కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే అధికరణల రద్దు గురించి భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. అన్నింటినీ సావధానంగా పరిశీలించడం ప్రజాస్వామ్య ధర్మం. ఈ నిర్ణయంలో కశ్మీరీల ప్రమేయంలేదు అనేది ప్రధానమైన ఫిర్యాదు. అయితే దేశంలో చాలా నిర్ణయాల్లో ప్రజల ప్రమేయం ఉండటంలేదు. పేరుకు ప్రజాస్వామ్యమే అయినా చాలా సమయాల్లో ప్రభుత్వాలు మెజారిటీ ప్రజల నిర్ణయాలను పట్టించుకోవడం లేదు.
గతంలో పార్లమెంట్ వేదికగా అనేక వ్యవహారాలు అలానే సాగాయి. ఉమ్మడి ఏపీ విభజన కూడా అదే కోవకే వస్తుంది. మెజారిటీ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా, వారి ప్రయోజనాలకు విరుద్ధంగా రాష్ట్రాన్ని విభజించారు. భావోద్వేగాలు, సెంటిమెంట్లు అంతిమంగా రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని విభించారు. అలాంటి విభజనను మెజారిటీ ప్రజలు వ్యతిరేకించినా ఆ తర్వాత అంతా సర్దుకుంది.
అనేక సమస్యలు ఉన్నా తెలుగు రాష్ట్రాలు కలిసి సాగుతున్నాయి. రాజకీయాలను పక్కన పెడితే ప్రజల మధ్యన మాత్రం విద్వేషాలు రేగలేదు. వాటిని రేపడానికి అనేకమంది రాజకీయ నేతలు అనేక రకాలుగా ప్రయత్నించారు. కానీ వారి పప్పులు తెలుగు ప్రజల మధ్యన ఉడకలేదు.
కశ్మీర్ విషయంలో కూడా ఇలానే జరగాలని ఆశించాలి. దశాబ్దాలుగా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కొనసాగింది. అయితే దానివల్ల అక్కడి ప్రజలకు ఒరిగినది ఏమీలేదు. ప్రత్యేక ప్రతిపత్తి వల్ల ఆ ప్రాంతం ఉగ్రమూకలకు, పాకిస్తాన్‌కు ఆటపట్టు అయ్యిందనే అభియోగాలు ఉన్నాయి.
నిర్ణయాలు ఏవైనా కశ్మీర్లో పొరుగుదేశం కార్యకలాపాలను ఆపాల్సిన అవసరం ఉంది. అందుకోసం మోడీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు ప్రయోజనకారులుగా నిలుస్తాయేమో చూడాల్సి ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు లడాక్ నుంచి, జమ్మూ నుంచి సానుకూల స్పందనే వ్యక్తం అవుతూ ఉంది.
కశ్మీర్ మాత్రం గుంభనంగా కనిపిస్తూ ఉంది. బీజేపీయేతర రాజకీయ నేతలు మాత్రం కేంద్రం నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. వారి అభిప్రాయాలను వారు చెబుతూ ఉన్నారు. అయితే దేశమంతా మోడీ ప్రభుత్వ నిర్ణయాలనే స్వాగతిస్తూ ఉంది. అభిప్రాయాలు, రాజకీయాలు ఎలా ఉన్నా.. ఇక నుంచి అయినా భూతల స్వర్గంలో శాంతి నెలకొంటే అంతకు మించి కావాల్సినది మరేం ఉండదు.
-ఎల్.విజయలక్ష్మి