-రాజకీయ భవితవ్యంపై ఎవరి లెక్కలు వారివి
-అధికారంతో వైఎస్సార్సీపీ, ఆరాటంతో బీజేపీ
-అగమ్యగోచరంగా టీడీపీ
-అంతుబట్టని తీరులో జనసేన
ఎన్నికలు అలా ముగిశాయో లేదో.. కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడోనెల అయినా గడవక ముందే ఏపీ రాజకీయం అప్పుడే హీటెక్కుతోంది. నేతలు అప్పుడే తమ తమ రాజకీయ భవితవ్యాల మీద కసరత్తులు ప్రారంభించడం, రాజకీయ పార్టీల వారీగా కూడా భవిష్యత్తు ఏమిటనే అంశం గురించి చర్చించుకోవడం మొదలుకావడంతో.. రాజకీయం కాక మీదకు వస్తోంది. ఒకవేళ ఏపీలో ఉన్నది రెండే రాజకీయ పార్టీలే అయితే.. భవిష్యత్తు పోరు కూడా వాటి మధ్యనే అయిఉంటే.. ఇప్పుడప్పుడే రాజకీయం వేడెక్కేది కాదు. ఏపీ రాజకీయంలో కొత్త ఆశావహులు పుట్టుకొచ్చారు. సూది మోపడానికి తగినంత స్థలం దొరికితే చాలు తర్వాత విస్తరించుకుంటూ పోవడమే అనే ఫార్ములాతో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏపీ రాజకీయాన్ని వేడెక్కిస్తూ ఉంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీని రూపుమాపడం, అధికార పక్షాన్ని దించడం.. అనేది భారతీయ జనతా పార్టీ ఆశ, ఆశయం!
అయితే కేంద్రంలోని బీజేపీ వాళ్లతో సఖ్యతగా ఉంటూనే.. ఆ పార్టీకి అవకాశం ఇవ్వకూడదు అన్నట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో బీజేపీ వ్యతిరేకతను బాహాటంగానే చాటింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ. తద్వారా తాము భారతీయ జనతా పార్టీకి బానిసలం కాదనే సంకేతాలను చాలా స్పష్టంగానే ఇచ్చారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు. మరోవైపు అయినదానికీ కానిదానికి జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం మొదలుపెడుతోందని భారతీయ జనతా పార్టీ. ఈ విషయంలో తెలుగుదేశం, జనసేనల కన్నా తామే ముందున్నామన్నట్టుగా బీజేపీ నేతలు చాటుకోవడానికి ఉబలాటపడుతూ ఉన్నాయి.
ఇక ఏపీ రాజకీయంలో ఏం జరుగుతోందో అర్థంకానట్టుగా ప్రేక్షకపాత్ర వహిస్తూ ఉన్నాయి తెలుగుదేశం, జనసేనలు. ఆ పార్టీల తరఫున ఏ అజెండా ఉన్నా, ఆ పార్టీల్లోని నేతలు మాత్రం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లేదా? బీజేపీ వైపు వెళ్లేదా? అనే అంశం గురించి తర్జనభనర్జనలు పడుతూ ఉన్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిణామాల మధ్యన ఏపీ రాజకీయంలో ఏ పార్టీ ఎలాంటి 'గేమ్ ప్లాన్'తో ఉందనే అంశం గురించి విశ్లేషిస్తే…
అధికార పార్టీ.. ఆల్ ఈజ్ వెల్!
