cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

అటు భాజపా-ఇటు తేదేపా-మధ్యలో పవన్

అటు భాజపా-ఇటు తేదేపా-మధ్యలో పవన్

జనసేన అధిపతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భాజపాతో స్నేహంతో వున్నారు. కలిసి ప్రయాణిస్తున్నారు. కలిసి ఉద్యమిస్తున్నారు. అలా అని చెప్పి పవన్ అద్భుతమైన యాక్టివ్ పాలిటిట్స్ ఏమీ చేయడం లేదు. ట్విట్టర్ లో స్టేట్ మెంట్లు, మహా అయితే ఓ ప్రెస్ నోట్ మాత్రమే. 

ఇలాంటి నేపథ్యంలో ఆయన ఓ దిన పత్రికకు సుదీర్ఘ ఇంటర్వూ ఇచ్చారు. ఈ ఇంటర్వూ కేవలం మూడు రాజధానుల విషయమై, దాని చుట్టూ తిరగడం విశేషం. బహుశా మూడు రాజధానుల మీద తన వైఖరి స్పష్టంగా చెప్పడానికి, లేదా భాజపా స్టాండ్ కారణంగా మూడు రాజధానుల విషయంలో వస్తున్న వ్యతిరేకత తన పైన పడకుండా వుండడానికి ముందు జాగ్రత్తగా పవన్ ఈ ఇంటర్వ్యూ ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. 

కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్లు వుంది ఈ వ్యవహారం. భాజపా స్టాండ్ క్లియర్ గా తెలుస్తోంది. పవన్ ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారన్నది వాస్తవం. అందువల్ల ఆయన స్టాండ్ వేరే వుండడానికి అవకాశం లేదు. కానీ అలా అని మళ్లీ తన ఒపీనియన్ ఇలా అని చెప్పడం అంటే ఏమని అర్థం? ఈ విషయం మీద ఆయన భాజపాకు దూరంగా జరగగలరా? అసలు పవన్ ఏమన్నారో చూద్దాం.

హైకోర్టుకు రాజధానిపై జనసేన ఏం చెబుతుంది అని అడిగితే, ఇలా చెబుతుందీ అంటూ పవన్ క్లియర్ గా క్లారిటీగా చెప్పలేదు. ఒకసారి నిర్ణయించుకున్నాక, ఒక ప్రాంత జనాల మనోభావాలు దెబ్బతినకుండా వుండాలన్నది తమ పార్టీ ఉద్దేశం అని మాత్రమే అన్నారు. ఇది ప్రాంతాల మధ్య విబేధాలకు దారి తీస్తుందన్నారు. అంతే కానీ రాజధాని మార్చకూడదు అనే తాము హైకోర్టుకు చెబుతాం అని స్పష్టంగా పవన్ చెప్పలేదు.

కేంద్రం దృష్టిలో, భాజపా దృష్టిలో అమరావతే రాజధాని అని పవన్ అన్నారు. కాదని ఇప్పుడు ఎవరు అన్నారు? శాసన రాజధాని అమరావతే, శాసనసభ, మండలి అక్కడే వుంటాయనే కదా వైకాపా కూడా చెబుతోంది?

పైగా కేంద్రాన్ని, భాజపాను వేరు వేరుగా చూడాలట. ఎందుకంటే రాజ్యాంగ పరంగా కేంద్రం మాట్లాడుతుందట. అందుకే తమకు రాజధానితో సంబంధం లేదని కేంద్రం చెప్పిందన్నది పవన్ సవరింపు స్టేట్ మెంట్. అంటే భాజపాది తప్పు లేదు కేంద్ర ప్రభుత్వ నిబంధనలదే అంత తప్పు అన్నది పవన్ మాట.

రాజధాని రైతుల సమస్య 29 గ్రామాలది కాదు, రాష్ట్రం అంతా విస్తరించాలి అంటారు పవన్. రాజధాని రైతులు పోరాడుతున్నది వాళ్ల భూముల్లోనే రాజధాని వుండాలని, కానీ దానికి విశాఖ రైతులు, కర్నూలు రైతులు ఎలా మద్దతు ఇస్తారు? వారి భూముల్లో కూడా రాజధాని రావాలని వారు కోరుకుంటారు కదా. పైగా పవన్ ఇక్కడ భలే గమ్మత్తయిన విషయం చెప్పారు. 

ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తం చేయడం తన వల్ల కాదట. ఇది తానొక్కడూ చేసేదీ, భుజాల మీదకు ఎత్తుకునేది కాదని ఆయన క్లారిటీగా చెప్పేసారు. అమరావతి ఆడపడుచుల సారథ్యంలోనే ఇది ముందుకు సాగాలట. అంటే తన జనసేన కానీ, తన మిత్రత్వ భాజపా కానీ అమరావతి రైతుల ఉద్యమానికి సారథ్యం వహించవు అన్న చెప్పకనే చెప్పేసారు పవన్. అన్ని పార్టీలు కలిసి రావాలి అంటారు తప్ప, కలిపే ప్రయత్నం తాను చేస్తాను అనలేదు.

పనిలో పనిగా విలేజ్ సెక్రటేరియట్ వ్యవస్థ వల్ల జగన్ పాలనా వికేంద్రీకరణను ఇప్పటికే సాధించేసారు అంటూ పవన్ చెప్పడం విశేషం. విశాఖలో బదులు వెనుకబడిన ఏరియాల్లో పెడితే విక్రేంద్రీకరణ వుంటుంది అంటున్నారు పవన్. విశాఖలో పెడితే మహా అయితే మరికొద్దిగా విస్తరిస్తుంది తప్ప వేరు కాదన్నారు. 

పవన్ చెప్పిన ఇంకో గమ్మత్తయిన సంగతి ఏమిటంటే, రాజధాని ఉద్యమం విషయంలో మిగిలిన ప్రాంతాలు పెద్దగా ఫీల్ కావడంలేదన్నది. దీనికి కారణం కులాల మధ్య వున్న గొడవలు తప్ప వేరు కాదంటున్నారు ఆయన. మరి అలాంటపుడు అమరావతి ఉద్యమం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం ఎలా అవుతుందో? పైగా అమరావతి ని ఓ కమర్షియల్ వెంచర్ గా ప్రోజెక్టు గా ప్రొజెక్ట్ చేసారు అని, రాష్ట్ర వ్యాప్తంగా జనాల మనసుల్లో వున్న ఈ అభిప్రాయాన్ని మార్చాలని పవన్ చెప్పడం విశేషం. 

అయితే చివరగా మాత్రం రాజధాని మార్చడం దుష్ట సంప్రదాయమని, పార్టీలతో ఒప్పందం జరగదని, ప్రభుత్వాలతో ఒప్పందం జరుగుతుందని, అందువల్ల ఏ ప్రభుత్వం వచ్చినా దానిని గౌరవించాలని ఓ కంక్లూజన్ మాత్రం పవన్ ఇచ్చారు.

అంటే ఇప్పుడు ఒక క్లారిటీ మాత్రం వచ్చింది. పవన్ తన మద్దతు అమరావతికే అని ఇండైరక్ట్ గా చెప్పారు. దానిని ప్రజా ఉద్యమం ద్వారా సాధించవచ్చు అని పవన్ అంటున్నారు. దీనికి అన్ని పార్టీలు కలిసి రావాలంటున్నారు.

ఆ విధంగా అమరావతి రైతుల సానుభూతి, పవన్ చాలా వైడ్ గా ఆలోచించి మాట్లాడతారని మిగిలిన ప్రాంతాల రైతుల ప్రశంసలు సంపాదించాలని పవన్ చూస్తున్నట్లు కనిపిస్తోంది. అంతకు మించి ఘాటగా మాట్లాడి భాజపా రెచ్చ గొట్టే ఆలోచన మాత్రం అస్సలు లేదు. ఇంతకీ ఇదంతా చూస్తుంటే పవన్ ను మీడియా ఇంటర్యూ అడిగిందా? పవన్ నే తన వంతు క్లారిటీ ఇవ్వడానికి తనే ఇంటర్వ్యూ ఇచ్చారా? చిన్న అనుమానం. 

ఈవిషయం బాబు&కో ఎప్పుడు గమనిస్తారో?

నిశ్శబ్దం క‌ధ అనుష్క కోసం రాసింది కాదు