Advertisement

Advertisement


Home > Politics - Gossip

జగన్‌ కూడా గేట్లు తెరవక తప్పదా.?

జగన్‌ కూడా గేట్లు తెరవక తప్పదా.?

పదవులకు రాజీనామా చేసి వస్తే తప్ప, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి ఇతర పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిథులను రానిచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్పష్టం చేసేశారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసే పనిలో బిజీగా వుంది. ఈ క్రమంలో నలుగురు రాజ్యసభ సభ్యుల్ని ఆల్రెడీ లాగేసిన బీజేపీ, మొత్తం 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రేపో మాపో తమ పార్టీలో చేరతారని బల్లగుద్ది మరీ చెబుతోంది.

రాజ్యసభలో టీడీపీకి చెందిన నలుగురు సభ్యుల్నీ బీజేపీ సభ్యులుగా మార్చేశారు 'విలువల గురించి క్లాసులు తీసుకునే' ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు. మరి, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఆ పరిస్థితి వీలవుతుందా.? అంటే, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌గా వున్నది తమ్మినేని సీతారాం గనుక, ఇక్కడ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వుంది గనుక.. సాధ్యపడకపోవచ్చు. ఎమ్మెల్యేలు పార్టీ మారగానే అనర్హత వేటు వేస్తామని ఆల్రెడీ వైఎస్‌ జగన్‌ ప్రకటించేశారు. దాంతో, టీడీపీ నుంచి ఎవరు బయటకు వచ్చినా తొలుత వారిపై అనర్హత వేటు పడటం ఖాయమే.

ఉప ఎన్నికలంటూ వస్తే, ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి మళ్ళీ సున్నా చుట్టేసేందుకు జనం సిద్ధంగానే వున్నారు. ప్రస్తుతం వున్న వైఎస్సార్సీపీ వేవ్‌లో.. ఉప ఎన్నికలు జరిగితే, ఆ సీట్లన్నీ తిరిగి వైసీపీ ఖాతాలో పడేందుకే అవకాశాలెక్కువ. ఈ పరిస్థితులపై పార్టీ మారాలనుకున్న ఎమ్మెల్యేలకీ ఖచ్చితమైన అవగాహన వుంది. తమ ఎమ్మెల్యే పదవులకు ఎలాంటి ఇబ్బందీ రాదని ఆయా ఎమ్మెల్యేలకు బీజేపీ భరోసా ఇవ్వాల్సి వుంటుంది. బీజేపీ అలా భరోసా ఇవ్వాలంటే, తాము చెప్పినట్లు వైఎస్సార్సీపీ వినే పరిస్థితి వుండాలి. ఆ పరిస్థితైతే కన్పించడంలేదు.

'మా పార్టీలోకి రావాలనుకుంటున్నవారిలో టీడీపీ, కాంగ్రెస్‌ నేతలే కాదు.. వైఎస్సార్సీపీ నేతలు కూడా వున్నారు..' అంటూ బీజేపీ నేతలు ఒకింత అత్యుత్సాహంతో కూడిన ప్రకటనలు చేసేస్తున్నారు. సో, వైఎస్‌ జగన్‌ కూడా గేట్లు తెరవక తప్పని పరిస్థితి సమీప భవిష్యత్తులో కన్పిస్తోందన్నమాట. వైసీపీ మాత్రం, 'మా పార్టీలోకి ఎవరైనా రావొచ్చు.. కానీ, పదవులకు రాజీనామా చేసి రావాలి..' అని ఖరాఖండీగా చెప్పేస్తుండడం కొసమెరుపు.

బాబుగారూ.. 'మీరు ఓడిపోవడం ఏమిటయ్యా!'

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?