ప్రభాస్..ఇప్పుడు మామూలు ప్రభాస్ కాదు. బాహుబలి ప్రభాస్ తెలుగులో ఆల్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న ఏకైక హీరో. థాంక్స్ టు రాజమౌళి బాహుబలి. అలాంటి బాహుబలి ప్రభాస్ గత రెండేళ్లుగా కష్టపడి చేసిన నాలుగు వందల కోట్ల సాహో సినిమా విడుదల రోజుల్లోకి వచ్చేసింది.
దేశం అంతటా తిరుగుతూ, విశ్రాంతి అన్నది లేకుండా మీడియాతో ముచ్చటిస్తూ వస్తున్న ప్రభాస్ 'గ్రేట ఆంధ్ర' తో కూడా పది నిమషాలు వీలు చూసుకుని మాట్లాడారు.
సినిమా కోసం రెండేళ్లు పడిన కష్టం కన్నా దేశం అంతా తిరుగుతూ, పెద్ద సంఖ్యలో మీడియా ఇంటర్వూలు, మీట్ లు నిర్వహిస్తూ రావడం ఎక్కువ అనిపిస్తోందా?
లేదు. బాహబలి టైమ లో అలా అనిపించింది. కానీ అలవాటైపోయింది. ఇప్పుడు ఇంకో విషయం ఏమిటంటే, సినిమా టెన్షన్ చాలా ఎక్కువ వుంది. దాని ముందు ఈ ప్రచారం హడావుడి అంతా చిన్నగానే అనిపిస్తోంది.
మీ హోమ్ బ్యానర్ లో చేయడం వల్ల వచ్చిన టెన్షన్ అనుకోవాలా?
అంతే కదా? బాహుబలికి రాజమౌళి వున్నారు. ఆయనతో పాటు ఆయన టీమ్ వుంది. మనం ఒక విధంగా రిలాక్స్. కానీ ఇక్కడ అలాకాదు. పైగా నిర్మాతలు నా స్నేహితులు.
అక్కడ రాజమౌళి వుంటే ఇక్కడ ఇప్పుడు బాహుబలి ప్రభాస్ వున్నారు అనుకోవచ్చు కదా.
లేదు. రాజమౌళి వేరు ఆ లెక్క వేరు.
కానీ రాజమౌళి కూడా ప్రభాస్ లేకుంటే బాహుబలి లేదు అన్నారు కదా.
అన్నారు. ఏదో. కానీ ప్రభాస్ ను దేశం అంతా పరిచయం అయ్యేలా చేసింది రాజమౌళే కదా?
ఈశ్వర్, రాఘవేంద్ర సినిమాలు చేసిన రోజుల్లో మీ ఆశలు, లక్ష్యం ఏ రేంజ్ లో వుండేవి?
అప్పుడా? జస్ట్ గుర్తింపు వస్తే చాలు. హీరో గా యాక్సెప్టెన్సీ వస్తే చాలు అని అనిపించేది. అంతే కాదు, ఛత్రపతి దాకా కూడా నేను సరైన దారిలో వెళ్తున్నానా? అనే అనుమానం వెంటాడేది. వర్షం హిట్ అయ్యాక, ఓ హిట్ వచ్చింది అనుకున్నాను. అయినా కూడా వెళ్తున్న రూట్ సరైనదేనా అన్న అనుమానం. ఛత్రపతి తరువాత అనిపించింది. ఒకె. మనం వెళ్తున్న రూట్ కరెక్టే అని.
బిల్లా తరువాత మీకు హాలీవుడ్ తరహా స్టయిలిష్ యాక్షన్ సినిమాల మీద మోజు ఏమన్నా పుట్టి, సాహోకు దారి తీసిందా?
అస్సలు లేదు. అలా అయితే బిల్లా తరువాత మళ్లీ అలాంటి సినిమాలే చేసి వుండేవాడిని కదా? చాలా రకాలు చేసి కదా,ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాను.
సుజిత్ కు అవకాశం ఇస్తున్నపుడు, మీడియా నుంచి ఎలా ఇచ్చారు? అనే ప్రశ్న ఎదురవుతుంది? అని అనుకున్నారా?
కచ్చితంగా. అందరూ అడుగుతారని ఫిక్స్ అయ్యే అవకాశం ఇచ్చాము. కానీ అడిగేవాళ్లకు తెలియాల్సింది ఏమిటంటే, కొరటాల శివకు కూడా అలాగే అవకాశం ఇచ్చాము. ఇప్పుడు ఆయన టాప్ డైరక్టర్.
సాహో సినిమాకు ఆరంభంలో అనుకున్న బడ్జెట్ కు, చివరకు వచ్చేసరికి ఎంత తేడా వుంది?
ఆరంభంలో 150 కోట్ల బడ్జెట్ అవుతుంది అని అంచనా వేసాం. కానీ రాను రాను అది పెరిగిపోయింది.
తగ్గించే ప్రయత్నం ఏమీ చేయలేదా?
వాస్తవానికి తగ్గించే ప్రయత్నం చేసాము. అయితే దాని వల్ల క్వాలిటీ పడిపోతోంది. అందరం కూర్చుని డిస్కస్ చేసాం, ఇక ముందుకే వెళ్దాం అని డిసైడ్ అయ్యాం.
రాజమౌళి టీమ్ చేసిన దానికీ, మీ టీమ్ చేసిన దానికీ ప్లానింగ్ లో కానీ, ఖర్చులో కానీ ఏమన్నా తేడా వుందనే అభిప్రాయం ఎప్పుడన్నా కలిగిందా?