ఎన్నికల హామీలను అమలు పరచడం అంటే.. అది మళ్లీ ఎన్నికలకు వచ్చేముందు చేసే పని అనికాకుండా.. ఎంతోకొంత మేరకు అయినా ప్రతి హామీనీ అమలు పరిచేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. జగన్ హామీలు అమలు పరుస్తున్న తీరును ఆయన ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తూనే ఉన్నారు. అయితే వారితో పట్టింపు లేకుండా తన మేరకు జగన్ హామీల అమలు చేస్తూ ఉన్నారు. వద్ధాప్య పెన్షన్లు ఎంతోకొంత పెంచారు. రైతులకు పెట్టుబడి మొత్తాన్నీ ఒకేసారి అందిస్తూ ఊతం ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు మాత్రమే అమల్లోకి తీసుకొచ్చిన పథకాలను జగన్ వాటి రేంజ్ పెంచి మరీ అమలు పరుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రత్యర్థి రాజకీయ పార్టీలను సంతృప్తి పరచకపోయినా.. ప్రజలను మాత్రం ఆకట్టుకునే అంశమే. ఇక జగన్ సంధించిన మరో సమ్మోహనాస్త్రం ఉద్యోగాలు!
భారీఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జగన్ మోహన్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. ఉద్యోగాల భర్తీ అంటే.. అది సుదీర్ఘ సమయం తీసుకునేది కాకుండా కేవలం రెండునెలల వ్యవధిలో భారీఎత్తున నియామకాలు జరిగాయి, జరగబోతూ ఉన్నాయి. ఇది యువతను ఆకట్టుకునే అంశమే. అధికార పార్టీ రాజకీయం ఇలాంటి చోటే ఉంటుంది. ఒక్కసారి కొన్ని లక్షల మందిని ఉద్యోగులుగా చేస్తే ఆ పార్టీకి వీలైనంత మైలేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన వెనువెంటనే జగన్ ఈ మాత్రం మార్పులను చూపిస్తూ ఉండటం యువతను ఆకట్టుకునే అంశమే. భిన్నవర్గాలను ఆకట్టుకునేందుకు తనవంతు ప్రయత్నం చేస్తూ 'ఆల్ ఈజ్ వెల్' అన్నట్టుగా సాగుతూ ఉన్నారు జగన్ మోహన్‌రెడ్డి.
ఇక మరోవైపు రాజకీయం విషయంలో కూడా జగన్ వ్యూహాలు అంతర్గతంగా అమలు అవుతూ ఉన్నాయి. ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రతిబంధకాలు అందరికీ తెలిసినవే. వాటి గురించి జగన్ కూడా అవగాహన ఉంది. తెలుగుదేశం పార్టీకి లీడర్ షిప్ వీక్ అయినా కేడర్ ఉంది. కొన్ని కులాల్లో తెలుగుదేశం పార్టీకి పట్టుంది. బీసీ వర్గాలు తెలుగుదేశం పార్టీకి అత్యంత అనుకూలం. అయితే ఇటీవలి ఎన్నికల్లో తన వ్యూహాలతో బీసీలను తెలుగుదేశం పార్టీకి చాలావరకూ దూరంచేశారు. అందుకు ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఇప్పుడు సంక్షేమ పథకాల ద్వారా వారిని ఆకట్టుకుని టీడీపీని గ్రాస్ రూట్స్‌లో మరింతగా బలహీనం చేసే దిశగా సాగుతున్నారు జగన్. ఇక ఎన్నికల ముందు ఆవేశంతో పార్టీని వీడిన వారిని తిరిగి ఆదరించడానికి జగన్ రెడీగానే ఉన్నారని తెలుస్తోంది.
అలాగే పార్టీలోకి వస్తామంటూ ప్రతిపాదనలు పంపిన వారికి టక్కున 'నో' అని చెప్పకుండా కాస్త వెయిట్ చేయమంటూ జగన్ సంకేతాలు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. వారి ట్రాక్ రికార్డు, పార్టీకి వారి అవసరాలను బట్టి జగన్ వారికి ముందు ముందు అవకాశాలు ఇవ్వబోతున్నారనే మాటా సాగుతూ ఉంది. ఏదేమైనా భారీఎత్తున అనుకూలంగా వచ్చిన తీర్పును ఎంజాయ్ చేస్తూనే, ఈ మద్దతును మరిన్ని టర్మ్‌లు ఒడిసి పట్టుకోవాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. అయితే ఆ పార్టీకి ఇప్పటికీ కర్త, కర్మ, క్రియ జగన్ మాత్రమే కావడం మాత్రం గమనించాల్సిన అంశం. అధికారం సంపాదించుకున్న తర్వాత కూడా పార్టీ బలోపేతం బాధ్యతలు తీసుకునే వ్యవస్థ ఇంకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన దాఖలాలు కనిపించడం లేదు. అలాంటి వ్యవస్థ ఏర్పడినప్పుడే సుదీర్ఘ రాజకీయం సాధ్యం అవుతుంది. ఈ విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు గ్రహించాల్సి ఉంది.
