పీవోకేలో పాక్‌కు నిరసనగళాలు!

ప్రతి ప్రాంతంలోనూ పరస్పర విరుద్ధమైన రెండు భావజాలాలు ఉంటాయి. మౌలికంగా రెండువర్గాలూ అభివృద్ధినే కోరుకుంటాయి. అయితే అందుకోసం ఎంచుకునే మార్గాలకు అనుగుణంగా.. భావజాలాల్లో వైరుధ్యం వస్తుంది. దాన్ని బట్టే వారు ఎవరికి అనుకూలంగా- ప్రతికూలంగా…

ప్రతి ప్రాంతంలోనూ పరస్పర విరుద్ధమైన రెండు భావజాలాలు ఉంటాయి. మౌలికంగా రెండువర్గాలూ అభివృద్ధినే కోరుకుంటాయి. అయితే అందుకోసం ఎంచుకునే మార్గాలకు అనుగుణంగా.. భావజాలాల్లో వైరుధ్యం వస్తుంది. దాన్ని బట్టే వారు ఎవరికి అనుకూలంగా- ప్రతికూలంగా మారుతున్నారనేది నిర్ణయం అవుతుంటుంది. ఆ తరహాలో.. ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీరుగా మనం ప్రస్తుతం వ్యవహరిస్తున్న భూభాగంలో.. పాకిస్తాన్ మీదే.. స్థానిక నాయకుల నిరసన గళాలు తారస్థాయిలో ఎగసి పడుతున్నాయి.

సాధారణంగా కాశ్మీర్ వ్యవహారంలో ఆర్టికల్ 370ని రద్దుచేసి, ఆ రాష్ట్రాన్ని రెండుముక్కలు చేసినప్పుడు.. దేశమంతా మోడీ సర్కారుకు నీరాజనాలు పట్టింది. కాకపోతే మేధావి వర్గానికి చెందిన కొందరు మాత్రం దీన్ని వ్యతిరేకించారు. 370 రద్దు వ్యతిరేకత మాత్రమేకాదు, కాశ్మీరును భారత్ నుంచి వేరుచేసి.. స్వతంత్రంగా వదిలేయాలని.. అవసరాన్ని బట్టి ఏదేశంతో ఉండాలో వాళ్లు డిసైడ్ చేసుకుంటారని అన్నవాళ్లు కూడా ఉన్నారు. సహజంగానే.. మీడియాలో ఏ భావానికి అనుకూలంగా ఉండే మీడియా.. అలాంటి ప్రచారాన్ని మాత్రమే ప్రోత్సహిస్తుంటుంది.

అయితే… ఇప్పుడు పీఓకేలో జెకెఎల్ఎఫ్ పార్టీకి చెందిన నాయకులు.. పాకిస్తాన్ ను తప్పు పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. జెకెఎల్ఎఫ్ అంటే ఉగ్రవాద సంస్థ అని మనకు తెలుసు. కానీ పీఓకేలో అది రాజకీయ పార్టీ. సర్దార్ సాఘిర్ అనే ఆ పార్టీ నాయకుడు.. పాక్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జమ్మూకాశ్మీరులో అస్థిరత సృష్టించేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ప్రవేశపెడుతోందని ఆరోపణలు గుప్పించాడు. టెర్రరిస్టులను కాశ్మీరు మీదికి ప్రయోగించడానికి పీఓకేను పాకిస్తాన్ లాంచ్ ప్యాడ్ లాగా వాడుకుంటున్నదని సాఘిర్ తీవ్ర విమర్శలు చేశారు. దశాబ్దాల నుంచి ఇదే జరుగుతోందని అంటున్నారు.

కాశ్మీరు విముక్తికోసం జరిగే పోరాటాన్ని 1947లోనే పష్తూన్ సైన్యాలను పంపడం ద్వారా పాక్ తొక్కేసిందని, 1980లలో జమ్మూ కాశ్మీర్ ప్రజలు మరో పోరాటం ప్రారంభిస్తే.. పాక్ దానిని టెర్రరిస్టు గ్రూపుల ద్వారా హైజాక్ చేసిందని సాఘిర్ అంటున్నారు. పాకిస్తాన్ గూఢచారి వర్గాలు అన్నిరకాల ఉగ్రవాద గ్రూపులన్ కాశ్మీర్ లో ప్రోత్సహిస్తూ.. శాంతియుతంగా జరుగుతున్న తమ విముక్తి ఉద్యమాన్ని మట్టుపెట్టేశాయని ఆయన అంటున్నారు. పాక్ కు అంతర్జాతీయ సమాజం మద్దతు పలకకపోవడం వింతకాదు. కానీ పీఓకేలో కూడా ఉగ్రవాదానికి బాధ్యులుగా వారినే తప్పుపడుతున్నారంటే ఆలోచించాల్సిందే.

తరలించరు.. కానీ తగ్గిస్తారు!