రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబరు 1 నాటికి పోలవరం డ్యాం నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం అవుతాయని ప్రకటించేశారు. ఏ కాంట్రాక్టు పనుల్లోనూ ఎలాంటి అవినీతి ఉండరాదని ఘంటాపథంగా చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ కూడా.. తదనుగుణంగా ప్రొసీడ్ అయ్యేందుకు ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్లను రద్దుచేసే నిర్ణయం తీసుకున్నారు. యిక్కడివరకూ ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలూ లేవు.
అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యలు, కొన్ని నిర్ణయాల పుణ్యమాని పోలవరం డ్యాం నిర్మాణం అటకెక్కిపోతుందా… అనే భయం పలువురికి కలుగుతోంది. గోదావరి మిగులు జలాలు వ్యర్థంగా సముద్రం పాలు కాకుండా ఉండేందుకు సంకల్పించిన అతి గొప్ప డ్యాం పోలవరం. దీనివలన కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమేకాదు. పరిసర, ఎగువ రాష్ట్రాలకు కూడా భూగర్భ నీటి మట్టాలు అనూహ్యంగా పెరగడం రూపేణా మేలు జరుగుతుందనేది నిజం.
అయితే ఒరిస్సా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి ఈ డ్యాం పట్ల కొన్ని వ్యతిరేకతలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం ఏపీ పరిధిలోని భూములే కాకుండా.. తమ రాష్ట్ర పరిధిలోని ప్రాంతాలు కూడా ఈ డ్యాం వద్ద ముంపునకు గురవుతాయనేది ఆ రాష్ట్రాలు వ్యక్తంచేస్తున్న ఆందోళన. ఇది కేవలం అపోహ మాత్రమే కావొచ్చు. పోలవరం నిర్మిస్తున్న ఎత్తును బట్టి.. ఇతర రాష్ట్రాల ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నది నిపుణులు తేల్చిన సంగతి. అలాంటి ముంపు ప్రమాదం ఉన్నది గనుకనే తెలంగాణ రాష్ట్రంలోని ఏడు మండలాలను ఏపీకి బదలాయించేశారు.
ఇక అక్కడితో ఆ ఇబ్బంది తీరిపోయినట్లే. అందుకే ఈ డ్యాంను జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించడమూ, తదనుగుణంగా పనులు చేపట్టడమూ జరుగుతోంది. అయితే ఇప్పుడు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మళ్లీ ఛత్తీస్గఢ్, ఒరిస్సా అభ్యంతరాల గురించి ప్రస్తావిస్తుండడం కొత్త సందేహాలకు తావిస్తోంది. పోలవరం వల్ల ఆ ప్రాంతాలు మునగవు గానీ.. వారు అభ్యంతరాలు లేవనెత్తుతున్నందున మళ్లీ ఆ రాష్ట్రాలతో చర్చించి డ్యాంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన అంటున్నారు.
అదే జరిగితే డ్యాం పనులు ఆగిపోయినట్టే బావించాల్సి ఉంటుంది. జగన్ సర్కారు కాంట్రాక్టులు రద్దు చేయడం వలన నిజానికి జరిగే నష్టంలేదు. ఎటూ ఇది వర్షాకాలమే గనుక.. పనులు సాగేదిలేదు. కానీ.. పొరుగు రాష్ట్రాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని కేంద్రం పూనుకుంటే గనుక.. ఇప్పట్లో పోలవరం తిరిగి పట్టాలెక్కకపోవచ్చు. ఆ రకంగా ఇప్పటికే రాష్ట్రానికి పలు విధాలుగా ద్రోహం చేస్తున్న మోడీ సర్కారు పోలవరాన్ని అటకెక్కించే ప్రమాదం కనిపిస్తోందని పలువురు భావిస్తున్నారు.