అభిప్రాయం కలగడం అని కాదు కానీ, ఆ తేడా కొంత అయినా వుంటుంది కదా? యువి సంస్థకు ఇంతకు ముందు ఇంత భారీ సినిమాలు తీసిన అనుభవం కూడా లేదు కదా? అందువల్ల కాస్త తేడా కచ్చితంగా వుంటుంది.
సినిమా నిడివి దగ్గర దగ్గర మూడు గంటలు వచ్చింది. అసలు టోటల్ ఫుటేజ్ ఎంత వచ్చింది?
నాలుగు గంటలు వుంటుంది సుమారుగా. యాక్షన్ సినిమాలకు ఇది తప్పదు. మామూలు సినిమా అయినా పది ఇరవై శాతం అదనంగా వుంటుంది. యాక్షన్ సినిమా కాబట్టి, అందులోనో ఇంత భారీ సినిమా కాబట్టి ఈ మాత్రం తప్పదు.
బాహుబలి పార్ట్ వన్, పార్ట్ 2, సాహో ఇలా వరుసగా ఆరేడేళ్ల పాటు భారీ సినిమాలు, వాటి టెన్షన్, ఇంక చాలు అనిపించడం లేదా?
అనిపించకపోవడమా? ఇంక చాలు. ఇప్పట్లో మరి ట్రయ్ చేయను. ఇంత ప్రెజర్ మళ్లీ ఇప్పట్లో వద్దు.
రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమా కూడా భారీనే అని వినిపిస్తోంది.
కాదు, జస్ట్ లవ్ స్టోరీ. అయితే పీరియాడికల్ డ్రామా కాబట్టి, కాస్త ఖర్చు వుంటుంది.
మీరు సింపుల్ సినిమాలు చేద్దాం అనుకున్నా, పాన్ ఇండియా ఇమేజ్ రావడం వల్ల మీరు ఆ రేంజ్ సినిమాలు చేయక తప్పదేమో?
సాహో తరువాత ఆ క్లారిటీ వస్తుంది. ఈ సినిమాను జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు. ఏ ఏరియాల్లో ఎలా వుంటుంది అన్నది అన్నీ తెలియాల్సి వుంది కదా?
ఎందుకు అలా అంటున్నారు. మీకు కాన్ఫిడెన్స్ వుండాలి కదా?
వుంటుంది. కానీ సినిమా అన్నది మన చేతిలో కాదు. జనం చేతిలోకి వెళ్లిన తరువాత వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారు అన్నదాన్ని బట్టి వుంటుంది.
మీరు ఫైనల్ కాపీ చూసే వుంటారు. మీకు ఓ నమ్మకం అనేది ఇప్పటికే వచ్చి వుండాలి కదా?
అది కష్టం. ఎందుకంటే సినిమా లైన్ విన్నదగ్గర నుంచి స్క్రిప్ట్ మేకింగ్, షూటింగ్, ఎప్పటికప్పుడు చూస్తూ వుండడం, ఇలా టోటల్ గా ఆ సినిమా మీద మనకు తెలియకుండా ప్రేమలో పడిపోతాం.
అంటే అలాంటి టైమ్ లో జడ్జిమెంట్ కష్టం అవుతుందన్నది మీ అభిప్రాయం అనుకోవాలా?
అదేం లేదు. వాస్తవం అంతే కదా? బాహబలి టైమ్ లో కూడా నేను ఇలాగే చెప్పాను. సినిమా జయాపజయాలు జనం చేతిలోనే అని. నేను ఎప్పుడు నా సినిమాల గురించి ఇలాగే చెబుతాను. జనాలే డిసైడ్ చేయాలి అని.
అంకెలు లెక్కలు గమనిస్తుంటారా? తొలి రోజు బాహుబలి రికార్డులు దాటుతుందని అనుకోవచ్చా?
అలా ఎలా అనుకుంటాం? బాహబలి వన్ సంగతి పక్కన పెడితే, బాహుబలి 2 అనేది దేశ వ్యాప్తంగా ఓ భయంకరమైన క్యూరియాసిటీ మధ్య విడుదలయింది. దాని కోసం జనం ఆతృతగా ఎదురు చూసారు.
తెలుగునాట అయితే కొత్త రికార్డులు వస్తాయనే అంచనా వుంది.
చూద్దాం. వస్తే ఆనందమే గా.
ఇన్నేళ్లుగా ఇలాంటి సినిమాలు అవిశ్రాంతంగా చేస్తూ వెళ్లడం వల్ల ఫ్యామిలీ లైఫ్ కు దూరం అయిపొతున్నాను అనే బాధ ఏమీ లేదా?
వుంది. కానీ ఏం చేస్తాం. ఈ ఇమేజ్ కావాలి లేదా రావాలి అనుకుంటే భరించాలి. తప్పదు.
సినిమా విడుదల తరువాత ప్లాన్ ఏమిటి?
ముందుగా మూడు నాలుగు రోజులు ఎక్కడో అక్కడికి మాయం అయిపోవాలి. విశ్రాంతి తీసుకుని, వెనక్కు వచ్చి, అప్పుడు ఆలోచించాలి.
థాంక్యూ, ఆల్ ది బెస్ట్
థాంక్యూ
విఎస్ఎన్ మూర్తి