తెలుగుదేశం పార్టీకి రాయలసీమలో మంచి బేస్ మెంటే ఉండేది. తెలుగుదేశం పార్టీ గతంలో రాజకీయంగా చావుదెబ్బ తిన్న సమయాల్లో కూడా కనీసం అనంతపురం వరకూ అయినా వారు ఉనికిని చాటగలిగే వాళ్లు. ఆ జిల్లాలో సగం వరకూ సీట్లను నెగ్గి సత్తా చాటేవాళ్లు.
అలాంటి జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ కోటలు కూలిపోయాయి. పెనుకొండ వంటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి చేజారడం అనేది ఆ పార్టీకి అత్యంత డేంజర్ సిగ్నల్. తమ పార్టీ మూలాలే కదిలిపోయాయి.. అని అర్థం చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీకి అంతకన్నా మరేం అవసరంలేదు.
ఇక తెలుగుదేశం పార్టీ ఓడినా, గెలిచినా దాదాపు ఒకే స్థాయిలో ఓట్ల తేడాలు ఉండే పుట్టపర్తి వంటి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 30 వేల స్థాయి మెజారిటీ దక్కింది. ఇలాంటి నేపథ్యంలో తమ మూలాలు ఏమయ్యాయో తెలుగుదేశం పార్టీ పరిశోధించుకోవాల్సి వస్తోంది.
ఈ పరిశోధించే ఓపిక, శక్తి తెలుగుదేశం నేతల్లో కనిపిచడం లేదు. అందుకే ఎన్నికలు అయిపోయి మూడు నెలలు కావొస్తున్నా తెలుగుదేశం నేతలు మారు మాట్లాడలేకపోతున్నారు. రాయసీమ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున చాలా మంది చాలా రకాల పదవులను అనుభవించారు. ఉప ముఖ్యమంత్రి, కొంతమంది మంత్రులు, ఇంకా నామినేటెడ్ ఎంపీలు, ఎమ్మెల్సీలు.. సీమకు చెందిన టీడీపీ నేతలు అలా పదవుల్లో కొనసాగారు.
అయితే ఇప్పుడు వాళ్లెవ్వరూ మారు మాట్లాడే పరిస్థితి లేదు. ఇక ఎమ్మెల్యేలు అయితే మీడియాకు కూడా మొహం చూపడం లేదు. ఏదో ఒక ప్రకటన చేసి హడావుడి చేయడం కూడా లేదు. తెలుగుదేశం పార్టీకి మహా మహా నేతలు అనుకున్న వారు కూడా ఈ ఎన్నికల్లో సీమలో పరువు నిలుపుకోలేకపోయారు. దీంతో వారు కూడా నోరు విప్పడానికి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అధికారంలో ఉన్నంత సేపూ వీళ్ల మాటలకు హద్దులు ఉండేవి కావు. అవసరానికి మించి మాట్లాడారు, అర్థ రహితంగా మాట్లాడారు. అత్యంత నీఛంగా మాట్లాడారు కూడా. జగన్ మోహన్ రెడ్డి ని రాయలసీమ ప్రాంత టీడీపీ నేతలు ఎంత తేలిక చేసి మాట్లాడారో.. ఆ మాటలను తెలుగుదేశం అనుకూల మీడియా తాటికాయలంత అక్షరాలతో ఎలా ఒత్తి అచ్చు వేసిందో ఎవ్వరూ మరిచిపోలేరు.
ఆఖరికి ఫిరాయింపు రాజకీయాలకు పాల్పడిన వారు కూడా తమకు నోరు ఉందని ఇష్టానుసారం మాట్లాడారు. ఆదినారాయణ రెడ్డి నోటికి హద్దు లేకుండాపోయింది. ఆఖరికి జగన్ భార్య విషయంలో కూడా అనుచితంగా మాట్లాడేంత నీఛంగా వ్యవహరించారు ఆదినారాయణ రెడ్డి. ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేని జగన్ కుటుంబీకుల విషయంలో అనుచితంగా మాట్లాడేందుకు ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్లు వెనుకాడలేదు.
అందుకు ప్రతిఫలాన్ని ప్రజలు గట్టిగానే ఇచ్చారు. ఇక రాజకీయ జీవితం ఉంటుందా? అనే సందేహాన్ని వాళ్లలో జనింపజేశారు. మిగతా వాళ్ల కథేమో కానీ.. ఫిరాయింపులు చేసి, అనైతిక రాజకీయం చేసిన వాళ్లకు మాత్రం ఇక రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమే అనే విశ్లేషణలు రాయలసీమ ప్రజల మధ్య వినిపిస్తున్నాయి.
ఇక ఎన్నికల సమయంలో తాము గెలిచేస్తున్నామంటూ గత్తరబిత్తర చేసిన నేతలు మళ్లీ మొహం చూపడంలేదు. వాళ్లు ఏకంగా మెజారిటీల మీద సవాళ్లు విసిరారు. తమకు మెజారిటీలు రాకపోతే రాజకీయ సన్యాసం చేస్తామని ప్రకటించారు. వాళ్లు చేసిన చాలెంజ్ లు చిత్తు అయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో వారు నోరెత్తలేకపోతున్నారు. తమవి ఉత్తుత్తి చాలెంజ్ లే కాబట్టి.. వాళ్లు కామ్ అయిపోయారు.
ఎక్కువ మాట్లాడితే అప్పడు పలికిన బీరాలు ఇప్పుడు జనాలకు గుర్తుకు వస్తాయేమో అని వారు భయపడుతున్నారు. అందుకే ఎక్కడి వారు అక్కడే గప్ చుప్ అన్నట్టుగా.. కలుగులో దూరిన వాళ్లలా మిన్నకుండిపోతున్నారు. హడావుడి చేసి, హంగామా చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడం గమనార్హం!