Advertisement

Advertisement


Home > Politics - Gossip

బాబు చేతిలో ప‌వ‌న్‌కు ప‌రాభ‌వం...!

బాబు చేతిలో ప‌వ‌న్‌కు ప‌రాభ‌వం...!

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు త‌మ నాయ‌కుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను తీవ్రంగా అవ‌మానించార‌ని జ‌న‌సేన శ్రేణులు వాపోతున్నాయి. లోకేశ్ యువ‌గ‌ళం పాద‌యాత్ర అనుకోని మ‌లుపు తిరిగిన సంగ‌తి తెలిసిందే. స్కిల్ స్కామ్‌లో చంద్ర‌బాబు అరెస్ట్ కావ‌డంతో లోకేశ్ పాద‌యాత్ర రెండు నెల‌ల‌కు పైగా ఆగిపోయింది. విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో పాద‌యాత్ర‌ను తిరిగి ప్రారంభించారు. ఈ  నెల 17న ముగింపు స‌భ నిర్వ‌హించ‌త‌ల‌పెట్టారు.

ఈ స‌భ‌కు ప‌వ‌న్‌ను చంద్ర‌బాబు ఆహ్వానించిన‌ట్టు టీడీపీ అనుకూల మీడియాలో వార్త‌లొచ్చాయి. ఇక్క‌డే జ‌న‌సేన శ్రేణులు చిన్న లాజిక్‌ను తెర‌పైకి తెచ్చి టీడీపీ వైఖ‌రిని త‌ప్పు ప‌డుతున్నాయి. ప‌వ‌న్‌ను ఆహ్వానించాలంటే ఆయ‌న ఇంటికెళ్ల‌డం స‌రైంద‌ని, కానీ అందుకు విరుద్ధంగా జ‌ర‌గ‌డాన్ని జ‌న‌సేన సైనికులు గుర్తు చేస్తూ, ఇది ముమ్మాటికీ ప‌వ‌న్‌ను అవ‌మానించ‌డ‌మే అని మండిప‌డుతున్నారు.

హైద‌రాబాద్‌లోని చంద్ర‌బాబు ఇంటికి బుధ‌వారం ప‌వ‌న్ వెళ్లారు. త‌న ఇంటికి వ‌చ్చిన ప‌వ‌న్‌ను లోకేశ్ పాద‌యాత్ర ముగింపు స‌భ‌కు రావాల‌ని చంద్ర‌బాబు ఆహ్వానించ‌డం ఏంట‌ని జ‌న‌సేన శ్రేణులు నిల‌దీస్తున్నాయి. ఇదేనా బాబు సంస్కారం? అని జ‌న‌సేన శ్రేణులు ప్ర‌శ్నిస్తున్నాయి. నిజంగా ప‌వ‌న్‌పై గౌర‌వం వుంటే, చంద్ర‌బాబు ఆయ‌న ఇంటికెళ్లి ఆహ్వానించి వుంటే తాము గౌర‌వంగా భావించే వాళ్ల‌మ‌ని జ‌న‌సేన శ్రేణులు చెబుతున్నాయి. త‌న‌కు తానుగా టీడీపీతో పొత్తు వుంటుంద‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించ‌డంతో బాబు, లోకేశ్‌ల‌కు ప‌వ‌న్ లోకువ అయ్యార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మవుతోంది.

తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే అదే నిజ‌మ‌నిపిస్తోంది. 2014లో ప‌వ‌న్ ఇంటికి చంద్ర‌బాబు వెళ్లి మ‌ద్ద‌తు కోరార‌ని, అదే ఇప్ప‌టి విష‌యానికి వ‌స్తే త‌న చుట్టూ జ‌న‌సేనానిని తిప్పుకుంటున్నారు. చివ‌రికి త‌మ పార్టీ స‌భ‌కు కూడా ఇంటికి పిలిపించుకుని ఆహ్వానించ‌డం అంటే ప‌వ‌న్‌కు ప‌రాభ‌వం కాకుండా మ‌రేంట‌ని జ‌న‌సేన శ్రేణులు వాపోతున్నాయి. బాబును న‌మ్ముకున్నోళ్ల‌కు ఇంత‌కంటే గౌర‌వం ద‌క్కుతుంద‌ని ఆశించ‌డం అజ్ఞానం అవుతుంద‌ని జ‌న‌సేన నేత‌లు అంటున్నారు. టీడీపీ చేతిలో ప‌వ‌న్‌కు అవ‌మానాలు ఇప్పుడే మొద‌ల‌య్యాయ‌ని, రానున్న రోజుల్లో మ‌రెన్నో చూడాల్సి వ‌స్తుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?