అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రాముడే కొలువు తీరనున్నాడు. రామాలయ నిర్మాణం త్వరలోనే జరగనుంది. మూడునెలల్లోగా అయోధ్య రామమందిర నిర్మాణానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు అవుతుంది. వారి ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం జరుగుతుంది.
దేశవ్యాప్తంగా కొన్ని రోజులుగా ప్రబలిన తీవ్ర ఉత్కంఠ మధ్య సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అయోధ్య వివాదంలో తుది తీర్పును శనివారం ఉదయం స్వయంగా చదివి వినిపించారు.
ముస్లింలకు మసీదు నిర్మాణానికి అయిదు ఎకరాల స్థలాన్ని మరొకచోట ప్రత్యామ్నాయంగా కేటాయించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ చొరవ తీసుకోవాలని సూచించింది. ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతుంది.
వివాదాస్పద స్థలం తమదేనంటూ షియా వక్ఫ్ బోర్డు పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. అయోధ్య రాముడిదేనని, రాముడు పుట్టిన ప్రాంతమేనని.. ఆ ప్రాంతం రాముడికే చెందుతుందని కోర్టు పేర్కొంది. అలాగే నిర్మోహి అఖాడా వేసిన పిటిషన్ ను కూడా సుప్రీం కొట్టివేసింది.
రెండు మతాలకు కూడా ఆమోదనీయమైన తీర్పునే సుప్రీం కోర్టు వెలువరించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.