భారతీయ జనతాపార్టీ.. ఆశలావు పీక సన్నం!
తాము చాపకింద నీరులా ప్రవేశిస్తామని, తమకు ఏమాత్రం అనుకూలత లేని రాష్ట్రాల్లోనే పాగా వేశమని, హిందూయిజం ప్రభావం లేని, కేవలం తెగలు మాత్రమే ఉండే ఈశాన్య రాష్ట్రాల్లోనే తాము హిందుత్వ వాదంతో దూసుకుపోయి అధికారాన్ని సొంతం చేసుకున్నట్టుగా భారతీయ జనతా పార్టీ వాళ్లు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది తమకు ఏపీ పెద్ద కథ కాదన్నట్టుగా వారు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. అయితే భారతీయ జనతా పార్టీకి తన ఫార్ములాలను అమలు చేయడానికి ఏపీలో అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్నాయి.
తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తాము ఎదగాని బీజేపీవాళ్లు భావిస్తూ ఉన్నారు. వాళ్ల ఊహాలు ఎలా ఉన్నాయంటే.. ఏపీలో కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదిగిట్టుగా, బలమైన శక్తిగా ఏర్పడినట్టుగా తెలుగుదేశం స్థానంలో బీజేపీ రావాలి! అదీ కమలనాథుల ఆశ, ఆశయం. అయితే వాళ్లు రాజకీయంగా బలోపేతం కావడానికి కేవలం ఫిరాయింపులనే నమ్ముకోవడం విడ్డూరం. రాజ్యసభలో తమమాట చెల్లుతుంది కాబట్టి అనైతిక ఫిరాయింపును నైతికం అనిపించేసుకున్నారు.
అయితే అలాంటి చేరికల వల్ల టీడీపీకి పోయేదేమీ లేదు, బీజేపీకి దక్కేదీ ఏమీలేదు. ఏపీలో ఉనికి చాటుకోవాలనుకుంటే బీజేపీ ముందుగా ఏపీ ప్రజల మనసులను గెలవాలి. దానికోసం బీజేపీకి మార్గం ఉంది. అదే ప్రత్యేకహోదా. ఇప్పటివరకూ జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తున్నామని కేంద్రం నుంచి ప్రకటన వస్తే.. అప్పుడు ఏపీలో బీజేపీ ఉనికి చాటుకోవడానికి అవకాశం ఉంటుంది. అనేకమంది నేతలు వచ్చి చేరతారు, వారంతా ప్రజలకు చెప్పుకోవడానికి ప్రత్యేకహోదా ఆయుధం అవుతుంది. అయితే కమలం పార్టీ నేతలు మాత్రం 'ఆ ఒక్కటీ అడక్కు' అని అంటున్నారు!
