సర్కారుకు.. ఇల్లలకగానే పండగ కాదు!

రెండునెలలుగా నాన్చివేత వలన.. అనేక విమర్శలను కూడా ఎదుర్కొన్నటువంటి.. ఇసుక టెండర్ల వ్యవహారం.. మొత్తానికి ఆదివారం పూర్తయింది. టెండర్లను తెలిచి.. అతితక్కువ కోట్ చేసిన వారికి ప్రభుత్వం కేటాయించింది. అయితే.. ఇక అంతా సజావుగా…

రెండునెలలుగా నాన్చివేత వలన.. అనేక విమర్శలను కూడా ఎదుర్కొన్నటువంటి.. ఇసుక టెండర్ల వ్యవహారం.. మొత్తానికి ఆదివారం పూర్తయింది. టెండర్లను తెలిచి.. అతితక్కువ కోట్ చేసిన వారికి ప్రభుత్వం కేటాయించింది. అయితే.. ఇక అంతా సజావుగా ఉన్నట్టేనా? వివాదాలు, విమర్శలు అన్నీ సద్దుమణిగినట్టేనా? అంటే అంత ఈజీగా అవునని అనలేని పరిస్థితి! అందుకే టెండర్లు పూర్తయి.. కేటాయించినంత మాత్రాన.. అప్పుడే ఇసుకవిషయంలో పాత దోపిడీలను అరికట్టినట్టు కాదు అని అనుకోవాల్సి వస్తోంది.

ఇసుక టెండర్లు పూర్తయిన నేపథ్యంలో.. అందులో అనేక లొసుగులు కనిపిస్తున్నాయి. ముందు ముందు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అనే అనుమానాలూ ఉన్నాయి. ఎందుకంటే టన్ను ఇసుక తవ్వకానికి ఒకచోట ప్రభుత్వం ఓకే చేసిన ధర 149 అయితే.. మరోచోట కేవలం 15 రూపాయలే. ఇలాంటి వాళ్లు అసలు పని చేపడతారో.. లేదా తమ ప్రత్యర్థులకు టెండరు దక్కకుండా… లిటిగేషన్లు పెట్టడానికి టెండరు వేస్తారో కూడా అర్థంకాని పరిస్థితి.

కొన్ని జిల్లాల్లో ఒక్కొక్క టెండరు మాత్రమే రావడంతో అధికారులు దానిని రద్దుచేసి మళ్లీ టెండర్లు పిలిచారు. రవాణాకు కిమీకి ఎంత? తవ్వకానికి టన్నుకు ఎంత? అనే రకరకాల లెక్కలతో అనేకానేక మతలబులతో మొత్తానికి ఇసుక టెండర్లు ఓకే అయ్యాయి. కొన్నిచోట్ల రీటెండర్లు పిలిచారు. ఇదంతా బాగానే ఉంది. అంతిమంగా… ఈ పద్ధతి ఎంత పారదర్శకంగా అయినా ఉండొచ్చు. అవినీతిని తాము నిర్మూలించేశాం అని.. చాన్సే లేదని.. దోపిడీ అరికట్టామని.. సర్కారు ఎన్ని రకాలుగా అయినా చెప్పుకోవచ్చు గాక!

కానీ.. అంతిమంగా.. రేవులనుంచి ఇసుక వినియోగదారుడి నిర్మాణ స్థలానికి చేరే సరికి ఎంత ధర పడుతోంది? అనేది ఒక్కటే పరిగణనలోకి వస్తుంది. గత ప్రభుత్వంలో ఇసుక ధర ఎంత ఉండేది? ఇప్పుడు ఎంతకు దొరుకుతోంది? అనేది మాత్రమే ప్రజలు చూస్తారు. ఒక ట్రాక్టరు ఇసుక- అప్పటికంటె ఇప్పుడు ఎక్కువ ధర పడిందంటే.. జగన్ ప్రభుత్వాన్ని నిందిస్తారు. ప్రభుత్వం రూపొందించిన విధానం కాగితాల మీద లెక్కల్లో, గణాంకాల్లో అంతా పద్ధతిగానే కనిపించవచ్చు. అంతిమంగా వినియోగదారుడికి చేరేవరకు అదే పారదర్శకత ఉన్నదో లేదో చెక్ చేస్తుండాలి.

చిట్టచివరి దశలో రవాణా చేసేవాడు.. కొంత అక్రమానికి పాల్పడినా, ఎక్కువగా వసూలు చేసినా.. ప్రజల దృష్టిలో ఆ వైఫల్యం మొత్తం ప్రభుత్వానిదే అవుతుంది. అందుకే ఇసుక విషయంలో టెండర్లు పూర్తయ్యాయని సంబరపడిపోతే కుదరదు. మరింత అప్రమత్తంగా ఉండాలి.

తరలించరు.. కానీ తగ్గిస్తారు!