తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మారలేదు.. అస్సలేమాత్రం మారలేదు.. మారరు కూడా.! పదేళ్ళు ప్రతిపక్షంలో వున్నాక, చంద్రబాబులో మార్పు వచ్చిందని చాలామంది అనుకున్నారు. మళ్ళీ ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా అవకాశమొచ్చేసరికి.. జూలు విదిలించేశారు. ఫలితం, మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితం. రాజకీయాల్లో గెలుపోటములు మామూలే అయినా, గెలుపు అనేది బాద్యతను పెంచాలి.. ఓటమి అనేది పాఠాల్ని నేర్పాలి. చంద్రబాబుకి మాత్రం గెలుపు అనేది అహంకారాన్ని పెంచడానికీ, ఓటమి అనేది బుకాయించడానికి మాత్రమే పనికొస్తుంది.
ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసే, ఎన్నికలకు ముందు నానారకాల పబ్లిసిటీ స్టంట్లూ చేశారు. కేంద్రం కక్షపూరితంగా తమమీద దాడులు చేస్తోందంటూ చంద్రబాబు చేసిన యాగీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడేమో, చంద్రబాబు పార్టీ ఫిరాయింపుల మీద గగ్గోలు పెడుతున్నారు. 'నువ్వు నేర్పిన విద్యే కదా..' అంటోంది బీజేపీ. అది నిజం కూడా. 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీల్ని చంద్రబాబు తన హయాంలో వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి లాగేశారు. ఇప్పుడు నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్ళేసరికి, 'నైతికత..' అంటూ గగ్గోలు పెడ్తున్నారు చంద్రబాబు.
ఆ సంగతి పక్కన పెడితే, చంద్రబాబు తన నివాసం పక్కనే నిర్మించుకున్న ప్రజావేదిక వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అది నిజానికి ప్రభుత్వ ఆస్తి. దాన్ని తమకే ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వానికి లేఖ రాయడమే అర్థం పర్థంలేని వ్యవహారం. ఆ మాటకొస్తే, చంద్రబాబు నివాసముంటోన్న భవనమే అక్రమకట్టడం. దానికి సంబంధించి వివాదం నడుస్తోంది. అధికారం అప్పట్లో తనచేతిలో వుంది గనుక సరిపోయింది చంద్రబాబుకి. అధికారం పోయాక, వెంటనే ఆ భవనం ఖాళీ చేసేసి వుండాలి. ఇంకా అడ్డగోలు వాదనలే చేస్తున్నారక్కడ.
ఉండవల్లి ప్రజావేదిక నుంచి, టీడీపీకి చెందిన కొన్ని వస్తువుల్ని ప్రభుత్వం ఖాళీ చేయించింది.. అక్కడ కలెక్టర్ల సమావేశం జరగబోతోంది. దానిపై మళ్ళీ యాగీ షురూ చేసింది తెలుగుదేశం పార్టీ. 'చంద్రబాబుపై కుట్ర జరుగుతోంది.. ఆయన భద్రత మీద మాకు అనుమానాలు పెరుగుతున్నాయి..' అంటూ తెలుగు తమ్ముళ్ళు చేస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదు. రాజధాని అమరావతి పరిధిలో అత్యంత ఖరీదైన భవనం కట్టుకునే అవకాశం గత ఐదేళ్ళలో చంద్రబాబుకి కలగకపోవడం శోచనీయమే మరి.
ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందే ఊహించలేనంత అమాయకుడైతే కాదు చంద్రబాబు. ప్రతి విషయాన్నీ 'యాగీ' చేయడానికి అనుకూలంగా మలచుకునే చంద్రబాబు చాణక్యమే.. ఇన్ని అనర్ధాలకీ కారణం. అవును, చంద్రబాబు మారలేదు.. మారరుగాక మారరు.