నెల్లూరు వైసీపీలో అనీల్ ఒంటరి అయ్యారా?

ఆ ఇద్దరు తప్ప అందరికీ థ్యాంక్స్ అంటూ ఇటీవల మాజీ మంత్రి అనిల్ పలు వేదికలపై చెప్పుకొచ్చారు. కాకాణి, ఆనం తప్ప జిల్లాలోని ప్రతి ఎమ్మెల్యేకి పేరు పేరునా ధన్యవాదాలు చెప్పారు. తాను మంత్రిగా…

ఆ ఇద్దరు తప్ప అందరికీ థ్యాంక్స్ అంటూ ఇటీవల మాజీ మంత్రి అనిల్ పలు వేదికలపై చెప్పుకొచ్చారు. కాకాణి, ఆనం తప్ప జిల్లాలోని ప్రతి ఎమ్మెల్యేకి పేరు పేరునా ధన్యవాదాలు చెప్పారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు అందరూ తనకు సహకరించారని అన్నారు. అందరూ తనవారేనన్నారు. గడప గడపకు యాత్రలో ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని నేరుగా వెళ్లి కలసి వచ్చారు. అయితే ఆ తర్వాత కాకాణి ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది.

కాకాణి నెల్లూరు జిల్లాలోకి వస్తూ వస్తూనే అనిల్ తనకి ఆప్తుడు అని చెప్పుకుంటున్న కావలి ఎమ్మెల్యేని తనవైపు తిప్పుకున్నారు. కాకాణికి భారీ స్థాయిలో స్వాగతం పలికింది కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డే. అక్కడితో ఆ వికెట్ పడింది. ఇక నెల్లూరులోకి వచ్చిన తర్వాత తొలి సమీక్షలోనే ఎమ్మెల్యేలందర్నీ తనతోపాటు వేదికపైనే కూర్చుని ఉండాలని చెప్పారు కాకాణి. అక్కడితో ఆయన ఆప్యాయత ఏంటో అందరికీ తెలిసింది. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సహా మిగతా వారు కూడా కాకాణికి ఆప్తులైపోయారు.

ఆ తర్వాత కోటంరెడ్డి వంతు. కోటంరెడ్డి, అనిల్ ఇటీవల భేటీ అయ్యారు కాబట్టి.. వారిద్దరూ ఓ జట్టు అనుకున్నారంతా. మంత్రి పదవి రాలేదని కోటంరెడ్డి రగిలిపోతున్నారని, ఆయనకు అనిల్ తోడయ్యారని, వీరిద్దరూ కాకాణికి వ్యతిరేకంగా పనిచేస్తారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే గంటల వ్యవధిలోనే ఆ సమీకరణాలు మారిపోయాయి. కాకాణి అభినందన సభకు కోటంరెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి వెళ్లారు. ఆ తర్వాత నేరుగా కాకాణిని తన నియోజకవర్గానికి పిలిపించి భారీ సభ పెట్టారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. అక్కడితో వారిద్దరి మధ్య సయోధ్య కుదిరింది.

ఇక నెల్లూరు జిల్లాలో అనిల్ వర్గంగా చెప్పుకుంటున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. ఆయన గాలివాటం బ్యాచ్ కాబట్టి కాకాణితో ప్యాచప్ కి రెడీ అయినట్టే లెక్క. సో.. ఎలా చూసుకున్నా ఎమ్మెల్యేల విషయంలో అనిల్ ఒంటరి అయ్యారనే చెప్పాలి. సీఎం జగన్ తో భేటీ తర్వాత తమ మధ్య ఎలాంటి విభేధాలు లేవని.. ఇటు కాకాని, అటు అనీల్ ప్రకటించుకున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో వేర్పాటు రాజకీయాలు కళ్లకు కనిపిస్తూనే ఉన్నాయి.

వేమిరెడ్డితో కూడా శతృత్వమేనా..?

నెల్లూరు జిల్లా నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు ప్రముఖ పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇటీవల ఎంపీ వేమిరెడ్డి ఫ్లెక్సీ కూడా నెల్లూరు నగరంలో చినిగిపోయింది. అనధికారిక ఫ్లెక్సీలకు తన నియోజకవర్గంలో చోటు లేదంటూ అనిల్ బహిరంగ స్టేట్ మెంట్ కూడా ఇవ్వడంతో ఆ గొడవ మరింత ముదిరింది. ఇప్పుడు వేమిరెడ్డి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కూడా. అనిల్ ని తీసుకెళ్లి వైఎస్సార్, తిరుపతి జిల్లాలకు కోఆర్డినేటర్ గా వేశారు.

సో.. అనిల్ కి నెల్లూరు జిల్లాపై పెత్తనం లేదు, జిల్లాపై పెత్తనం ఉన్న పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డితో, జిల్లా మంత్రి కాకాణితో ఆయనకు కయ్యం ఉంది. ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే.. నెల్లూరులో అనిల్ ఒంటరి అయిపోయినట్టే లెక్క. ప్రస్తుతం నెల్లూరు టౌన్ పై ఆనం వర్గం పట్టు కోసం చూస్తోంది. ఈ దశలో ఆనంని ఢీకొంటూ.. నెల్లూరు నగరంలో తన వర్గాన్ని కాపాడుకోవడం కూడా అనిల్ ముందున్న పెద్ద సవాల్. దాన్ని ఆయన ఎలా ఎదుర్కొంటారో చూడాలి.