వైఎస్సార్ హయాంలో ఆర్థికశాఖను నిర్వహించిన నాయకుడు, ఆయన మరణం తర్వాత ఓ దశలో ముఖ్యమంత్రి పీఠం కోసం కూడా ప్రయత్నించిన సీనియర్ నేత. అలాంటి ఆనం రామనారాయణ రెడ్డికి జగన్ హయాంలో మంత్రిపదవి దక్కకపోవడం ఆశ్చర్యమే. కానీ జిల్లాల వారీగా, సామాజిక వర్గ సమీకరణాల్లో ఆనం లాంటి చాలామందికి మంత్రి పదవులు దక్కలేదు. పదవి దక్కని అసంతృప్తులంతా రెండు రోజుల్లో సెట్ అయ్యారు. మళ్లీ మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చేసి ఆల్ ఈజ్ వెల్ అన్నారు. ఒక్క ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం ఇంకా మౌనం వీడలేదు.
తనకు మంత్రిపదవి రాకపోయినా ఫర్వాలేదు కానీ, తనకంటే రాజకీయ అనుభవంలో చాలా చిన్నవాళ్లయిన అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డికి నెల్లూరుజిల్లా నుంచి మంత్రి పదవులు దక్కడంపై ఆనం కినుక వహించారని సమాచారం. అందుకే ఆయన ఇంకా అలకపాన్పు దిగలేదట. నిజానికి అతడికి ఆర్థికశాఖ గ్యారెంటీ అనుకున్నారంతా. కానీ ఏకంగా కేబినెట్ కే దూరమయ్యారు ఆనం.
మరోవైపు జగన్ కూడా కొంతమందిని ప్రత్యేకంగా పిలిపించి బుజ్జగించారు కానీ ఆ లిస్ట్ లో ఆనం రామనారాయణ రెడ్డి లేకపోవడం కొసమెరుపు. అయితే త్వరలోనే ఆనం జగన్ తో భేటీ అవుతారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. రెండున్నరేళ్ల తర్వాత ఆనంను మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని, అంతవరకు ఓపిక పట్టాలని ఆయనకు సర్దిచెబుతారట.
ఆనం లాంటి సీనియర్ ని మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం పొరపాటే అయినా.. అంతకు మించి పార్టీ ప్రయోజనాలు, సామాజిక న్యాయం వైపే జగన్ ఎక్కువగా మొగ్గుచూపారు. ఈ విషయాలన్నీ ఆనంకు వివరించడానికి జగన్ సిద్ధమయ్యారట. కాకపోతే వ్యవహారం కాస్తలేటుగా సాగుతోందంతే.