ప్రయాణాలు ఎక్కడైనా మొదలు కావొచ్చు గాక… ఆయా ప్రయాణాలు మధ్య మధ్యలో ఎన్ని రకాల మలుపులైనా తీసుకోవచ్చు గాక… వాటన్నింటి గమ్యం మాత్రం ఒకే ఒక్కటి… అదే వైఎస్సార్ కాంగ్రెస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినంత వరకు.. వేర్వేరు పార్టీల్లో తమతమ అదృష్టాల్ని అనేక సందర్భాలుగా పరీక్షించుకున్న అనేక మంది నాయకులు… తమ రాజకీయ ప్రస్థానం సుస్థిరంగా, భద్రంగా కొనసాగడానికి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే శరణ్యం అని తెలుసుకుంటున్నారు. అందుకే నెమ్మదిగా జగన్ ఆశ్రయంలోకి చేరుతున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి హఠాత్తుగా వరుస చేరికలు చోటు చేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు క్యూ కడుతున్నారు. డొక్కా మాణిక్యవరప్రసాద్ వైకాపా వైపు వెళుతున్నాడనే సంగతి.. చాలాకాలం కిందటే తేలిపోయింది. ఇవాళ వైఎస్ కుటుంబానికి ఎదురొడ్డి పులివెందులలో పోటీచేయడానికి కొన్ని తరాలుగా తెలుగుదేశానికి ఏకైక దిక్కుగా ఉన్న సతీశ్ రెడ్డి కూడా వైకాపాలో చేరుతున్నారు. ఎన్నికల సమయంలో జనసేన పార్టీలో హఠాత్తుగాచేరి, ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే రాజీనామా చేసిన ఫక్తు అవకాశవాద రాజకీయనాయకుడు పసుపులేటి బాలరాజు.. అందరూ కూడా.. ఇవాళ వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ఎంతగా అంటే.. పార్టీలోకి వచ్చి చేరుతున్న వారు సీనియర్లే అయినా.. వారందరికీ కండువాలు కప్పి చేర్చుకోవడానికి జగన్మోహన రెడ్డికి పూర్తిగా ఖాళీ ఏమీ లేదు. విజయసాయిరెడ్డి సగం ఆ బరువును పంచుకుంటున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నాయకుల సంఖ్యను పక్కన పెట్టండి. కానీ ఆ పోకడను మాత్రం గమనించండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో- ఏ పార్టీలో ఉన్న వారికైనా సరే.. తమ రాజకీయ భవిష్యత్తు గురించి కించిత్ చింత కలిగినప్పుడు… వారిలో తాము మనుగడ సాగిస్తున్న పార్టీ భవిష్యత్తు మీద భయం పుట్టినప్పుడు.. వారందరికీ కూడా.. ఏకైక ప్రత్యామ్నాయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కనిపిస్తున్నది.
వైకాపాలో చేరడానికి వారు ఎలాంటి పదవులు ఇస్తారనే బేరాలు ఆడే స్థితిలో ఏమీ లేరు. ఏది దక్కితే అదే మహప్రసాదం అనుకునే స్థితిలో ఉన్నారు. వైకాపాలోకి చేరికలు అనేవి ఇవాళ ఆగిపోవడం లేదు. ముందుముందు ఇంకా ముమ్మరంగా జరగబోతున్నాయని అర్థం చేసుకోవాలి. అందరి గమ్యం ఒక్కటే అని అర్థమవుతోంది.