హోదా గురించి ప్రజలనే కించపరిచేంత రీతిలో ఏపీ బీజేపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక హోదాకు బదులుగా ఏపీ మీద మోడీ మరోరకంగా ఏమైనా ప్రేమ చాటుతున్నారా? అంటే అదీలేదు! అన్నీ ఉత్తమాటలే. ఏపీ జనాలు ఇప్పటికే మాటలు వినీ వినీ అలిసిపోయారు. బీజేపీ నుంచి, టీడీపీ నుంచి ఐదేళ్లపాటు వచ్చింది కేవలం గాలి మాటలు మాత్రమే. మళ్లీ అలాంటివే చెప్పి బీజేపీ బలపడాలని అనుకోవడం కేవలం భ్రమ. ఇదేరీతిన సాగితే.. ఎవరు బీజేపీలోకి వెళ్లినా ఆ పార్టీ ఇటీవలి ఎన్నికల్లో సాధించుకున్న 0.84 శాతానికి మించి ఓట్లు పెరిగేలా లేవని పరిశీలకులు అంటున్నారు!
తెలుగుదేశం.. 'నో ప్లాన్' వారి గేమ్ ప్లాన్
తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏమీ ప్లాన్ చేసే స్థితిలో లేదు. శక్తి సామర్థ్యాలు ఉడిగిపోయాయి… వ్యూహ చాతుర్యాలు మసకబారిపోయాయి… మహా అయితే గత ప్రభుత్వ కాలం నాటి ఆర్జన- సంపద రూపంగా కొంత మిగిలి ఉండొచ్చు. కానీ… అది గేమ్ ప్లాన్కు ఉపకరించేది కాదు. వాస్తవంగా చెప్పాలంటే.. తెలుగుదేశం ప్రస్తుతం సడుగులు విరిగిపోయిన తర్వాత.. సణుగుడు మాత్రమే మిగిలింది వారికిప్పుడు. రాష్ట్రంలో ఉన్న, ఉండదలచుకుంటున్న, తాపత్రయ పడుతున్న ఇతర పార్టీలు ఎలాంటి 'గేమ్ ప్లాన్'తో పావులు కదుపుతున్నారో గమనించడం తప్ప చంద్రబాబునాయుడు ప్రస్తుతానికి తానుగా ఏమీ ప్లాన్ చేసే స్థితిలో లేరు.
తెలుగుదేశం పార్టీనుంచి నలుగురు రాజ్యసభ ఎంపీలు భాజపాలోకి ఫిరాయించినప్పుడు… కొందరికి ఒక అనుమానం వచ్చింది. దాన్ని సోషల్ మీడియా విస్తతంగా ప్రచారం చేసింది కూడా! అదేంటంటే… తన మనుషులను చంద్రబాబు భాజపాలోకి కోవర్టుల్లాగా పంపుతున్నారని… ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన ప్రభ మసకబారిపోకుండా.. వారు భాజపాలో కీలకంగా ఉండి.. తనకు అనుకూలంగా పనిచేస్తారని.. వచ్చే ఎన్నికల వేళకు భాజపా తిరిగి తనకు మద్దతిచ్చేలాగా చక్రం తిప్పుతారని.. అప్పుడు మళ్లీ 'రిపీట్ 2014' వ్యూహం అమలు చేసి.. గద్దెఎక్కడానికి అయిదేళ్ల ముందే పన్నిన పన్నాగం ఇది అని… ఇలా రకరకాలుగా ఊహాగానాలు సాగాయి.
ఆ నలుగురు తర్వాత.. ఇప్పటివరకు తెలుగుదేశంలోని ఇంకా పలువురు సీనియర్ నాయకులు కమలదళంలో చేరదలచుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వీటిలో చాలావరకు చంద్రబాబు వ్యూహంగా ముడిపెట్టడం కూడా జరుగుతోంది. కానీ నిజంగా చంద్రబాబునాయుడుకు అంత సీన్ లేదు. కనీసం పార్టీని అదుపులో ఉంచుకునే విషయంలోనైనా… చంద్రబాబునాయుడు అధికారం ఉన్నప్పుడు మాత్రమే పులి. ఇప్పుడిక ఆయన గీసిన గీత దాటకుండా పార్టీ నాయకులు ఉంటారని అనుకోవడం భ్రమ. పైగా ఇప్పుడు ఆయన… అధికారం లేని, వేటాడ్డానికి పరుగెత్తే శక్తి కూడా వృద్ధ పులి. ఇప్పుడు ఆయనను చూసి జడుసుకునే వారు గానీ, ఆయన ఉన్నారనే భరోసాతో భవిష్యత్తు గురించి కలలు కనేవారు గానీ లేరు.
