బాబు కోపం.. ప్రతీకారానికి ఇదొక్కటే మార్గం!

రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు ద్వేషించుకోవడం సహజం. కానీ చంద్రబాబు తన ద్వేషం ప్రత్యర్థిపై కాకుండా ప్రజలపైకి మళ్లించారు. అవును చంద్రబాబు ద్వేషం, పగతో రగిలిపోతున్నారు. జగన్ పై మాత్రం కాదు, రాష్ట్ర ప్రజలపై. ఇదెక్కడి…

రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు ద్వేషించుకోవడం సహజం. కానీ చంద్రబాబు తన ద్వేషం ప్రత్యర్థిపై కాకుండా ప్రజలపైకి మళ్లించారు. అవును చంద్రబాబు ద్వేషం, పగతో రగిలిపోతున్నారు. జగన్ పై మాత్రం కాదు, రాష్ట్ర ప్రజలపై. ఇదెక్కడి విడ్డూరమో ఆయనకే తెలియాలి. రాష్ట్రానికి ఎంత మంచి చేసినా ప్రజలు ఓడించారని… కేవలం 23 సీట్లపై పరిమితం చేశారని…. నూతన రాష్ట్ర అభివృద్ధి మధ్యలోనే ఆగిపోయేట్టు చేశారని బాబు ప్రజలనే టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు. పాలిచ్చే ఆవు, దున్నపోతు అంటూ చెత్త లాజిక్ లతో ప్రజల నిర్ణయాన్నే తప్పుపడుతున్నారు చంద్రబాబు.

అవును.. నిజంగానే ప్రజలు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కాదు, 2014లోనే తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు తీసుకున్న రాంగ్ డెసిషన్ కి ఐదేళ్ల పాటు కష్టాలు అనుభవించారు. దాని పర్యవసానాలు ఇంకా అనుభవిస్తూనే ఉన్నారు. ఐదేళ్లు అధికారం చేతిలో ఉంటే ప్రజలను ఆకట్టుకునేలా పరిపాలించడం చేతగాక, కేంద్రంలో మంత్రి పదవులు అనుభవిస్తున్నా రాష్ట్రానికి ప్రాజెక్ట్ లు తేవడం ఇష్టంలేక, కేవలం ఆస్తుల పెంపుపై దృష్టిపెట్టిన బాబు అండ్ కో.. ఇప్పుడు ప్రజలపై పడి ఏడిస్తే ఏంలాభం?

చినబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో చేసిన రాజకీయ పర్యటనల్లో కూడా ఇదే అంశం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. తండ్రిలాగా కొడుకు కూడా ప్రజలపై నిందలేయడానికే మొగ్గు చూపారు. వరద ప్రాంత ప్రజలు తమ కష్టాలు చెప్పుకోడానికి వస్తే, జగన్ కి ఓటేశారు కదా అనుభవించండి అన్నట్టు మాట్లాడారు లోకేష్. వరదలకు, జగన్ ముఖ్యమంత్రి అవ్వడానికి లింక్ ఏంటో అర్థంకాలేదు జనాలకి. ఈ మాత్రం స్టేట్ మెంట్ ఇవ్వడానికి ఈయన ట్విట్టర్ గూటి నుంచి జనం మధ్యలోకి రావడం ఎందుకో!

ఐదేళ్ల వంచనకు తగిన ఫలితమే చంద్రబాబు ఇప్పుడు అనుభవిస్తున్నారు. అసత్యాలు, అక్రమాలు, అవినీతి.. ఇవి మూడే చంద్రబాబుని దారుణంగా ఓడించాయి కానీ ప్రజలు కాదు. ఆ ఫలితాన్ని ఇప్పుడే కాదు, 2024లో కూడా చంద్రబాబు అనుభవించబోతున్నారు. ఇంకా ప్రజలపైనే తప్పు నెట్టాలని చూస్తే ఈ జన్మలో టీడీపీ అధికారంలోకి రాలేదు. చివరికి ప్రతిపక్ష అర్హత కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.

23 ఎందుకిచ్చారని అంతలా బాధపడే చంద్రబాబు.. తన కోపాన్ని ప్రజలపై చూపించే బదులు, పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవచ్చు కదా. తను రాజకీయ సన్యాసం చేసి ప్రజలపై ఆ విధంగా ప్రతీకారం తీర్చుకుంటే సరిపోతుంది కదా. నిజంగా ప్రజలపై ప్రతీకారం తీర్చుకోవాలంటే బాబుకు ఇంతకుమించిన మార్గం మరొకటి లేదు. 

విపరీత పోకడలకు మోడీ సర్కార్ చెక్ పెడుతోంది