అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణం సందేహాస్పదంగా మారిన విషయంలో ఇప్పుడు అనేక చర్చోపచర్చలు నడుస్తున్నాయి. అది అన్యాయం అని.. తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టడం సహజం. భాజపాలో కూడా… కేవలం తెదేపా నుంచి ఫిరాయించి కమలం గూటికి చేరినవారు మాత్రమే ఈ విషయంలో గోల చేస్తునారు. ఇక పవన్ కల్యాణ్ సంగతి సరే సరి! అయితే రాజధానిలో ప్రభుత్వం రేకెత్తిస్తున్న సందేహాలపై కౌంటర్లు వేస్తున్న ఈ నాయకులు.. కాకమ్మ కబుర్లతో కాలక్షేపం చేయకుండా.. కన్‌స్ట్రక్టివ్ గా మాట్లాడాలని ప్రజలు కోరుకుంటున్నారు.
అమరావతిలో రాజధాని నిర్మాణంపై తొలుత అనుమానాలు వ్యక్తంచేసింది… మంత్రి బొత్స సత్యనారాయణ. అప్పటినుంచే ఈ పుకార్లన్నీ షురూ అయ్యాయి. ఆయన అప్పటికీ ఇప్పటికీ ఒకేమాట చెబుతున్నారు. అమరావతి ప్రాంతంలో రాజధాని కట్టదలచుకుంటే.. ఒక లక్ష వ్యయం అయ్యేచోట అదనంగా రెండు మూడు లక్షలు పెట్టాల్సి వస్తుంది అని అంటున్నారు. అదే నిజమైతే, భారీ స్థాయిలో నిర్మాణాలు చేపట్టవలసి ఉండే అవసరం దృష్ట్యా కొన్ని వేల కోట్ల రూపాయల అనవసరపు ఖర్చు తప్పదు.
అయితే ఆయన మాటల్ని ప్రతిపక్షాలకు చెందిన అందరూ విమర్శిస్తూనే ఉన్నారు. మంచిదే. భూములిచ్చిన రైతులకు అన్యాయం జరగకుండా ఇదే చోట నిర్మాణం జరగాలనే చిత్తశుద్ధే వారికి ఉన్నట్లయితే.. ఇంకాస్త నిర్మాణాత్మకంగా మాట్లాడాలి. బొత్స చెబుతున్నట్లుగా.. నిర్మాణానికి రెట్టింపు కంటె ఎక్కువ వ్యయం అయ్యేమాట నిజమా? కాదా? వారు తేల్చి చెప్పగలగాలి. అలా ఖర్చు పెరుగుతుందని బొత్స చెబుతున్న మాటలు అబద్ధాలు.. సాధారణ ప్రాంతంలో నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో ఇక్కడ కూడా అంతే ఖర్చవుతుంది అని ప్రకటించగలగాలి. కానీ అంత చేవతో మన విపక్షనాయకులు మాట్లాడడం లేదు.
ఏదో గాలివాటుగా నాలుగు విమర్శలు చేసేసి, అమరావతి నుంచి రాజధాని తరలింపు, అక్రమం, అన్యాయం.. రైతులను మోసం చేయకూడదు.. అనేపడికట్టు విమర్శలు తప్ప.. పెరిగేభారం గురించి సరైన అవగాహనతో ఒక్కరూ మాటాడడం లేదు. అందుకే ప్రజలు కూడా ఇలాంటి వారి గురించి.. కాకమ్మ కబుర్లతో కౌంటర్లు వేయడం తగదని అనుకుంటున్నారు.