Advertisement

Advertisement


Home > Politics - Gossip

నెల్లూరు నుంచి అనిల్ ఔట్‌... ఎక్క‌డి నుంచి అంటే?

నెల్లూరు నుంచి అనిల్ ఔట్‌... ఎక్క‌డి నుంచి అంటే?

నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాద‌వ్‌ను అక్క‌డి నుంచి త‌ప్పించేందుకు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ నిర్ణ‌యించిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. నెల్లూరు సిటీ నుంచి వ‌రుస‌గా రెండు ద‌ఫాలు అనిల్ వైసీపీ త‌ర‌పున గెలుపొందారు. వైసీపీ ప్ర‌భుత్వంలో కీల‌క‌మైన జ‌ల‌వ‌న‌రుల‌శాఖ మంత్రిత్వ ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. జ‌గ‌న్‌కు ఇష్ట‌మైన ఎమ్మెల్యే. జ‌గ‌న్ కోసం ప్రాణాలైనా ఇస్తాన‌ని అనిల్ ప‌దేప‌దే ప్ర‌క‌టిస్తుంటారు.

అయితే దూకుడు స్వ‌భావంతో చివ‌రికి సొంత పార్టీ వాళ్ల‌తోనే శ‌త్రుత్వం ఏర్ప‌డింది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేని ప్ర‌త్య‌ర్థుల కంటే సొంత పార్టీ నేత‌లే ఓడించ‌డానికి సిద్ధంగా ఉన్నారు. అనిల్‌కుమార్ యాద‌వ్‌తో నెల్లూరు జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు, రాజ్య‌సభ స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డికి అస‌లు పొస‌గ‌డం లేదు. నెల్లూరు నుంచి అనిల్ పోటీ చేస్తే, తాను నెల్లూరు ఎంపీ అభ్య‌ర్థిగా బ‌రిలో వుండ‌న‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు వేమిరెడ్డి తేల్చి చెప్పారు.

మ‌రోవైపు టీడీపీ నుంచి మాజీ మంత్రి నారాయ‌ణ బ‌రిలో ఉన్నారు. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాలు నెల్లూరులో నారాయ‌ణ‌కు అనుకూలంగా ఉన్న‌ట్టు సర్వే నివేదిక‌లు చెబుతున్నాయి. అనిల్‌పై సొంత పార్టీలోనే తీవ్ర వ్య‌తిరేక‌త ఉన్న‌ట్టు వైఎస్ జ‌గ‌న్ గుర్తించారు. దీంతో ఆయ‌న్ను నెల్లూరు నుంచి లేపేసి ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా క‌నిగిరికి పంపాల‌ని నిర్ణ‌యించారు. ప్ర‌స్తుతం అక్క‌డ యాద‌వ సామాజిక వ‌ర్గానికే చెందిన బుర్రా మ‌ధుసూద‌న్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయ‌న‌పై అస‌మ్మ‌తి వుంది.

క‌నిగిరి నుంచి మ‌రోసారి మ‌ధుసూద‌న్ యాద‌వ్‌ను కొన‌సాగించే ప‌రిస్థితి లేదు. అందుకే అదే సామాజిక వ‌ర్గానికి చెందిన అనిల్‌కుమార్ యాద‌వ్‌ను క‌నిగిరి నుంచి బ‌రిలో దింపాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రెడ్ల ఓట్లు 60 వేలు, యాదవుల ఓట్లు 25 వేలు ఉన్న‌ట్టు చెబుతున్నారు. దీంతో వైసీపీ త‌ర‌పున ఎవ‌రు నిల‌బ‌డ్డా గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే అని భావించి అనిల్‌ను అక్క‌డికి పంప‌డానికి జ‌గ‌న్ సిద్ధ‌మ‌య్యారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?