సుజనాతో చాలాకాలంగా సంబధాలు చెడాయి. కానీ.. సీఎం రమేష్ చంద్రబాబుకు విశ్వాసపాత్రుడే. సుజనా పోకకంటె.. సీఎం రమేష్ పోవడం గురించి.. ఇలాంటి 'కోవర్టు' సందేహాలు రేగినా సమంజసమే. కానీ.. వాటిని నమ్మక్కర్లేదు. ఎందుకంటే.. వచ్చే ఎన్నికలకు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు సారథ్యంలోనే, ఆయన సేనానిగానే పోరాటానికి దిగుతుందనే నమ్మకం ఉంటే.. ఇప్పటికీ అందులోనే కొనసాగుదామనే నాయకులు ఉన్నారు. కానీ.. బాబు మీద అలాంటి నమ్మకం లేక, పగ్గాలు లోకేష్ అందుకుంటాడేమోననే భయం కొద్దీ.. అందరూ పలాయనం చిత్తగిస్తున్నారు.
ఇప్పుడిక శల్యావశిష్టంగా మిగిలిన శ్రేణులతో చంద్రబాబు రచించగల 'గేమ్ ప్లాన్' అంటూ ఏదీలేదు. అలాగని చంద్రబాబునాయుడు సమస్తం సన్యసించినట్లుగా చేతులకు, దారం కట్టేసుకుని కూర్చుంటారని అనుకోలేం. కాపోతే అన్ని పార్టీలూ ఎలాంటి గేమ్ ప్లాన్తో అడుగు వేస్తున్నారో గమనించడం మినహా ఆయనకు వ్యాపకం లేదు. ఏతావతా.. మరో ఏడాది రెండేళ్లు గడిచిన తర్వాత గానీ.. నిజంగానే తన జట్టులో మిగిలిన వారు ఎవరో ఎంత సమర్థులో తేలిన తర్వాతగానీ.. గేమ్ ప్లాన్ రచించే ప్రయత్నానికి ఆయన ఉపక్రమించకపోవచ్చు.
జనసేన… బతికి ఉంటేనే బేరముంటుంది!
పవన్ కల్యాణ్ చాలా స్పష్టమైన గేమ్ ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. పార్టీ అస్తిత్వం అనేది ఆయనకు చాలాముఖ్యం. వచ్చే ఎన్నికల దాకా పార్టీ బతికి ఉండాలి. ఉంచాలి. అందుకు ఆయన చాలా తపన పడుతున్నారు. 'స్వచ్ఛమైన రాజకీయాలు' అనేమాట ఒక మార్కెట్ ఎలిమెంట్ అని.. తన పార్టీకి మాంఛి మార్కెట్ వేల్యూ ఏర్పడుతుందని ఆయనకు తెలుసు. వచ్చే ఎన్నికల దాకా మరో అయిదేళ్లపాటూ అందుకోసం నిరీక్షించే ఉద్దేశంతోనే ఆయన ఉన్నారు. సో, జనసేన గేమ్ ప్లాన్ 'మనుగడ'!
స్వయంగా అధినేత రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోయి.. రాష్ట్రవ్యాప్తంగా ఏడు కంటె తక్కువ శాతం ఓట్లను మూటగట్టుకుని విఫలమైన పార్టీ, ప్రత్యామ్నాయ అధినేత కూడా లేకుండా అదే వ్యక్తిని నమ్ముకుని మనుగడ మీద ఆశ పెంచుకోవడం అనేది చాలా చిత్రమైన పరిణామం. నిజానికి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థుల్లో మనుగడ గురించిన ఆశ కూడా లేదు. ఎటు పారిపోదామా.. అని వారు తెరచి ఉన్న తలుపులు వెతుక్కుంటున్నారు. కానీ.. పవన్ మాత్రం వారిలో కొందరిని సావధానంగా, కొందరిని విసురుగా డీల్ చేస్తూ.. పార్టీ అస్తిత్వం శిథిలం కాకుండా పోరాడుతున్నారు.
