రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్లు, వైఎస్ హయాంలో ఆయనతో అతి సన్నిహితంగా ఉన్నవారు కూడా జగన్ దగ్గరకు వచ్చేసరికి కాస్త నెమ్మదిగానే మసలుకుంటున్నారు. అయితే మంత్రి పదవుల వ్యవహారంలో మాత్రం కొంతమంది బాగా హర్ట్ అయ్యారు. అలాంటి వారిలో నెల్లూరు జిల్లాకు చెందిన మాజీమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఒకరు. తనకు కచ్చితంగా మంత్రిపదవి వస్తుందని అంచనా వేసుకుని భంగపడ్డ రామనారాయణ రెడ్డి చాలారోజుల వరకు మీడియాకు దూరంగా ఉన్నారు.
ఈమధ్యే అసెంబ్లీలో కాస్త గొంతు సవరించుకుని అలకపాన్పు దిగినట్టు కనిపించారు ఆనం. అయితే అంతలోనే ఆయనకు మరో షాకిచ్చారు జగన్. డీసీసీబీ అధ్యక్ష పదవిని రామనారాయణ రెడ్డి తన సన్నిహితుడు ధనుంజయ రెడ్డికి ఇప్పించుకోవాలని చూశారు. చివరివరకూ ఒత్తిడి తెచ్చారు, కానీ ఆఖరి నిముషంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరిక మేరకు ఆ పదవి ఆనం విజయకుమార్ రెడ్డిని వరించింది.
ఇక్కడ విచిత్రం ఏంటంటే.. తన సొంత తమ్ముడ్ని కూడా కాదని, ఎన్నికల్లో తనకు ఆర్థికసాయం చేశారని వేరేవారికి పదవి కావాలని కోరారు రామనారాయణ రెడ్డి. ఆ మాటకొస్తే ఆనం సోదరుల మధ్య చాన్నాళ్ల నుంచి మాటలు లేవనుకోండి. జగన్ మాత్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీలో చేరి పదవులు ఆశించకుండా పార్టీ గెలుపుకి కృషిచేసిన ఆనం విజయకుమార్ రెడ్డి వైపే మొగ్గుచూపారు. ఈ విషయంలో రామనారాయణ రెడ్డి తీవ్రంగా నొచ్చుకున్నారని సమాచారం.
మంత్రిపదవి ఇవ్వలేదు సరే, కనీసం తన అనుచరులకు జిల్లాస్థాయి పోస్టింగ్ కూడా ఇవ్వరా అంటూ బాధపడుతున్నారు ఆనం. ఇలా చేస్తూపోతే జిల్లాలో తన పరపతి ఏం కావాలంటూ అలిగారట. తన వయసుకి, తన సీనియార్టీకి గౌరవం ఇవ్వడంలేదంటూ సన్నిహితుల వద్ద వాపోతున్నారు రెడ్డిగారు. ఈ విషయాలన్నీ జగన్ కి తెలుసు కానీ, కొంతమంది విషయంలో మాత్రం ఆయన చాలా కఠినంగా ఉంటూ వస్తున్నారు. గతంలో తనమీద చేసిన తీవ్ర విమర్శలు కావొచ్చు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దూరంగా ఉండి, ఎన్నికలు దగ్గర పడేటప్పుడు పార్టీలోకి వచ్చారన్న అభిప్రాయం కావొచ్చు
రామనారాయణ రెడ్డి లాంటి వారిని కొంత దూరంలోనే పెట్టారు జగన్. దగ్గరవాళ్లు చెబుతున్న సమాచారం ప్రకారం, జగన్ బుజ్జగించే ప్రయత్నం కూడా చేయకపోవచ్చు. అధికార పార్టీలో ఉన్న ఈ అలకలన్నీ ఎప్పటికి సెట్ అవుతాయో చూడాలి.