్తున్న సహచర ఎమ్మెల్యేలను కోటంరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ఆదర్శంగా తీసుకుంటున్నారు. వారికి అవకాశాలు ఇచ్చినట్టే, తమకు ఎందుకు ఇవ్వరనేది వారి ప్రశ్న. ఎంతసేపూ జగన్‌ను తాము అభిమానించడమే తప్ప, అటు వైపు నుంచి ప్రేమ లేకపోతే, ఎందుకు నాయకుడి వెంట నడవాలనే ప్రశ్నే, వారిని ప్రత్యామ్నాయ మార్గాల వైపు నడిపిస్తోంది. పనికి రారనుకుంటే దేవుళ్లను కూడా కొలవడం మానేస్తున్న కాలం ఇది.
జగన్‌కు నమ్మకంగా వెంట వుండాలనే రూల్ లేదు. జగన్ వెంట తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ఉన్నారా? అని ప్రతిపక్షాల నేతలు, రెబల్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. అలాగే వైఎస్సార్‌ను రెండు సార్లు ముఖ్యమంత్రి పదవిలో కూచోపెట్టిన సోనియా గాంధీ కుటుంబానికి ఆయన కుమారుడు జగన్ విధేయుడిగా ఉన్నాడా? లాంటి ప్రశ్నలకు వైసీపీ నుంచి సమాధానం ఏంటి?
ఇప్పటికైనా జగన్ తనను వీరుడు, శూరుడు అని పొగిడేవాళ్ల విషయంలో అప్రమత్తంగా వుండాలి. క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అంశాల గురించి చెప్పేవాళ్లను తన వాళ్లగా భావించి, వారి మాట వినాలి. అప్పుడే జగన్‌కు మంచిరోజులొచ్చినట్టు లెక్క.
– సొదుం రమణ