భాజపాకూ కరోనా కాటు?

కరోనా మనుషులనే కాదు, వ్యాపారాలను కూడా దెబ్బతీసింది. పారిశ్రామిక రంగం కూడా ఎఫెక్ట్ అయింది. అయితే రాజకీయ పార్టీలకు కరోనా ఫస్ట్ ఫేజ్ సోకలేదు. పైగా ఇమేజ్ ను పెంచింది. అటు భాజపా, ఇటు…

కరోనా మనుషులనే కాదు, వ్యాపారాలను కూడా దెబ్బతీసింది. పారిశ్రామిక రంగం కూడా ఎఫెక్ట్ అయింది. అయితే రాజకీయ పార్టీలకు కరోనా ఫస్ట్ ఫేజ్ సోకలేదు. పైగా ఇమేజ్ ను పెంచింది. అటు భాజపా, ఇటు లోకల్ పార్టీలు కూడా కరోనాను బాగానే డీల్ చేసాయి అనిపించుకున్నాయి. కానీ తీరా సెకెండ్ ఫేజ్ కు వచ్చేసరికి వ్యవహారం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. 

ముఖ్యంగా భాజపా కు కరోనా షాక్ గట్టిగానే తగిలేలా కనిపిస్తోంది. వస్తున్న ఎగ్జిట్ పోల్స్ నిజమై, బెంగాల్ లో కనుక భాజపా విజయావకాశాలు దెబ్బతింటే కరోనా సోకినట్లే. ఇప్పటికే కర్ణాటక లోకల్ ఎలక్షన్లలో భాజపా చాలా గట్టి దెబ్బ తిన్నది. ఇకపై జరిగే అసెంబ్లీ ఎన్నికల వేళకు కర్ణాటకలో భాజపా తట్టా బుట్టా సర్దేసుకోవాల్సిందే అని చిరకాలంగా వినిపిస్తోంది. ఇప్పుడు అదే నిజమయ్యేలా స్థానిక ఎన్నికల ఫలితాలు వచ్చాయి.

కేరళ, తమిళనాడులో భాజపా కు చాన్స్ లేదు. మిగిలిన కీలక రాష్ట్రం బెంగాల్. ఇక్కడ భాజపా వస్తుందనే కొన్ని వారాల క్రిందటి వరకు వినిపించింది.అయితే గత రెండు వారాలు గా భాజపా ప్రతిష్టను కరోనా గట్టిగా దెబ్బతీస్తోంది. మోడీ రిజైన్ చేయాలన్న బలమైన డిమాండ్ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. 

ఎన్నికల కోసం, అధికార దాహం తీరడం కోసం కరోనాను పక్కన పెట్టి, ప్రజలను బలిపెడుతున్నారని జనం గట్టిగా విమర్శిస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణలో కూడా భాజపాకు నెగిటివ్ పెరిగింది. స్టీల్ ప్లాంట్ అమ్మకం అన్నది ఆంధ్రలో భాజపాను కిందకు తొక్కేస్తోంది. జగన్ వ్యాక్సినేషన్ ప్రభుత్వం చేస్తుంది అని ప్రకటించాక కానీ మోడీ అడుగు ముందుకు వేయలేదు.

మొత్తం మీద కరోనా రెండో ఫేజ్ భాజపా ఇమేజ్ ను గట్టిగానే డామేజ్ చేసినట్లు కనిపిస్తోంది. బెంగాల్ లో భాజపా గెలవకూడదు అని కోరే బెంగాలేతరుల సంఖ్య పెరుగుతోంది.అలా అయితేనే మోడీ మారతారని, బెంగాల్ లో అధికారం దక్కితే ఇక అమిత్ షా-మోడీలను తట్టుకోవడం అసాధ్యమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మొత్తం మీద రెండో పర్యాయం సగానికి వచ్చేసరికి మోడీ ప్రభ మసకబారడం ప్రారంభమైంది. మాటలతో ఎన్నాళ్లో జనాలను మాయచేయలేరు అని అర్థం అవుతోంది. జగన్, కేసిఆర్, స్టాలిన్, మమత, ఇలా మరికొంత మంది జమ అయితే వచ్చే ఎన్నికల వేళకు మోడీ మోనోపలీకి ముకుతాడు పడే అవకాశం వుంది.