రాయలసీమ ప్రాంతానికి వర్షపాత లేమి కొనసాగుతూ ఉంది. వేరుశనగ సాగుకు అనుగుణంగా వర్షం లేకపోవడంతో రైతులు నిస్పృహకు లోనవుతూ ఉన్నారు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం చాలావరకూ తగ్గింది. సరైన సమయంలో వర్షాలు లేకపోవడంతో వేరుశనగ సాగు సాధ్యంకాలేదు. ఇక కొద్దో గొప్పో సాగు చేసిన రైతులు కూడా ఆ తర్వాత వర్షం మొహం చాటేయడంతో నిస్పృహకు లోనవుతూ ఉన్నారు.
జూలై ఇరవై వరకూ సరైన వర్షపాతం లేకుండా పోయింది. కొన్నిచోట్ల కొద్దోగొప్పో వర్షపాతం నమోదు అయ్యింది. జూలై ఇరవై సమయంలో చాలామంది విత్తనాలను విత్తారు. అయితే ఆ తర్వాత వర్షం మొహం చాటేసింది. పంటసాగు అయిన వెంటనే వర్షం మొహం చాటేయడంతో.. విత్తనాలు మొలకెత్తడం కూడా కష్టం అయిన పరిస్థితి తలెత్తింది.
ఈ నేపథ్యంలో మరోసారి కరువు మేఘం కనిపించేలా ఉంది. ఇక వేరు శనగ సంగతెలా ఉన్నా.. భారీ వర్షాలు ఏవైనా వస్తే బావులు, బోర్లలో అయినా నీటి వనరు ఏర్పడుతుందని రైతులు ఆశిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకూ ఎక్కడా భారీ వర్షాల జాడ కూడా కనిపించడం లేదు.
అయితే ఎగువన కురుస్తున్న వర్షాలు రాయలసీమకు ఎంతో కొంతో ఊరటను ఇస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో పాటు.. తుంగభద్రపై కూడా జలకళ కనిపిస్తూ ఉండటం రైతులకు ఊరటను ఇచ్చే అంశంగా మారింది.
శ్రీశైలం ప్రాజెక్టుకు ఆరంభంలో నీటి లభ్యత లేకపోయినా ఆ తర్వాత మాత్రం ఒక్కసారిగా వరద ఉదృతి పెరిగింది. దీంతో ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కూడా మొదలైంది. హంద్రీనీవా, ముచ్చుమర్రి తదితర ప్రాజెక్టులకు నీటి విడుదల మొదలైంది. కరువుతో అల్లాడుతున్న సీమకు ఇది కొద్దో గొప్పో ఊరటను ఇచ్చే అంశమే.
అయితే ఆగస్టులో అయినా తగుస్థాయి వర్షపాతం నమోదు అవుతుందని రైతాంగం ఆశిస్తోంది. కనీసం ఇప్పుడైనా భారీ వర్షాలు పడితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. రాయలసీమ రైతాంగం ఇప్పుడు ఆ ఆశలతోనే కనిపిస్తూ ఉంది. మరి ఆ ఆశలను వరుణుడు ఎంతవరకూ నెరవేరుస్తాడో.