అసలే మాయలు.. ఆపై సవాళ్లు!

రాజకీయ పార్టీలు సాగించే సభ్యత్వ నమోదు వ్యవహారాలు అంటేనే పెద్ద మాయా ప్రపంచం. సభ్యత్వ నమోదు లెక్కల్లో మాయాజాలం నడుస్తుంటుంది. ప్రతిపార్టీ.. తమకు బోలెడంత మంది ప్రజలు పార్టీ సభ్యలుగా డబ్బు చెల్లించి చేరిపోయినట్లు…

రాజకీయ పార్టీలు సాగించే సభ్యత్వ నమోదు వ్యవహారాలు అంటేనే పెద్ద మాయా ప్రపంచం. సభ్యత్వ నమోదు లెక్కల్లో మాయాజాలం నడుస్తుంటుంది. ప్రతిపార్టీ.. తమకు బోలెడంత మంది ప్రజలు పార్టీ సభ్యలుగా డబ్బు చెల్లించి చేరిపోయినట్లు చెప్పుకుంటూ ఉంటుంది. కానీ.. చాలా పార్టీలకు ఎన్నికల్లో కనీసం.. సభ్యత్వాలు ఉన్నన్ని ఓట్లు కూడా రావు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న పార్టీలలో భాజపా కూడా ఒకటి. కాకపోతే.. ఇలాంటి మాయాజాలం సభ్యత్వాలు మీద వాళ్లిప్పుడు ప్రత్యర్థులకు సవాళ్లు కూడా విసురుతున్నారు.

భాజపా తెలుగు రాష్ట్రాల్లో మరీ అంత బలమైన పార్టీ ఎంతమాత్రమూ కాదు. పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు సీట్లు దక్కినంత మాత్రాన పార్టీకి వైభవ స్థితి ఉన్నట్లు కాదు. ఇంకా పార్టీని బలోపేతం చేసుకునే దిశగానే వారు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి నేతల నుంచి భాజపాకు విమర్శలు ఎదురయ్యాయి. భాజపా సభ్యత్వ నమోదులు మొత్తం ఆన్ లైన్ పద్ధతిలో నడుస్తుండగా.. దీనిని ఎద్దేవాచేస్తూ తెరాస నాయకులు.. ఇలాంటి పద్ధతిలో తెరాస మూడున్నర కోట్ల సభ్యత్వాలు చేయించగలదని సెటైరువేశారు.

దీన్ని భాజపా సీరియస్ గా తీసుకున్నది. పదిరోజుల సమయం తీసుకుని.. తెరాస మూడున్నరకోట్ల సభ్యత్వాలు చేసి చూపాలని సవాలు విసిరారు. తెరాస ఓటర్లిస్టులు దగ్గర పెట్టుకుని.. సభ్యత్వాలు రాసుకుంటున్నదని ఎద్దేవా చేశారు. ఈ విమర్శలు పరస్పరం బాగానే ఉన్నాయి. కానీ.. తెలంగాణలో మూడున్నర కోట్ల మంది ఓటర్లే ఉండరు. మరి అన్ని సభ్యత్వాలు ఎలా వస్తాయి? అన్నదే తమాషా!

అయితే భాజపా ఎందుకింత సవాలు విసురుతోందో తెలియదు. ఎందుకంటే.. ఏపీ విషయానికి వస్తే.. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు.. చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో 50-60 వేల సభ్యత్వాలను నమోదు చేయించారు. అదంతా తమ బలమేనని, వాపు కాదని అన్నట్లుగా భాజపా టముకు వేసుకుంది. అయితే ఎన్నికలు వచ్చేసరికి ఆయా నియోజకవర్గాల్లో వారికి 3, 4 వేల ఓట్లు  కూడా రాలేదు.

తమ పార్టీకి ఉన్న సభ్యత్వాల్లో కనీసం పదిశాతం ఓట్లను కూడా వారు సంపాదించలేకపోయారు. ఏపీలో ఒక్కశాతం ఓట్లతో ఎలా చతికిలపడ్డారో అందరికీ తెలుసు.  వారి స్వానుభవాలు అలా ఉండగా.. ఇప్పుడు మళ్లీ సభ్యత్వనమోదు ప్రహసనం ఆన్‌లైన్ లో నడిపిస్తూ ఇతర పార్టీలకు సవాళ్లు విసురుతుండడమే ఆశ్చర్యం.

తరలించరు.. కానీ తగ్గిస్తారు!