'స్వచ్ఛ రాజకీయాల' మాటచెబుతూ.. పోరాడినంత మాత్రాన.. ప్రజలంతా తనకు ఎగబడి ఓట్లస్తారని, నెక్ట్స్ టైం నెగ్గి అధికారంలోకి వచ్చేస్తానని పవన్‌కు ఆశలేదు. కాకపోతే ఇలాంటి పాజిటివ్ ఇమేజిని పెంచుకుంటూ.. 7ను కాస్తా.. 8-10 వరకూ పెంచుకోగలిగినా.. తన అండుకోసం ఎవరో తన అండకోసం ఆశ్రయిస్తారని.. అప్పుడు సరైన 'బెనిఫిట్' వర్కవుట్ అవుతుందని ఆయన ఎదురుచూస్తున్నారు. తెలుగుదేశం- వైకాపా హోరాహోరీగా పోరాడిన 2019 ఎన్నికల్లో తనహవా ఎంతోకొంత పనిచేస్తుందని పది సీట్లు దక్కినా సరే.. ప్రభుత్వాన్ని తాను డిసైడ్ చేయగలనని పవన్ కల్యాణ్ భ్రమించారు.
కానీ ప్రజలు ఆయన భ్రమలను పటాపంచలు చేసేస్తూ క్లియర్ తీర్పు ఇచ్చారు. ఆశించిన పరిస్థితి వచ్చి ఉంటే.. 'చారిత్రక అవసరం' అనే ముసుగులో.. తెలుగుదేశానికి జైకొట్టి, చంద్రబాబు అచేతనత్వాన్ని, నిస్తేజాన్ని, వార్ధక్యాన్ని 'వాడుకుంటూ' తాను తక్కువ సీట్లతో పెద్ద పదవుల్లో ఉండాలని ఆయన కలగన్నారు. కానీ ఆ కలలన్నీ కల్లలు అయ్యాయి. తమాషా ఏంటంటే.. ఇప్పుడు పవన్ కల్యాణ్, తెలుగుదేశం మీద ప్రేమను పక్కన పడేశారు. ఆ పార్టీ 'మునుగుతున్న నావ' అని.. అందులో ప్రయాణం ప్రమాదం అని ఆయనకు అర్థమైపోయింది.
జగన్మోహన్ రెడ్డికి ఎటూ తన అవసరం లేదు గనుక.. ఉన్నా కూడా తనను దగ్గరకు రానిచ్చే మనిషికాదు గనుక.. ఆయన కమలదళం వైపు కన్నేస్తున్నారు. జనసేనను విలీనం చేసుకోవాలని భాజపా కోరుకుంటున్నప్పటికీ.. విలీనం కంటె విడిగా ఉండి, ఎన్నికల వేళ వారికి సహకరిస్తేనే తనకు ఎక్కువ లాభం అనేది పవన్ గేమ్ ప్లాన్. అయితే అప్పటిదాకా, అయిదేళ్ల పాటూ అస్తిత్వ రక్షణకు కాగల ఆర్థిక వ్యయాన్ని భరించడం ఆయనకు కాస్త భారమే.
ఇన్నాళ్లూ ఒక గుడ్డి నమ్మకంతో జనసేన మీద ఎడాపెడా 'పెట్టుబడులు' పెట్టినవారు కూడా.. ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. అయినా సరే.. పంటిబిగువు మీద పార్టీని అయిదేళ్లు కాపాడాలనే గేమ్ ప్లాన్‌తోనే ఆయన పావులు కదుపుతున్నారు.